
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) క్లెయిమ్‌లు గత కొంతకాలంగా ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈపీఎఫ్‌ఓ వార్షిక నివేదిక ప్రకారం 2023లో దాదాపు ఆరు కోట్ల ఉపసంహరణ దరఖాస్తులు నమోదైతే అందులో సుమారు 27 శాతం తిరస్కరణకు గురయ్యాయి. అయితే క్లెయిమ్ రెజక్ట్ అయ్యేందుకు చాలా కారణాలున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
వ్యక్తిగత వివరాలు సరిగా లేకపోవడం: క్లెయిమ్ ఫారం, ఈపీఎఫ్ఓ రికార్డుల్లో ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారంలో తేడా ఉండడం వల్ల క్లెయిమ్ తిరస్కరించబడుతుంది.
కేవైసీ పూర్తి చేయకపోవడం: ఆధార్, పాన్ లేదా బ్యాంక్ వెరిఫికేషన్ వంటి వాటిలో కేవైసీని అప్‌డేట్ చేయాలి. లేదంటే క్లెయిమ్ నిలిపేసే అవకాశం ఉంటుంది.
తప్పుడు బ్యాంకు వివరాలు: బ్యాంకు ఖాతా నంబర్ లేదా ఐఎప్‌ఎస్‌సీ కోడ్‌లో తప్పుల వల్ల క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు.
యూఏఎన్: ఇన్ యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో క్లెయిమ్ నమోదు చేస్తే రెజెక్ట్ అవుతుంది.
తగినంత బ్యాలెన్స్ లేకపోవడం: క్లెయిమ్ చేసిన మొత్తాన్ని కవర్ చేయడానికి ఈపీఎఫ్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే క్లెయిమ్ ఇవ్వరు.
పెండింగ్ బకాయిలు: ఈపీఎఫ్ఓకు చెల్లించాల్సిన బకాయిలు క్లియర్ అయ్యే వరకు క్లెయిమ్ అందించరు. కొన్నిసార్లు యాజమాన్యం చెల్లించాల్సిన ఈపీఎఫ్‌ఓ కాంట్రిబ్యూషన్‌ను జమ చేయడం ఆలస్య అవుతుంది. అలాంటి సందర్భాల్లో క్లెయిమ్ రాదు.
కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు, నిబంధనల ప్రకారం సర్వీసు లేకుండానే దరఖాస్తు చేస్తుండడం వంటి కారణాల వల్ల క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంది.

Comments
Please login to add a commentAdd a comment