దేశ ఆర్థిక వ్యవస్థ ఇటీవలి కాలంలో అంచనాలను మించలేకపోతుంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దేశార్థికం భారతీయ రిజర్వు బ్యాంకు ఆశించిన ఆశించినంత వృద్ధి రేటు సాధించలేకపోయింది. 7 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తే ఈసారి కనిష్ఠంగా 5.4 శాతం వృద్ధి కనబరిచింది. గడిచిన త్రైమాసికంలో అదే తంతు కొనసాగింది. ఏప్రిల్-జూన్ కాలంలో అంచనా వేసిన 7.1 శాతం వృద్ధిని చేరుకోలేక 6.7 శాతంతో సరిపెట్టుకుంది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఆశించినంత పెరగదని రిజర్వు బ్యాంకు ముందుగానే అంచనా వేసింది. అందుకు విభిన్న అంశాలు కారణమని ఆర్‌బీఐ విశ్లేషించింది. ఎన్నికల వల్ల వివిధ పథకాలు, ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయం తగ్గడం, వ్యవసాయ, సేవా రంగాల్లో క్షీణత జీడీపీ వృద్ధికి నిరోధంగా నిలిచాయి. రెండో త్రైమాసికంలోనూ ఆర్థిక వృద్ధిని వెనక్కు లాగిన కొన్ని అంశాలను ఆర్‌బీఐ వెల్లడించింది.
వేతనాల్లో మార్పు లేకపోవడం: కొన్ని రాష్ట్రాల్లో వాస్తవ వేతన వృద్ధిలో ఎలాంటి మార్పులు లేవు. దాంతో వృద్ధికి ప్రతికూలంగా మారింది. ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది.
అధిక ఆహార ద్రవ్యోల్బణం: రిటైల్ ఆహార ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇది పట్టణ వినియోగాన్ని ప్రభావితం చేస్తోంది.
బలహీనమైన తయారీ రంగం: తయారీ రంగం 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కేవలం 2.2 శాతం మాత్రమే వృద్ధి చెందింది.
తగ్గిన ప్రభుత్వ వ్యయం: ప్రభుత్వ మూలధన వ్యయం తగ్గుతోంది. దానివల్ల ఉపాధి సృష్టి జరగక వినియోగం మందగిస్తోంది. ఫలితంగా ఆర్థిక వృద్ధి సన్నగిల్లుతోంది.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు: మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి వంటి రంగాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా పడింది. ఆయా విభాగాల్లో ఉత్పత్తి తగ్గిపోయింది.
కార్పొరేట్ ఆదాయాలు: చాలా కంపెనీలు రెండో త్రైమాసికంలో ఆశించినమేర ఆదాయాలు పోస్ట్ చేయలేదు. ఇది వస్తు వినియోగం తగ్గుదలను సూచిస్తుంది.
ఇదీ చదవండి: ఈపీఎఫ్‌ఓ క్లెయిమ్ తిరస్కరించారా? ఇవి తెలుసుకోండి!
ఈ ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసికంలో భారతదేశ వాస్తవ జీడీపీ రూ.43.64 లక్షల కోట్లకు చేరుకుంది. అది రెండో త్రైమాసికంలో రూ.44.1 లక్షల కోట్లకు పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని అంచనా వేసిన స్థూల దేశీయోత్పత్తిని ‘వాస్తవ జీడీపీ’ అంటారు. ఒక ప్రాతిపదిక సంవత్సర ధరలను తీసుకుని ద్రవ్యోల్బణం వల్ల వాటిలో వచ్చిన మార్పులను సరిచేస్తే వాస్తవ జీడీపీ వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment