న్యూఢిల్లీ: ఆర్థిక మూలాలు బలోపేతం అవుతున్నందున భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023–24) 6.9–7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయిడ్ ఇండియా తెలిపింది. త్రైమాసిక వారీ అవుట్‌లుక్‌ను విడుదల చేసింది. భారత ఆర్థిక వ్యవస్థలో అంతర్లీనంగా మంచి పురోగతి నెలకొందని, స్థూల ఆర్థిక గణాంకాలు దీన్ని తెలియజేస్తున్నాయని పేర్కొంది.
కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) 2022–23లో 1.9 శాతంగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత తగ్గుతుందని డెలాయిట్ ఇండియా తెలిపింది. అలాగే విదేశీ మారకం నిల్వలు 568 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఇవి 10 నెలల దిగుమతి అవసరాలకు సమానమని పేర్కొంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 5 శాతం స్థాయిలో ఆర్‌బీఐ లకి‡్ష్యత పరిధి కంటే ఎగువన ఉన్నట్టు వివరించింది. కానీ, దశాబ్ద కాలం క్రితం నాటి ద్రవ్యోల్బణంతో పోలిస్తే చాలా తక్కువలోనే ఉన్నట్టు గుర్తు చేసింది. జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన తొలి ముందస్తు జాతీయ ఆదాయం గణాంకాల ప్రకారం చూసినా.. దేశ జీడీపీ 2023–24లో 7.3 శాతం వృద్ధిని నమోదు చేయనుంది. 2022–23 సంవత్సరంలో ఉన్న 7.2 శాతం కంటే స్వల్ప వృద్ధి కావడం గమనార్హం. మైనింగ్, క్వారీయింగ్, తయారీ, సేవలకు సంబంధించి కొన్ని రంగాల బలమైన పనితీరు ఇందుకు దోహదం చేయనుందని జాతీయ గణాంక కార్యాలయం అంచనాగా ఉంది.
2024–25లో 6.4 శాతం..
‘‘ఆర్థిక మూలాలు మెరుగుపడుతుండడం మా అంచనాలకు మద్దతుగా నిలిచింది. మా ప్రాథమిక అంచనాల ప్రకారం 2023–24లో భారత్ 6.9–7.2 శాతం మధ్య వృద్ధిని నమోదు చేస్తుంది. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఇది 6.4 శాతం, 6.7 శాతంగా ఉండొచ్చు. అంతర్జాతీయ ఆర్థిక చిత్రం మోస్తరుగానే ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ, మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ అనిశ్చితులను మెరుగ్గా అధిగమించగలదు’’అని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుక్మి ముజుందార్ తెలిపారు. ద్రవ్యోల్బణం తిరిగి 5.4 శాతానికి ఇటీవల పెరగడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ద్రవ్యోల్బణం 2023–24 ద్వితీయ ఆరు నెలల్లోనూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని.. అధిక ఆహార ధరలు, అస్థిరతలతో కూడిన చమురు ధరలు ఆ తర్వాతి కాలంలో స్థిరపడతాయని వెల్లడించారు. గడిచిన పదేళ్ల కాలంలో భారత్ సాధించిన వృద్ధి ప్రయాణాన్ని డెలాయిట్ ప్రస్తావించింది. ఎగుమతులను పలు దేశాల మధ్య వైవిధ్యం చేసుకోవడంతోపాటు, విలువ ఆధారిత ఉత్పత్తుల వైపు మళ్లినట్టు తెలిపింది. ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ వాటా పెరిగినట్టు వెల్లడించింది. ఎగుమతుల్లో పోటీతత్వాన్ని కూడా పెంచుకున్నట్టు పేర్కొంది. అయితే మరింత పోటీతత్వాన్ని అందిపుచ్చుకోవాలని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment