భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తగ్గినట్లు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. ఈ తగ్గుదలను ముందుగానే ఊహించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రాజెక్ట్‌లపై పెట్టే వ్యయం తగ్గడం వల్లనే ఇలా జీడీపీ ముందగమనంలో ఉందని స్పష్టం చేసింది.
2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ వాస్తవ జీడీపీ(ద్రవ్యోల్బణాన్ని పరిగణించిన తర్వాత) వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైంది. గతేడాది సరాసరి అన్ని త్రైమాసికాల్లో కలిపి ఇది 8 శాతంగా ఉంది. ఈసారి జీడీపీ తగ్గడానికి వ్యవసాయం, సేవల రంగం ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తి మెరుగవడం కొంత జీడీపీకి ఊతమిచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ జనాభాలో అత్యధికంగా ప్రాథమిక రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అంటే వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత పాడి పరిశ్రమ, చేపలు, గొర్రెల పెంపంకం, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. ఈ రంగం జీడీపీ వృద్ధిని వెనక్కులాగడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
ప్రాథమిక రంగంతోపాటు సేవల రంగం కూడా జీడీపీ వృద్ధిని వెనక్కి లాగినట్లు ఆర్‌బీఐ తెలిపింది. సేవల రంగంలో వాణిజ్యం, రవాణా, బ్యాంకులు, హోటళ్లు, స్థిరాస్తి.. వంటి విభాగాలు వస్తాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో సేవల రంగం 7.2 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది గతేడాది పది శాతంగా ఉంది. ఇదిలాఉండగా, ఇప్పటికే అమలవుతున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, ఇతర పథకాలు, పెరుగుతున్న వ్యయ సామర్థ్యం వల్ల ప్రారిశ్రామిక రంగం వృద్ధి పథంలో దూసుకుపోతోంది. గతేడాది ఐదు శాతంగా ఉన్న ఈ రంగం వృద్ధి ఈసారి ఏడు శాతానికి చేరింది.
ఇదీ చదవండి: సంపద వృద్ధిలో టాప్ 10 దేశాలు
దేశ వృద్ధిలో సింహభాగం ప్రాథమిక, సేవల రంగాలదే. కాబట్టి వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో విశేష వృద్ధితోపాటు సేవల రంగంలో మెరుగైన ఫలితాలు నమోదైతేనే జీడీపీ గాడిలో పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఆయా రంగాల్లో ప్రోత్సాహకాలు పెంచాలని చెబుతున్నారు. దేశంలోని యువతకు ఆ రంగాల్లో పనిచేసేలా నైపుణ్యాలు అందించి మరింత ఉత్పాదకతను పెంచాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment