ఖర్టౌమ్‌లో ఆర్మీ కార్యాలయం వద్ద నినాదాలిస్తున్న ఆందోళనకారుడు
ఖర్టౌమ్: సూడాన్ రాజధాని ఖర్టౌమ్‌లో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినవారిపై జరిపిన కాల్పుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా గాయాలపాలయ్యారు. గాయపడిన వారికి వైద్యం చేసేందుకు ఖర్టౌమ్‌లోని ఆసుపత్రుల్లో తగినంత మంది వైద్య సిబ్బందిగానీ, సదుపాయాలు గానీ అందుబాటులో లేవు. సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్–బషీర్ నియంతృత్వ పాలనపై నెలల తరబడి ఆందోళనలు జరుగుతుండగా, ఆ దేశ మిలిటరీ ఈ ఏడాది ఏప్రిల్‌లో బషీర్‌ను పదవి నుంచి దింపేసింది. మరో మూడేళ్లలో పౌర పాలన మళ్లీ మొదలయ్యేలా ఓ ఒప్పందం కుదిరింది. అప్పటివరకు దేశ పాలనకు మిలిటరీ కౌన్సిల్ ఏర్పాటైంది.
ఈ కౌన్సిల్ పాలనను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా అనేక మంది ఆర్మీ ప్రధాన కార్యాలయం బయట నిరసనలు తెలుపుతుండగా, సోమ, మంగళ వారాల్లో ఆ నిరసనకారులను అణచివేసేందుకు ఆర్మీ కాల్పులకు దిగింది. ఆసుపత్రుల్లోనూ వైద్యులు, ఇతర సిబ్బందిపై సూడాన్ భద్రతా దళాలు దాడులు చేస్తున్నాయని వైద్యుల సంఘం ఆరోపించింది. కాల్పుల ఘటనలను ఖండించి, ఆందోళనకారులకు, మిలిటరీకి మధ్య సయోధ్య కుదర్చాలంటూ ఐక్యరాజ్యసమితికి వచ్చిన ఓ తీర్మానాన్ని చైనా, రష్యాలు అడ్డుకున్నాయి. 8 యూరప్ దేశాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేస్తూ కాల్పులను ఖండించాయి. కాల్పుల ఘటనల్లో 101 మంది చనిపోవడంతో మిలిటరీతో చర్చలు జరిపేందుకు నిరసనకారులు నిరాకరించారు. 101లో 40 మంది మృతదేహాలు నైలునదిలో లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment