సాక్షి,న్యూఢిల్లీ: మయన్మార్లో అనూహ్య పరిణామాలు ప్రకంపనలు పుట్టించాయి. అత్యవసర పరిస్థితుల్లో ఒక సంవత్సరం పాటు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేశ సైన్యం తన సొంత టెలివిజన్ ఛానల్ ద్వారా ప్రకటించింది. గత 50 ఏళ్లుగా సైన్యం చేతిలోనే మగ్గి తేరుకున్న ఆ దేశంలో తిరిగి సైనిక తిరుగుబాటుతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దేశంలో ఏడాది పాటు ఎమర్జెన్సీ ప్రకటించిన సైన్యం నేషనల్ లీగ్ ఫర్ డెమెక్రసీ నేత ఆంగ్ సాన్ సూకీని అదుపులోకి తీసుకోవడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేకాదు దేశమంతటా ఇంటర్‌నెట్ సేవలను ఆర్మీ నిలిపివేసింది. దీంతో అనేక మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు కూడా పనిచేయడంలేదు.
సోమవారం సైనిక చర్య అనంతరం అంగ్ సాన్ సూకీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దేశం తమ పాలనలోకి వచ్చేసిందని ఆర్మీ ప్రకటించింది. ఎన్నికల అనంతరం అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మిలటరీకి మధ్య ఉద్రిక్తతల రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున సైనికులు దాడి జరిపి అంగ్ సాన్ సూకీతో పాటు ఆ పార్టీ కి చెందిన ఇతర సీనియర్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ ప్రతినిధి వెల్లడించారు.. గత నవంబర్‌లో నిర్వహించిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైన్యం ఆరోపించింది. ఈ ఆరోపణలను ఇప్పటికే సూకీ ప్రభుత్వం ఖండించింది.
మరోవైపు అయితే మిలటరీ చర్యపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రజాస్వామ్యం నెలకొల్పే దిశగా జరిగిన ప్రయత్నాలను అడ్డుకుంటే సహించేది లేదని ప్రకటించింది. అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని, ఎన్నికల ఫలితాలను గౌరవించాలని మయన్మార్ సైన్యాన్ని కోరింది. దేశంపై నియంత్రణ కోసం మిలటరీ మరోసారి ప్రయత్నిస్తోందని ఆరోపించిన ఆస్ట్రేలియా ప్రజలు ఎన్నుకున్న నేత అంగ్ సాన్ సూకీ సహా ఇతర నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment