Military government
-
ఆదిమ ఖండంలో... నియంత పాలనలు
సైనిక తిరుగుబాట్లతో ఆఫ్రికా ఖండం అతలాకుతలం అవుతోంది. కొన్నేళ్లుగా ఇక దేశం తర్వాత ఒక దేశంలో ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి సైనిక నియంతలు అధికారం చేజిక్కించుకుంటున్నారు. బుర్కినా ఫాసో మొదలుకుని తాజాగా గబాన్ దాకా ఈ జాబితా నానాటికీ పెరుగుతూనే పోతోంది. ఆ సైనిక కుట్రల పట్ల ఆయ దేశాల్లో పెద్దగా వ్యతిరేకత కూడా వ్యక్తం కాకపోవడం విశేషం. పైగా యువ ఆఫ్రికన్లు ఈ పరిణామాన్ని రెండు చేతులా స్వాగతిస్తుండటం విస్మయకర వాస్తవం... ► పశ్చిమ ఆఫ్రికాలోని నైగర్‌లో సైనిక తిరుగుబాటు జరిగి నెలన్నర కూడా కాలేదు. అప్పుడే ఆదిమ ఖండంలో మరో కుట్ర. మధ్య ఆఫ్రికా దేశం గాబాన్లో గత ఆదివారమే ఎన్నికలు జరిగాయి. బుధవారం ఉదయమే ఫలితాలు వెలువడ్డాయి. 2009 నుంచీ దేశాన్ని పాలిస్తూ వస్తున్న అధ్యక్షుడు అలీ బొంగో ఒండింబా మరోసారి తన అధికారాన్ని నిలుపుకున్నారు. ఆయన పార్టీ ఘన విజయం సాధించినట్టు టీవీల్లో అధికారిక ప్రకటన వెలువడింది. దాంతో ఆయన అభిమానులు పండుగ చేసుకున్నారు. కానీ నిమిషాల్లోనే పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఈసారి సైనికాధికారులు టీవీ తెరపైకి వచ్చారు. బొంగోను అదుపులోకి తీసుకుని ఆయన అధికారిక నివాసంలోనే ఖైదు చేసినట్టు, పాలనా పగ్గాలు తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అలా మరో ఆఫ్రికా ఖండంలో ప్రజాస్వామ్యం మరోసారి పరిహాసానికి గురైంది. మరో దేశం సైనిక కుట్రను చవిచూసింది. వరుస సైనిక కుట్రలు ఆఫ్రికాలో, ముఖ్యంగా పశ్చిమ, సెంట్రల్ ఆఫ్రికాలో కొన్నేళ్లుగా సైనిక కుట్రలు పరిపాటిగా మారాయి. ► గత జూలై 26న నైగర్ అధ్యక్షుడు మొహమ్మద్ బజొమ్ను ఆయన సొంత ప్రెసిడెన్షియల్ బాడీ గార్డులే నిర్బంధంలోకి తీసుకున్నారు. ► 2022 జనవరిలో బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరేనుఆ దేశ సైన్యాధ్యక్షుడే బందీని చేసి అధికారం చేజిక్కించుకున్నాడు. అయితే 8 నెలల్లోనే కింది స్థాయి సైనికాధికారులు అతన్ని కూడా జైలుపాలు చేసి అధికారాన్ని పంచుకున్నారు! ► 2012 సెపె్టంబర్లో గినియాలో అధ్యక్షుడు ఆల్ఫా కొండేను ప్రత్యేక సైనిక బృందాలు ఖైదు చేసి పాలనా పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ► 2021 మేలో మాలిలో కల్నల్ అసిమి గొయిటా కూడా సైనిక కుట్రకు పాల్పడ్డాడు. అంతకుముందు కూడా ఇలా ప్రభుత్వాన్ని పడదోసిన చరిత్ర అతనిది. ► 2021 ఏప్రిల్‌లో చాద్ రిపబ్లిక్లో కూడా అధ్యక్షుడు ఇద్రిస్ దెబీ ఇట్నో మృతి కారణంగా అనిశ్చితి ఏర్పడటంతో సైన్యం జోక్యం చేసుకుంది. అయితే, ఆయన కుమారుడే అధికార పగ్గాలు చేపట్టేలా చక్రం తిప్పి రంగం నుంచి తప్పుకుంది. పాలనపై తమ ఆధిపత్యాన్ని మాత్రం నిరి్నరోధంగా కొనసాగిస్తూనే ఉంది! ఆఫ్రికాలోనే ఎందుకిలా? కేవలం గత మూడేళ్లలో ఆఫ్రికాలో కనీసం 5 దేశాల్లో సైనిక కుట్రలు జరిగా యి. ఇందుకు పలు కారణాలు కనిపిస్థాయి కూడా... ► సంప్రదాయ పాలక వర్గపు మితిమీరిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం తదితర పోకడలతో ఆఫ్రికా యువత తీవ్రంగా విసిగిపోయింది. ► అదే సమయంలో ఇటు జనాదరణలోనూ, అటు ఆర్థికంగా కూడా ఆయా ప్రభుత్వాలు బలహీనపడుతూ వచ్చాయి. ఈ పరిస్థితిని సైనిక పెద్దలు అవకాశంగా మలచుకున్నారు ► ప్రజల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంత యువతలో అధికార పారీ్టల పట్ల ఉన్న ఏహ్య భావాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ...అందుకే ఆఫ్రికా యువతలో అసంతృప్తి! ఆఫ్రికా యువతలో ప్రజాస్వామిక ప్రభుత్వాల పట్ల నెలకొన్న తీవ్ర అసంతృప్తికి కారణాలు లేకపోలేదు... ► ఉపాధి అవకాశాల లేమి ► పెచ్చరిల్లిన అవినీతి ► అధిక వర్గాల్లోనూ వారి మితిమీరిన ఆశ్రిత పక్షపాతం ► ఈ దేశాల్లో చాలావరకు మాజీ ఫ్రెంచి వలస రాజ్యాలే. దాంతో వాటిపై ఇప్పటికీ చాలా విషయాల్లో ఫ్రాన్స్ ప్రభావం కొనసాగుతోంది. ఇది కూడా యువతకు మింగుడు పడడం లేదు. ► ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవడానికి పాలక పార్టీలు చేస్తున్న అక్రమాలతో జనం మరింతగా విసిగిపోయారు. దశాబ్దాలుగా బొంగోల రాజ్యమే! గాబన్పై బొంగో కుటుంబం ఒకరకంగా అర్ధ శతాబ్దానికి పైగా గుత్తాధిపత్యం చెలాయించిందనే చెప్పాలి. ► అలీ బొంగో 14 ఏళ్లుగా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు! ఇది ఆయ నకు మూడో టర్ము. 2018లోనే స్ట్రోక్‌కు గురైనా అధికారాన్ని మాత్రం వీడలేదు. ► అయితే దేశాన్ని ఆధునీకరణ బాట పట్టించేందుకు ఆయన ప్రయత్నాలు చేయకపోలేదు. కానీ జనం ఆకాంక్షలను నెరవేర్చేందుకు అవి సరిపోలేదు. ► అలీ తండ్రి ఒమర్ బొంగో అయితే ఏకంగా 40 ఏళ్లకు పైగా నియంతలా దేశాన్ని పాలించారు! 2009లో ఆయన మరణానంతరం జరిగిన ఎన్నికల్లో అలీ తనను తాను విజేతగా ప్రకటించుకున్నారు. కానీ నిజానికి విపక్ష నేత ఆంద్రే ఎంబా ఒబామే నెగ్గారని చెబుతారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
అంగ్ సాన్ సూకీ జైలు శిక్ష తగ్గింపు
బ్యాంకాక్: పదవీచ్యుతురాలైన అంగ్ సాన్ సూకీ(78) జైలు శిక్షను తగ్గిస్తున్నట్లు మయన్మార్ సైనిక ప్రభుత్వం ప్రకటించింది. రెండున్నరేళ్ల క్రితం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సూకీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సైనిక పాలకులు కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అనంతరం సూకీపై 19 నేరారోపణలు మోపారు. వీటిలో కొన్నిటిపై విచారణ జరిపిన సైనిక కోర్టులు సూకీకి 33 ఏళ్ల జైలు శిక్షలు విధించాయి. బౌద్ధులు మెజారిటీగా ఉన్న మయన్మార్‌లో మంగళవారం ‘గౌతమ బుద్ధుని మొదటి ఉపన్యాస’దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ సందర్భంగా మిలటరీ కౌన్సిల్ చీఫ్, సీనియర్ జనరల్ మిన్ సుమారు 7 వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. వీరిలో సూకీ, మాజీ అధ్యక్షుడు విన్‌మింట్ ఉన్నారు. సూకీకి ఆరేళ్ల జైలు శిక్షను తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం, ఆమె మరో 27 ఏళ్లపాటు జైలు జీవితం గడపాలి. -
Aung San Suu Kyi: ఎన్ఎల్డీ పార్టీ గుర్తింపు రద్దు
మయన్మార్ జుంటా గవర్నమెంట్ (మిలిటరీ ప్రభుత్వం) మంగళవారం సంచలన ప్రకటన చేసింది. మిలిటరీ ప్రభుత్వ పర్యవేక్షణలోని ఎన్నిక సంఘం ప్రతిపక్ష నేత ఆంగ్ సాన్ సూకీకి భారీ షాక్ ఇచ్చింది. సూకీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ‘నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ’(NLD) పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది మయన్మార్ ఈసీ. కొత్త సైనిక-ముసాయిదా ఎన్నికల చట్టానికి అనుగుణంగా.. ఎన్ఎల్డీ పార్టీ తన రిజిస్ట్రేషన్‌ను తిరిగి నమోదు చేసుకోవడంలో విఫలమైందని, అందుకే గుర్తింపు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మయన్మార్‌లో కఠిన ఎన్నికల చట్టం తీసుకొచ్చింది జుంటా మిలిటరీ ప్రభుత్వం. దాని ప్రకారం.. కేసులు ఎదుర్కొంటున్న వాళ్లు, అజ్ఞాతంలో ఉన్నవాళ్లు, ఇంకా పలు నిబంధంనల కింద.. రాజకీయ పార్టీలను అధికారికంగా నమోదు చేయడానికి వీల్లేదు. తద్వారా ప్రత్యర్థి పార్టీల అడ్డుతొలగించుకునేందుకు మిలిటరీ ప్రభుత్వం ప్లాన్ వేసింది. ఈ క్రమంలో.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నప్పటికీ, విపక్షాల నుంచి విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఈ ఏడాది జనవరి నుంచి పార్టీల రీ రిజిస్ట్రేషన్లకు రెండు నెలల గడువు ఇచ్చింది. ఆ దేశంలోని మొత్తం 90 పార్టీలకుగానూ 50 పార్టీలు మాత్రమే రీ రిజిస్ట్రేషన్ ద్వారా అర్హత సాధించుకున్నాయి. ఇక మిగతా పార్టీల గుర్తింపు(సూకీ ఎన్ఎల్డీ సహా) బుధవారం(నేటి) నుంచి రద్దు కానున్నాయి. మయన్మార్ ఉద్యమ నేత అయిన ఆంగ్ సాన్ సూకీ 1988లో ఎన్‌ఎల్‌డీని స్థాపించారు. 1990 ఎన్నికలలో ఘనవిజయం సాధించగా.. అప్పటి జుంటా(మిలిటరీ) ఆ ఎన్నికను రద్దు చేసింది. అయినప్పటికీ ఆమె ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే వస్తున్నారు. ఈ క్రమంలో 2015, 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమె మిలిటరీ భాగస్వామ్య పార్టీలను మట్టికరిపించి కూటమి పార్టీల సాయంతో ఘన విజయం సాధించారు. ఇదిలా ఉంటే.. 2020లో జరిగిన ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ ఘన విజయం సాధించింది. కానీ, ఎన్నికల్లో మోసం జరిగిందంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ.. కిందటి ఏడాది ఫిబ్రవరిలో జుంటా మిలిటరీ నేతలు తిరుగుబాటుకి దిగారు. ఆపై సూకీని జైలు పాలు చేయడంతో పాటు పలు నేరాల కింద ఆమెకు శిక్షలు విధిస్తూ వెళ్తున్నారు. వివిధ కేసుల్లో పడిన జైలుశిక్ష ఇప్పటిదాకా మొత్తం 33 ఏళ్లకు చేరుకుంది. ఒకవైపు ఆమెపై కేసులు, వాటి విచారణ పరంపర కొనసాగుతోంది. అందులో అవినీతి, రహస్య సమాచార లీకేజీ తదితర ఆరోపణలు ఉండడం గమనార్హం. మరోవైపు మిలిటరీ నేతల పాలనలో మయన్మార్ గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇంకోవైపు సూకీని రిలీజ్ చేయాలని ఇటీవల యూఎన్ సెక్యూర్టీ కౌన్సిల్ ఓ ప్రకటనలో కోరింది. -
సూడాన్‌లో 101 మంది మృతి
ఖర్టౌమ్: సూడాన్ రాజధాని ఖర్టౌమ్‌లో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినవారిపై జరిపిన కాల్పుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా గాయాలపాలయ్యారు. గాయపడిన వారికి వైద్యం చేసేందుకు ఖర్టౌమ్లోని ఆసుపత్రుల్లో తగినంత మంది వైద్య సిబ్బందిగానీ, సదుపాయాలు గానీ అందుబాటులో లేవు. సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్–బషీర్ నియంతృత్వ పాలనపై నెలల తరబడి ఆందోళనలు జరుగుతుండగా, ఆ దేశ మిలిటరీ ఈ ఏడాది ఏప్రిల్‌లో బషీర్‌ను పదవి నుంచి దింపేసింది. మరో మూడేళ్లలో పౌర పాలన మళ్లీ మొదలయ్యేలా ఓ ఒప్పందం కుదిరింది. అప్పటివరకు దేశ పాలనకు మిలిటరీ కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ కౌన్సిల్ పాలనను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా అనేక మంది ఆర్మీ ప్రధాన కార్యాలయం బయట నిరసనలు తెలుపుతుండగా, సోమ, మంగళ వారాల్లో ఆ నిరసనకారులను అణచివేసేందుకు ఆర్మీ కాల్పులకు దిగింది. ఆసుపత్రుల్లోనూ వైద్యులు, ఇతర సిబ్బందిపై సూడాన్ భద్రతా దళాలు దాడులు చేస్తున్నాయని వైద్యుల సంఘం ఆరోపించింది. కాల్పుల ఘటనలను ఖండించి, ఆందోళనకారులకు, మిలిటరీకి మధ్య సయోధ్య కుదర్చాలంటూ ఐక్యరాజ్యసమితికి వచ్చిన ఓ తీర్మానాన్ని చైనా, రష్యాలు అడ్డుకున్నాయి. 8 యూరప్ దేశాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేస్తూ కాల్పులను ఖండించాయి. కాల్పుల ఘటనల్లో 101 మంది చనిపోవడంతో మిలిటరీతో చర్చలు జరిపేందుకు నిరసనకారులు నిరాకరించారు. 101లో 40 మంది మృతదేహాలు నైలునదిలో లభించాయి. -
బియ్యం అమ్మిన థాయ్ మాజీ ప్రధాని
బ్యాంకాక్: గద్దె దిగిపోయిన థాయ్‌లాండ్ ప్రధాని ఇంగ్లుక్ షినవత్ర వందలాది మందికి సంచుల కొద్దీ బియ్యాన్ని అమ్మారు. ధరలు పడిపోవడంతో నష్టపోయిన రైతుల పట్ల సైనిక ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ఇలా నిరసన చేపట్టారు. వరి రైతులతో కలసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈశాన్య ప్రాంతాల్లోని గ్రామాల్లో గతవారం పర్యటించిన ఆమె ట్రక్కుల కొద్ది బియ్యాన్ని రైతుల నుంచి కొన్నారు. బ్యాంకాక్‌లోని ఓ వీధిలో దుకాణం ఏర్పాటుచేసి ప్రజలకు అమ్మారు. ఒక కిలో బియ్యాన్ని రూ.38కి విక్రయించారు. 2014 నాటి తిరుగుబాటు వల్ల ఇంగ్లుక్ ప్రభుత్వం కూలిపోవడం తెలిసిందే. -
థాయ్‌లాండ్‌లో వరుస బాంబు పేలుళ్లు
గంటల వ్యవధిలో వరుస బాంబు దాడులతో ప్రముఖ పర్యాటక దేశం థాయ్‌లాండ్ ఉలిక్కిపడింది. థాయ్ రాణి సిరికిత్ పుట్టిన రోజు వేడుకల రోజున ప్రముఖ ప్రఖ్యాత రిసార్టులు, హోటళ్ల వద్ద ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అక్కడి మిలటరీ ప్రభుత్వం రూపొందించిన రాజ్యాంగానికి ప్రజలు ఆమోదం తెలిపిన కొన్ని రోజుల వ్యవధిలో జరిగిన ఈ దాడుల్లో నలుగురు దుర్మరణం చెందగా, 34 మంది గాయపడ్డారు. గురువారం అర్ధ రాత్రి నుంచి శుక్రవారాల్లో వరకు 5 దక్షిణ ప్రావిన్స్‌లలో కనీసం 11 బాంబు దాడులు జరిగాయి. ఒక ప్రాంతంలో దాడి జరిగిన కొన్ని గంటల్లోనే కొన్ని మీటర్ల దూరంలోని మరో ప్రాంతంలో పేలుళ్లు చోటుచేసుకోవడంతో స్థానికుల్లో భయాందోళనకు గురయ్యారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రియా దేశాలకు చెందిన వారు అధికంగా ఉన్నారన్నారు. అయితే ఈ దాడి ఉగ్రవాద చర్య కాదని, స్థానిక విద్రోహ శక్తులే ఈ కుట్రకు పాల్పడినట్లు వెల్లడించారు. -
నిర్బంధంలో థాయ్ ప్రధాని ఇంగ్లక్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రధాని ఇంగ్లక్ షినవత్రాను సైనిక ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. గురువారం సైనిక చర్య అనంతరం తనను తాను ప్రధాని గా నియమించుకున్న సైన్యాధిపతి జనరల్ ప్రయూత్ చాన్ ఒచా(60).. ఇంగ్లక్‌ను శుక్రవారం సైనిక దళాల కార్యాలయానికి రమ్మని ఆదేశించారు. అక్కడ ఆమెతో పాటు ఆమె కుటుంబంలోని పలువురిని సైన్యం అదుపులోకి తీసుకుంది. అనంతరం ఆమెను గుర్తు తెలియని స్థావరానికి తరలించారు. ప్రయూత్ ఆదేశానుసారం.. ఇంగ్లక్ ప్రభుత్వంలోని ఇతర ముఖ్యులు, పలువురు నేతలు దాదాపు 150 మంది కూడా ఆయన ముందు హాజరయ్యారు. అనంతరం కొందరు ముఖ్య అధికారులతో ప్రయూత్ సమావేశమయ్యారు. ఆర్థిక, రాజకీయ సంస్కరణలు దేశానికి అత్యవసరమని, వాటిని అమలు చేసిన తరువాతే ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో శాంతి నెలకొన్న తరవాత అధికారాన్ని మళ్లీ ప్రజలకు అప్పగిస్తామన్నారు. గత ప్రభుత్వ పథకం కారణంగా రుణభారంతో ఇబ్బంది పడుతున్న వరి రైతుల కోసం నిధులను కేటాయిస్తామని, మరో 15, 20 రోజుల్లో రైతులు ఆ డబ్బును అందుకుంటారని ప్రకటించారు.