Nirmal Sita Raman
-
ఎకానమీ స్పీడ్ 6.4 శాతమే..
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మార్చితో ముగిసే ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతానికి పడిపోయే అవకాశాలు ఉన్నాయని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ముందస్తు అంచనాలు సూచిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ రేటు నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయి అవుతుంది. ముఖ్యంగా తయారీ, సేవల రంగాల పనితీరు బలహీనంగా ఉండడం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. 2020–21లో కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8 శాతం క్షీణతను నమోదుచేసిన సంగతి తెలిసిందే.అటు తర్వాత 6.4 శాతం వృద్ధి రేటు నమోదయితే అది నాలుగేళ్ల కనిష్ట స్థాయి అవుతుంది. బేస్ ఎఫెక్ట్‌తో 2021–22లో ఎకానమీ వృద్ధి రేటు 9.7 శాతంగా నమోదయ్యింది. 2022–23లో 7 శాతం, 2023–24లో 8.2 శాతంగా ఈ రేట్లు ఉన్నాయి. 2024–25పై జాతీయ గణాంకాల కా ర్యాలయం తాజా అంచనాలు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) డిసెంబర్ 2024లో అంచనా వేసిన 6.6 శాతంతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వశాఖ తొలి అంచనా 7 శాతంకన్నా కూడా ఈ అంచానలు తక్కువగా ఉండడం గమనార్హం. ఆర్బీఐ పాలసీ అంచనాలు ఇవీ.. ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 6.6 శాతంగా అంచనావేసిన ఆర్బీఐ ఇటీవలి ద్రవ్య పరపతి విధాన సమీక్ష క్యూ3లో 6.8 శాతం, క్యూ4లో 7.2 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని, 2025–26 మొదటి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) వరుసగా 6.9 శాతం, 7.3 శాతం వృద్ధి నమోదవుతుందని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 6.7 శాతం వృద్ధి నమోదవగా, రెండవ క్వార్టర్లో 7 క్వార్టర్ల కనిష్ట స్థాయి లో 5.4 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.కీలక రంగాలపై అంచనాలు..తయారీ రంగం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 5.3 శాతంగా అంచనా. గత ఆర్థిక సంవత్సరం ఈ విభాగం 9.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. సేవల రంగం: ఎకానమీలో మెజారిటీ వాటా కలిగిన ఈ రంగం వృద్ధి అంచనా 5.8 శాతం. 2023–24లో ఈ రేటు 6.4 శాతం. వ్యవసాయం: కొంత మెరుగైన ఫలితం వెలువడనుంది. 3.8 శాతం వృద్ధి నమోదవుతుందని గణాంకాలు అంచనా వేస్తున్నాయి. 2023–24లో 1.4 శాతంతో పోలిస్తే ఇది మెరుగైన స్థాయి కావడం గమనార్హం. ఎకానమీ లెక్కలు ఇలా... ⇒ 2024–25లో ఎకానమీ విలువ 3.8 ట్రిలియన్ డాలర్లు (డాలర్ మారకంలో రూపాయి విలువ రూ.85.71 ప్రాతిపదికన) ⇒ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుత ధరల ప్రకారం 2024–25లో జీడీపీ విలువ అంచనా రూ. 324.11 లక్షల కోట్లు, 2023–24లో ఈ విలువ రూ. 295.36 లక్షల కోట్లు. అంటే వృద్ధి 9.7 శాతం. ⇒ ప్రైవేట్ తుది వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 7.3 శాతం. గత సంవత్సరంలో ఈ రేటు 4 శాతం. ప్రభుత్వ తుది వినియోగ వ్యయం (జీఎఫ్‌సీఈ): 2024–25లో 4.1 శాతం వృద్ధి, 2023–24లో ఈ రేటు 2.5 శాతం. తలసరి ఆదాయం: ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకోకుండా 2024–25లో ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం 8.7 శాతం పెరిగి రూ. 2,00,162కు చేరుకునే అవకాశం ఉంది. 2023–24లో ఈ విలువ రూ. 1,84,205. ముందస్తు గణాంకాల ప్రాధాన్యత!ఫిబ్రవరి 1న లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్న కేంద్ర బడ్జెట్‌కు సన్నాహకంగా తాజా ముందస్తు అంచనాలు ఉపయోగపడతాయి. తగిన అంచనాలు... 2024–25 ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలు సమంజసంగానే ఉన్నాయి. అయితే కొన్ని రంగాలు అధిక వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఎకానమీపై కూడా అంతర్జాతీయ అనిశ్చితిలు, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం పడే అవకాశం ఉంది. ఆయా అంశాలు పరిగనణలోకి తీసుకుంటూ 2025–25లో జీడీపీ వృద్ధి రేటును 6.5 శాతంగా మేము అంచనా వేస్తున్నాం. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్మూలధన వ్యయ తగ్గుదల ప్రభావం కరోనా మహమ్మారి తర్వాత ఎకానమీ పురోగతిలో ప్రభుత్వ మూలధన వ్యయాలు కీలకంగా మారాయి. వీటి తగ్గుదల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ఇక పట్టణ ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణం అలాగే రుణ వృద్ధి మందగమనం సవాళ్లను ఎదుర్కొంటోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల విశ్వాసం తగ్గింది. పట్టణ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపే రిటైల్ క్రెడిట్ వృద్ధి మందగించింది. – ధర్మకీర్తి జోషి, క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్వృద్ధి 6.2 శాతానికి పరిమితం: హెచ్ఎస్బీసీప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.2 శాతమేనని విదేశీ బ్రోకరేజ్ సంస్థ– హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది. అధికారిక అంచనాతో పోలిస్తే ఇది మరింత తక్కువగా ఉండడం గమనార్హం. అయితే ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.5 శాతానికి పెరుగుతుందని నివేదిక విశ్లేíÙంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై –సెప్టెంబర్) వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదుకావడం నిరాశాజనకంగా ఉన్నట్లు హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది. క్యూ2 తర్వాత పరిస్థితులు మెరుగు... ‘‘మేము విశ్లేíÙంచే 100 సూచికల ప్రకారం సెప్టెంబర్ తరువాత వృద్ధి సూచికలు మెరుగుపడ్డాయి. అయితే జూన్ త్రైమాసికంతో ఇంకా బలహీనంగానే ఉన్నాయి’’ అని నివేదిక పేర్కొంది. జూలై–సెపె్టంబర్ కాలంలో 55 శాతం సూచికలు సానుకూలంగా వృద్ధి చెందగా, డిసెంబర్ త్రైమాసికంలో ఇది 65 శాతానికి పెరిగిందని తెలిపింది. వ్యవసాయం, ఎగుమతులు, నిర్మాణ రంగాల్లో మెరుగుదల అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నివేదిక తెలిపింది. ఇటీవల వారంలో చాలా చర్చనీయాంశంగా మారిన పట్టణ వినియోగంలో కూడా డిసెంబర్ త్రైమాసికంలో కొంత మెరుగుదల కనిపించిందని నివేదిక పేర్కొంది.అయితే, వినియోగ విద్యుత్ సేవలు, ప్రైవేటు పెట్టుబడుల సూచికలు ఇంకా బలహీనంగానే ఉన్నాయని తెలిపింది. జూన్ త్రైమాసికంలో 75 శాతం సూచికలు సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి అంత బాగోలేదని నివేదిక వెల్లడించింది. 2024–25లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.9 శాతంగా ఉంటుందని, 2025–26లో ఇది 4.4 శాతానికి నివేదిక పేర్కొంది. నవంబరులో 5.5 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం డిసెంబరులో 5.3 శాతానికి, జనవరిలో 5 శాతం కంటే తక్కువకు పడిపోతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. అరశాతం రెపో రేటు కోత అంచనా... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధానం ఫిబ్రవరి, ఏప్రిల్ విధాన సమీక్షలలో 0.25 శాతం చొప్పున రెండు రేట్ల కోత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. వృద్ధే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ ప్రస్తుత 6.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గే అవకాశం ఉంది. 2025–26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయడానికి వ్యయ నియంత్రణ అవసరమని పేర్కొన్న నివేదిక, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుండడమే దీనికి కారణంగా వివరించింది. -
కరోనా కల్లోలం.. ఆర్థిక ఉపశమనం!
న్యూఢిల్లీ : కోవిడ్–19 వైరస్ కారణంగా ప్రజలు, వ్యాపారస్తులు ఇళ్లకే పరిమితమవుతున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సర్కారు ఉపశమన చర్యలను ప్రకటించింది. ఆదాయపన్ను రిటర్నులు, జీఎస్టీ రిటర్నుల దాఖలు గడువులను పెంచింది. ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో లావాదేవీల చార్జీలు, బ్యాంకు ఖాతాల్లో బ్యాలెన్స్ నిర్వహణ చార్జీలను మూడు నెలల పాటు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ప్రకటించారు. ►2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసే గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ►అలాగే, గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్టీ వార్షిక రిటర్నుల దాఖలు గడువు ఈ నెలాఖరు వరకే ఉండగా, ఇది సైతం జూన్ 30 వరకు పెరిగింది. ►మార్చి, ఏప్రిల్, మే నెలల జీఎస్టీ రిటర్నులను ఎటువంటి జరిమానాలు లేకుండా జూన్ నెలాఖరు వరకు దాఖలు చేసుకోవచ్చు. దీంతో ఆలస్యపు రిటర్నులపై రూ.5 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈలకు పెనాల్టీ, ఆలస్యపు రుసుములు ఉండవు. రూ.5 కోట్ల టర్నోవర్ దాటిన వారు సైతం జూన్ నెలాఖరు వరకు రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. కానీ, గడువు దాటిన తర్వాత కాలానికి 9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ►ఆధార్, పాన్ అనుసంధాన గడువు జూన్ 30 వరకు పెరిగింది. ►ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో డెబిట్‌కార్డు లావాదేవీలపై ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన పని లేదు. ఇది మూడు నెలల పాటు అమల్లో ఉంటుంది. మెట్రోల్లో ఇతర బ్యాంకు ఏటీఎంల్లో లావాదేవీలు మూడు మించితే, నాన్ మెట్రోలో ఐదు లావాదేవీల తర్వాత ప్రస్తుతం చార్జీ విధిస్తున్నారు. ►సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహణలో విఫలమైతే వసూలు చేసే చార్జీలను తాత్కాలికంగా ఎత్తివేసింది. ►డిజిటల్ రూపంలో చేసే వాణిజ్య లావాదేవీల చార్జీలతగ్గింపు. ►ఆదాయపన్ను వివాదాల పరిష్కారానికి తీసుకొచ్చిన వివాద్సే విశ్వాస్ పథకం గడువు జూన్ 30 వరకు పొడిగింపు. దీనివల్ల జూన్ నాటికి చేసే చెల్లింపులపై అదనంగా 10 శాతం చార్జీ ఉండదు. ►పొదుపు సాధనాల్లో పెట్టుబడులు లేదా మూలధన లాభాల పన్ను ఆదా కోసం చేసే పెట్టుబడుల గడువు, నోటీసుల జారీ గడువును కూడా మూడు నెలలు పొడిగించారు. ►ముందస్తు పన్ను చెల్లింపులు, స్వీయ పన్ను మదింపు, రెగ్యులర్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్, ఎస్టీటీ ఆలస్యపు చెల్లింపులపై వడ్డీ రేటు 12/18 శాతానికి బదులు 9 శాతం వసూలు చేస్తారు. ►కంపెనీల డైరెక్టర్ల బోర్డులు చట్ట ప్రకారం 120 రోజులకోసారి సమావేశం కావాల్సి ఉండగా, ఈ గడువును కూడా మరో 60 రోజులు పొడిగించారు. దివాలా చర్యల సడలింపు ప్రస్తుతం రూ.లక్ష మేర రుణ చెల్లింపుల్లో విఫలమైతే దివాలా చర్యలను ఎదుర్కోవాల్సి వచ్చేది. దీన్ని రూ.కోటికి పెంచినట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎంఎస్ఎంఈ) పెద్ద ఎత్తున దివాలా చర్యలు ఆగిపోతాయని మంత్రి చెప్పారు. ‘‘ప్రస్తుత పరిస్థితే ఏప్రిల్ 30 తర్వాత కూడా కొనసాగితే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) 2016 చట్టంలోని సెక్షన్ 7, 9, 10లను ఆరు నెలల పాటు సస్పెండ్ చేయడాన్ని పరిశీలిస్తాము. దీనివల్ల కంపెనీలు పెద్ద సంఖ్యలో దివాలా చర్యల బారిన పడకుండా నిరోధించినట్టు అవుతుంది’’ అని మంత్రి తెలిపారు. అతి త్వరలో ప్యాకేజీ ఆర్థిక ఉపశమన ప్యాకేజీ ముగింపు దశలో ఉందని, దీన్ని అతి త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి సీతారామన్ తెలిపారు. ‘‘ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రతీ దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. ప్రధానమంత్రి సైతం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని ప్రకటించిన కోవిడ్–19 ఎకనమిక్ టాస్క్‌ఫోర్స్ కూడా పని ప్రారంభించింది. టాస్క్‌ఫోర్స్ పని ఎన్నో అంచనాలతో కూడుకుని ఉంటుంది. దాదాపుగా ఇది ముగింపు దశలో ఉంది’’ అని మంత్రి వివరించారు. స్టాక్ మార్కెట్లను గమనిస్తున్నాం ఆర్థిక శాఖ, ఆర్బీఐ, సెబీ తదితర అన్ని ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు కలసి కట్టుగా పనిచేస్తూ.. కోవిడ్–19 కారణంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అస్థిర పరిస్థితులను, పరిణామాలను గమనిస్తున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. రోజులో మూడు పర్యాయాలు పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే సెబీ కొన్ని చర్యలను ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కోవిడ్–19 మన దేశంలోకి ప్రవేశించిన నెల రోజుల్లోనే సెన్సెక్స్ 15 వేల పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 4 వేల పాయింట్లకు పైగా పడిపోయిన విషయం తెలిసిందే. -
ఫార్మాకు ‘కోవిడ్’ ఫీవర్!!
న్యూఢిల్లీ: చైనా సహా పలు దేశాలకు విస్తరించిన కరోనావైరస్ సెగ దేశీ ఫార్మా పరిశ్రమకు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ చైనాలో పరిస్థితులు గానీ సత్వరం చక్కబడకపోతే ఔషధాల్లో ఉపయోగించే ముడి వస్తువుల రేట్లు గణనీయంగా పెరగవచ్చని ఫార్మా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ‘ఇదే పరిస్థితి కొనసాగితే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ) ధరలు పెరిగిపోతాయి‘ అని జైడస్ గ్రూప్ చైర్మన్ పంకజ్ పటేల్ వెల్లడించారు. 2018–19 గణాంకాల ప్రకారం.. భారత సంస్థలు దిగుమతి చేసుకునే బల్క్ డ్రగ్స్‌లో సింహభాగం 67.56 శాతం వాటా చైనాదే ఉంది. కరోనా వైరస్‌కు సంబంధించి తాజా పరిస్థితులపై ఫార్మాతో పాటు టెక్స్టైల్స్, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ హార్డ్‌వేర్, సోలార్, ఆటో, సర్జికల్ ఎక్విప్మెంట్స్, పెయింట్స్ తదితర రంగాల ప్రతినిధులు మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. దేశీ పరిశ్రమలపై కరోనావైరస్ ప్రతికూల ప్రభావాలు పడకుండా చూసేందుకు ప్రభుత్వం త్వరలో తగు చర్యలు ప్రకటిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఆందోళన వద్దు: నిర్మలా సీతారామన్ కీలక ముడి వస్తువుల దిగుమతుల్లో జాప్యం వల్ల ఫార్మా, కెమికల్, సౌర విద్యుత్ పరికరాల రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే, కరోనావైరస్ కారణంగా ధరల పెరుగుదల గురించి ఆందోళన అక్కర్లేదని ఆమె చెప్పారు. ఔషధాలు, మెడికల్ పరికరాల కొరత లేదన్నారు. కొన్ని ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఫార్మా పరిశ్రమ కోరుతోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. మరోవైపు, దేశీ ఫార్మా సంస్థలకు ఏపీఐల సరఫరాపై కరోనావైరస్ ప్రభావాల మీద ఫార్మా విభాగం (డీవోపీ) అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనాలో నూతన సంవత్సర సెలవుల కారణంగా గత 20–25 రోజులుగా సరఫరా ఆగిపోయిందని పేర్కొన్నాయి. బల్క్ డ్రగ్స్ కోసం భారత ఫార్మా సంస్థలు ఎక్కువగా చైనా మీదే ఆధారపడుతున్నాయి. రెండు, మూడు నెలల స్టాక్ మాత్రమే ఉంది: ఐపీఏ భారత ఔషధ పరిశ్రమ వద్ద రెండు, మూడు నెలలకు సరిపడ మాత్రమే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ నిల్వలు ఉన్నాయని ఇండియా ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) వెల్లడించింది. చైనా నుంచి ఏటా రూ.17,000 కోట్ల విలువైన ముడి సరుకు (ఏపీఐ) భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఆ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్టు ఐపీఏ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ తెలిపారు. బయో ఆసియాలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడారు. ‘క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఏం జరుగుతుందో ఊహించే పరిస్థితి లేదు. రెండు, మూడు నెలలకు సరిపడ మాత్రమే నిల్వలున్నాయి. మార్చి మొదటి వారం నుంచి సాధారణ స్థితి నెలకొంటుందని భావిస్తున్నాం’ అన్నారు. -
కంపెనీల చట్టంపై కేంద్రం సమీక్ష
21న సమావేశం: నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ: కొత్తగా రూపొందించిన 2013 కంపెనీల చట్టంపై ఉన్న ఆందోళనలను పరిగణలోకి తీసుకుంటామని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. తద్వారా చట్టానికి సవర ణలు అవసరమా లేదా అనే విషయాన్ని నిర్దారిస్తామని ఒక చానెల్ తెలి పారు. చట్టానికి సవవరణలు చేయాలని గత కొన్ని నెలలుగా డిమాండ్లు వస్తున్నాయని, అవసరమైతే నిబంధనలను సరళతరం చేయడం, మార్పులు చేపట్టడం వంటి అంశాలపై దృష్టిపెడతామని చెప్పారు. ఈ విషయమై ఈ నెల 21న సంబంధిత వర్గాలతో సమావేశాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. రైల్వేలో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపుపై కసరత్తు రైల్వే రంగంలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించడంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ కసరత్తు ప్రారంభించింది. హై స్పీడ్ ట్రెయిన్ సిస్టమ్స్, రవాణా కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడంలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించే దిశగా ముసాయిదా క్యాబినెట్ నోట్ సిద్ధం చేసింది. దీనిపై చర్చించేందుకు మంత్రిత్వ శాఖలకు పంపింది. రైల్వే రంగం వృద్ధికి తోడ్పడేలా ఏయే విభాగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించవచ్చనే అవకాశాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ మినహా రైల్వే రంగంలో ఎఫ్‌డీఐలకు ఏ రూపంలోనూ అనుమతి లేదు.