
బ్యాంకాక్: పదవీచ్యుతురాలైన అంగ్ సాన్ సూకీ(78) జైలు శిక్షను తగ్గిస్తున్నట్లు మయన్మార్ సైనిక ప్రభుత్వం ప్రకటించింది. రెండున్నరేళ్ల క్రితం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సూకీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సైనిక పాలకులు కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అనంతరం సూకీపై 19 నేరారోపణలు మోపారు. వీటిలో కొన్నిటిపై విచారణ జరిపిన సైనిక కోర్టులు సూకీకి 33 ఏళ్ల జైలు శిక్షలు విధించాయి.
బౌద్ధులు మెజారిటీగా ఉన్న మయన్మార్‌లో మంగళవారం ‘గౌతమ బుద్ధుని మొదటి ఉపన్యాస’దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ సందర్భంగా మిలటరీ కౌన్సిల్ చీఫ్, సీనియర్ జనరల్ మిన్ సుమారు 7 వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. వీరిలో సూకీ, మాజీ అధ్యక్షుడు విన్‌మింట్ ఉన్నారు. సూకీకి ఆరేళ్ల జైలు శిక్షను తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం, ఆమె మరో 27 ఏళ్లపాటు జైలు జీవితం గడపాలి.