వృద్ధి రేటు కట్ | Rangarajan cuts FY14 GDP growth estimate to 5.3 pct | Sakshi
Sakshi News home page

వృద్ధి రేటు కట్

Published Sat, Sep 14 2013 1:26 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM

వృద్ధి రేటు కట్

వృద్ధి రేటు కట్

  •  2013-14లో ఆర్థిక వ్యవస్థపై నివేదిక...
  •   జీడీపీ వృద్ధి అంచనాల్లో భారీగా కోత  విధించిన ప్రధాని ఆర్థిక సలహా మండలి
  •   6.4 శాతం నుంచి 5.3 శాతానికి కట్...
  •   అధిక ద్రవ్య, కరెంట్ అకౌంట్ లోటులు సవాలే...
  •   పెట్రో సబ్సిడీలు తగ్గిస్తేనే వ్యయాల అదుపు సాధ్యం
  •   ఎఫ్‌డీఐ నిబంధనల్లో మరింత సరళీకరణ అవసరం
  •   వృద్ధికి ఊతమివ్వాలంటే బొగ్గు ఉత్పత్తి పెంపు,  స్థిరమైన పన్నుల విధానం కూడా ముఖ్యమే...
  •   నివేదికలో ప్రభుత్వానికి సూచించిన పీఎంఈఏసీ
  • న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలోకి జారిపోవచ్చనే సంకేతాలు బలపడుతున్నాయి. దీనికి నిదర్శనంగా ఈ ఏడాది(2013-14) స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) అంచనాల్లో ఎడాపెడా కోత ప్రకటనలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ కోవలోకి ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి(పీఎంఈఏసీ) నివేదిక కూడా చేరింది. అధిక ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)లు ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా పరిణమిస్తున్నాయని పేర్కొంది. ఈ ఏడాది జీడీపీ వృద్ధి అంచనాల్లో భారీగా కోత పెట్టింది.
     
     ఏప్రిల్‌లో సమీక్ష సందర్భంగా 6.4 శాతంగా వృద్ధిని అంచనా వేయగా.. ఇప్పుడు దీన్ని ఏకంగా 5.3 శాతానికి తగ్గించేసింది. శుక్రవారం ఇక్కడ పీఎంఈఏసీ చైర్మన్ సి. రంగరాజన్ విడుదల చేసిన 2013-14 ఆర్థిక ముఖచిత్ర నివేదికలో ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పెట్రో ఉత్పత్తులపై సబ్సిడీలను భారీగా తగ్గించుకోవడం ద్వారా ప్రభుత్వ వ్యయాలను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని రంగరాజన్ స్పష్టం చేశారు. మధ్య, దీర్ఘకాలంలో వృద్ధిరేటుకు చేయూతనందించాలంటే... విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను మరింత సరళీకరించడం, బొగ్గు ఉత్పత్తి పెంపు, స్థిరమైన పన్ను విధానాలు వంటివి కూడా ముఖ్యమేనని సూచించారు. గత ఆరు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా...ద్వితీయార్ధంలో వృద్ధి కాస్త పుంజుకోవచ్చని రంగరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
     
     కరెన్సీ ఒడిదుడుకుల ఎఫెక్ట్...
     దేశంలో ఆర్థిక వ్యవస్థ రికవరీకి గత కొద్ది నెలలుగా నెలకొన్న కరెన్సీ ఒడిదుడుకులు కూడా దెబ్బకొట్టాయని నివేదిక తెలిపింది. అయితే, క్యాడ్ ఈ ఏడాది 3.8 శాతానికి(70 బిలియన్ డాలర్లు) దిగిరావచ్చని పేర్కొంది. క్రితం ఏడాది ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో(4.8%-88.2 బిలియన్ డాలర్లు) క్యాడ్ ఎగబాకిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది క్యాడ్ అవసరాల కోసం ఫారెక్స్ నిల్వల నుంచి 9 బిలియన్ డాలర్లను ఖర్చుచేయాల్సి రావచ్చనేది పీఎంఈఏసీ అంచనా. మరోపక్క, ద్రవ్యలోటును ఈ ఏడాది 4.8 శాతానికి కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక సమస్యలను పరిష్కరించాల్సి ఉందని రంగరాజన్ పేర్కొన్నారు. ఆర్‌బీఐ కూడా ఈ ఏడాది వృద్ధి అంచనాలను 5.7 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించడం తెలిసిందే. గతేడాది వృద్ధి రేటు దశాబ్దపు కనిష్టానికి(5%) పడిపోగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(క్యూ1)లో నాలుగేళ్ల కనిష్టానికి(4.4%) పడిపోయింది.
     
     నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ...
      మార్చి నాటికి టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 5.5 శాతంగా ఉండొచ్చు. ఈ ఏడాది జూలైలో టోకు ధరల ద్రవ్యోల్బణం 5.79 శాతంగా నమోదుకాగా, ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 9.52%.
      వాణిజ్య లోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఈ ఏడాది కాస్త తగ్గి 185 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చు. గతేడాది(2012-13)లో ఇది రికార్డు స్థాయిలో(195.7 బిలియన్ డాలర్లు) ఎగబాకింది.
      ఈ ఏడాదిలో బంగారం దిగుమతుల విలువ భారీగా తగ్గి 38 బిలియన్ డాలర్లకు పరిమితం కావచ్చు. క్రితం ఏడాది ఇది 53.8 బిలియన్ డాలర్లుగా ఉంది.
     
      ప్రభుత్వం చేయూతనివ్వాలి: కార్పొరేట్లు
     జీడీపీ వృద్ధి రేటు అంచనాల్లో కోత విధిస్తూ పీఎంఈఏసీ విడుదల చేసిన నివేదిక వాస్తవ మందగమన పరిస్థితులను ప్రతిబింభిస్తోందని భారత కార్పొరేట్ వర్గాలు పేర్కొన్నాయి. పెట్టుబడులను ప్రోత్సహించి, వృద్ధికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం, విధానకర్తలు మరిన్ని చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక చాంబర్లు డిమాండ్ చేశాయి. కాగా, ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులను చూస్తుంటే ద్వితీయార్ధంలో ఎలాంటి రికవరీ సంకేతాలూ కనబడటడం లేదని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సీనియర్ ఫెలో రాజీవ్ కుమార్ చెప్పారు. పీఎంఈఏసీ అంచనాలకంటే చాలా తక్కువగా 4.3 శాతానికే ఈ ఏడాది వృద్ధి రేటు పరిమితం కావచ్చన్నారు.
     
     పెట్రో ధరలను ఒకేసారి పెంచేయాలి...
     ప్రభుత్వ వ్యయాల అదుపునకు ముఖ్యంగా డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల రేట్లను అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెంచకతప్పదని రంగరాజన్ స్పష్టం చేశారు. నెలవారీగా పెంపునకు తోడు ఒకేసారి పెట్రో రేట్లను పెంచేయడం ద్వారా తక్షణం ఈ సబ్సిడీలను తగ్గించుకోవాలని సూచించారు. డీజిల్‌పై ప్రభుత్వ నియంత్రణను పాక్షికంగా తొలగించిన నేపథ్యంలో నెలకు అర్ధరూపాయి చొప్పున ధర పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెట్రోలుపై పూర్తిగా నియంత్రణ ఎత్తివేయడంతో ధర చుక్కలనంటుతోంది.
     
     వ్యవ‘సాయం’...
     మెరుగైన రుతుపవన వర్షపాతం నేపథ్యంలో ఈ ఏడాది వ్యవసాయ రంగం సానుకూల వృద్ధిని నమోదుచేయనుందని నివేదిక పేర్కొంది. 4.8 శాతం వృద్ధిరేటు ఉండొచ్చని(గతేడాది 1.9 శాతమే) అంచనావేసింది.  అదేవిధంగా పారిశ్రామిక వృద్ధిరేటు కూడా 2.7 శాతం ఉంటుందని అభిప్రాయపడింది. అయితే,సేవల రంగం వృద్ధి మాత్రం 6.6 శాతానికి పడిపోవచ్చని అంచనా వేసింది.
     
     రూపాయి స్థిరపడ్డాకే పాలసీ సడలింపు
     డాలరుతో రూపాయి మారకం విలువ భారీగానే క్షీణించిందని, అయితే, త్వరలోనే కరెన్సీకి స్థిరత్వం వచ్చే అవకాశాలున్నాయని రంగరాజన్ పేర్కొన్నారు. ఆర్‌బీఐ, ప్రభుత్వ చర్యల ప్రభావంతో విదేశీ నిధుల ప్రవాహం పెరగడం, క్యాడ్ తగ్గుదల వంటివి కరెన్సీ విలువ బలపడేందుకు దోహదం చేయొచ్చన్నారు. అయితే, రూపాయి విలువ ఇంకా తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూస్తున్న నేపథ్యంలో ఇది స్థిరపడేదాకా ఆర్‌బీఐ ప్రస్తుతం అనుసరిస్తున్న పాలసీ విధానాన్నే కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తద్వారా ఈ నెల 20న చేపట్టనున్న పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు తక్కువేనన్న సంకేతాలిచ్చారు.  ఏప్రిల్ నుంచి చూస్తే రూపాయి విలువ 20 శాతం పైగానే కుప్పకూలి.. తాజాగా ఆల్‌టైమ్ కనిషాన్ని(68.80)ని తాకడం తెలిసిందే.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement