వాషింగ్టన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణోదంతంపై అమెరికా అట్టుడుకుతోంది. దేశాద్యంతం హింసాత్మక ఘటనలతో కూడిన ఆందోళనలు చెలరేగాయి. ఆరు రోజులుగా నడుస్తున్న ఈ ఆందోళన ఫలితంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పోలీసులు వేల మందిని అరెస్ట్ చేశారు. నలభై నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ఆఖరుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం తాత్కాలికంగా ఓ రహస్య స్థావరంలో తలదాచుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్థమైపోతుంది. మినసోటాలో మొదలైన ఆందోళన పర్వం దావానలంలా లాస్ ఏంజిలెస్, షికాగో, న్యూయార్క్, హ్యూస్టన్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీలకూ విస్తరించింది. ఈ స్థాయి ఆందోళనలు 1968లో మార్టిన్ లూథర్‌కింగ్ హత్య తరువాత మాత్రమే జరిగాయని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది.
పలు దేశాల్లో ఆందోళనకారులకు మద్దతు
న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్ సిటీలో వేలాదిగా ఆందోళనకారులు నిరసనప్రదర్శన చేపట్టారు. సెంట్రల్ లండన్‌లో ఆదివారం పలువురు ఆందోళనకారులు జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతానికి నిరసనగా ప్రదర్శన నిర్వహించగా, బ్రెజిల్, కెనడా, చైనాలో ప్రదర్శనలు జరిగాయి.
ఫ్లాయిడ్ అంత్యక్రియలు హ్యూస్టన్‌లో
జార్జ్ ఫ్లాయిడ్ అంత్యక్రియలు హ్యూస్టన్‌లో జరగనున్నాయి. మినియాపోలిస్‌లో ఫ్లాయిడ్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. నగర మేయన్ సిల్వర్‌స్టర్ టర్నల్ శనివారమే అంత్యక్రియల ప్రణాళికను ప్రకటించగా.. ఎప్పుడు?అన్నది స్పష్టం చేయలేదు. నార్త్ కారొలీనాలో జన్మించిన ఫ్లాయిడ్ హ్యూస్టన్‌లో పెరిగి పెద్దయ్యారు. 2014 నుంచి ఫ్లాయిడ్ మినియాపోలీస్‌లో ఉంటున్నా అతడి ఇద్దరు కూతుళ్లు హ్యూస్టన్‌లో ఉంటున్నారు. ఫ్లాయిడ్ మరణానికి కారణమైన డెరెక్ ఛావిన్‌ను ఇప్పటికే ఉద్యోగం నుంచి తొలగించగా శుక్రవారం హత్య ఆరోపణలపై అతడిని అరెస్ట్ చేశారు. ఫ్లాయిడ్ మృతదేహానికి తాము ఎస్కార్ట్‌గా వ్యవహరిస్తామని ఆ గౌరవం తమకు కలిగించాలని హ్యూస్టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ముఖ్యాధికారి ఆర్ట్ అసీవిడో ఆదివారం జరిగిన ఒక ర్యాలీలో బహిరంగంగా అభ్యర్థించారు. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఫ్లాయిడ్ మృతదేహాన్ని మినియాపోలీస్ నుంచి హ్యూస్టన్‌కు తరలించనున్నారు.
యాపిల్ స్టోర్ లూటీ
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని యాపిల్ స్టోర్‌ను దుండగులు దోచుకు న్నారు. అద్దాలు పగులగొట్టి, అక్కడున్నదంతా ఎత్తుకుపోయారు. ఏడు నిమిషాల వ్యవధిలోనే స్టోర్‌లో ఉన్న వస్తువులను దుండగులు మాయం చేశారు. ఆఖరి నిమిషంలో ఒకే ఒక్క పోలీసు అక్కడికి చేరుకున్నారు. గ్యాడ్జెట్‌ల నుంచి డిస్‌ప్లే స్టాండ్లదాకా అన్నిటినీ ఊడ్చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
వైట్‌హౌస్ వద్ద కాల్పులు
వైట్‌హౌస్ వద్ద జరిగిన ఆందోళనల్లో ఆందోళనకారులు భవనం కిటికీలను బద్దలు కొట్టడంతోపాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ సమయంలోనే అధ్యక్షుడు ట్రంప్ అతడి భార్య మెలానియా, కుమారుడు బారన్‌లను కొద్ది సమయం పాటు రహస్య బంకర్‌లో ఉంచినట్లు సీఎన్‌ఎన్ ఒక కథనం ప్రసారం చేసింది. వైట్‌హౌస్ వద్ద ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువుతోపాటు స్టన్ గ్రెనైడ్‌లు వాడారని వార్తలు వచ్చాయి. పలువురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ఆదివారం మొత్తం బహిరంగ ప్రకటనలు చేయకపోగా, ఎవరికీ కనిపించలేదు. దేశంలో అశాంతికి మీడియా సంస్థలే కారణమని ట్రంప్ ట్వీట్లు చేశారు.
చేతుల్లో రైఫిల్స్ పట్టుకున్న పోలీసులు దూసుకొచ్చి.. కారు ఆపమన్నారు. కారులో ఉన్న నల్లజాతీయులను కిందకు దించి రోడ్డుపై పడుకోబెట్టి రైఫిల్ ఎక్కుబెట్టారు. ఇదేదో సినిమాలో సీన్ కాదు.. అమెరికాలోని ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. ఆదివారం మినియాపొలిస్ పోలీసులు నల్లజాతీయులను ఇదిగో ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు నిర్బంధించారు.
వైట్‌హౌస్ వద్ద నిరసనకారులపైకి బాష్పవాయువు ప్రయోగిస్తున్న పోలీసులు
అమెరికాలో ఆగ్రహపర్వం
Published Tue, Jun 2 2020 4:48 AM | Last Updated on Tue, Jun 2 2020 9:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment