ఆహార ధరలే గుదిబండ
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆర్థికమంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. మిగిలిన స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించి ఆయన కొంత సానుకూల వాతావరణ పరిస్థితి ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ- క్యాడ్), ద్రవ్యలోటు తదితర అంశాలను ప్రస్తావించారు. ప్రజలు వినియోగ సంస్కృతిని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ ధోరణి పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుందని అన్నారు. వివిధ అంశాలపై ఆయన వివరణలు క్లుప్తంగా...
క్యాడ్‌కు కళ్లెం వేస్తాం...
క్యాడ్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.7 శాతానికి అంటే దాదాపు 70 బిలియన్ డాలర్లకు తగ్గుతుందని తొలుత అంచనావేశాం. అయితే ఇప్పుడు ఇది 60 బిలియన్ డాలర్ల వరకూ తగ్గుతుందని భావిస్తున్నాం. బంగారం దిగుమతులు భారీగా తగ్గుతుండడం దీనికి దోహదపడుతుందని విశ్వసిస్తున్నాం. సెప్టెంబర్‌లో ఈ దిగుమతుల పరిమాణం 11.16 టన్నులయితే ఇది అక్టోబర్‌లో 23.5 టన్నులకు చేరింది. అయినా ఈ విషయంలో ఏమీ భయపడ్డం లేదు. ఆర్థిక సంవత్సరం మొత్తంలో పసిడి దిగుమతులు గణనీయంగా తగ్గుతాయనే అంచనాలు ప్రభుత్వానికి ఉన్నాయి. ( క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్-ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీ మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. గత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణం స్థూల దేశీయోత్పత్తి -జీడీపీలో ఇది 4.8 శాతం -88.2 బిలియన్ డాలర్లు). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ మధ్య క్యాడ్ జీడీపీలో 4.9 శాతంగా ఉంది.
లక్ష్యం దాటని ద్రవ్యలోటు
ద్రవ్య క్రమశిక్షణ, ద్రవ్యలోటు వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అలాగే ఆయా అంశాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చొరవలు ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తున్నాం. ఇవి స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి దోహదపడతాయి. జీడీపీలో 4.8 శాతానికి ద్రవ్యలోటు కట్టడి జరుగుతుందని భావిస్తున్నాం. అదే విధంగా రూ.40,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధిస్తాం.
క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్... రూపాయిపై...
దేశానికి క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ పరిస్థితి బాగుంది. గడచిన 78 వారాల్లో భారత్ విదేశీ మారకపు నిధులకు 9 బిలియన్ల డాలర్ల అదనపు తోడయ్యాయి. దేశీయ కరెన్సీ డాలర్ల మారకంలో గడచిన కొన్ని వారాలుగా 61 నుంచి 62 వద్ద ట్రేడవుతోంది. మరిన్ని క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ వస్తాయని భావిస్తున్నాం. ఇదే జరిగితే రూపాయి మరింత బలపడుతుంది. ఇది 60-61 శ్రేణికి వస్తుంది. అది మంచి సంకేతం.
ఎన్‌ఎస్‌ఈఎల్ సంక్షోభం విస్తరించదు
ఫైనాన్షియల్ టెక్నాలజీస్ నిర్వహిస్తున్న ఇతర ఎక్స్ఛేంజ్‌లకు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈఎల్) చెల్లింపుల సంక్షోభం విస్తరించదు. ఫైనాన్షియల్ టెక్నాలజీస్ నిర్వహిస్తున్న ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ని సెబీ పర్యవేక్షిస్తోంది, అదేవిధంగా ఫార్వార్డ్ మార్కెట్స్ కమిషన్(ఎఫ్‌ఎంసీ) నియంత్రణ కింద మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎంసీఎక్స్) పనిచేస్తోంది. ఆయా అంశాల విషయంలో ఆందోళన అక్కర్లేదు. ఎన్‌ఎస్‌ఈఎల్ బిజినెస్ సరైన నియంత్రణ సంస్థ పరిధిలో పనిచేయకపోవడం సమస్యకు కారణమయ్యింది.
ఫెడ్ నిర్ణయాలను ఎదుర్కొనగలం
ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రకటించిన సహాయక చర్యలను అమెరికా సెంట్రల్ బ్యాంక్... ఫెడరల్ రిజర్వ్ క్రమంగా ఉపసంహరించుకుంటుందని వార్తలు వస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో ఇది జరగవచ్చని మనం భావించాం. మార్చిలో జరగవచ్చని వారు (ఫెడ్) తాజాగా పేర్కొంటున్నారు. అయితే అదే జరిగితే దీనిని ఎదుర్కొనడానికి అటు మార్కెట్లు, ఇటు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి. ఈ కోణంలో మనం ఆర్థిక ఫండమెంటల్స్‌ను మరింత పటిష్టం చేసుకోవాలి. క్యాడ్, ద్రవ్యలోటు కట్టడి, ఆదాయాలు మెరుగుపరచుకోవడం, కరెన్సీపై స్పెక్యులేషన్‌కు తావులేని చర్యలు తీసుకోవడం వంటివి ఇక్కడ దోహదపడతాయి. ఫెడ్ ఉపసంహరణల వల్ల ఏదైనా ప్రభావం ఉన్నా.... అది కేవలం నామమాత్రంగానే ఉంటుంది.
నేనే సీఎంనైతే..
అధిక ద్రవ్యోల్బణంతో చాలా ఇక్కట్లు ఎదుర్కోవాల్సివస్తోంది. ఆహారోత్పత్తుల ధరల తీవ్రత పరిస్థితిని మరింత దిగజార్చుతోంది. పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు ఇతరత్రా ఆహార, నిత్యావసర ఉత్పత్తులు ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయి. ఇక ఉల్లిపాయల ధర వార్షిక ప్రాతిపదికన 300 శాతం పైగా పెరిగింది. కూరగాయలు, పండ్లు ధరలూ ఎగబాకాయి. ట్రేడర్లు అంటే హోల్‌సేలర్లు, రిటైలర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దగా చేసేదేమీ ఉండబోదు. రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఆయా అంశాలు ఉంటాయి. నేనే గనుక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండిఉంటే, నిత్యావసర వస్తువుల చట్టం ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించి ఉండేవాడిని. ఉల్లిపాయల అక్రమ నిల్వలకు పాల్పడే వారి భరతం పట్టేవాడ్ని.