ట్రంప్‌ మద్దతుదారుల హింసాకాండ | Donald Trump supporters clash with counter protesters | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ మద్దతుదారుల హింసాకాండ

Published Mon, Nov 16 2020 1:13 AM | Last Updated on Mon, Nov 16 2020 8:50 AM

Donald Trump supporters clash with counter protesters - Sakshi

వాషింగ్టన్‌లోని ఫ్రీడం ప్లాజా వద్ద ర్యాలీ నిర్వహిస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వేలాది మంది ఆయన మద్దతుదారులు, అభిమానులు వీధుల్లోకి వచ్చారు. వాషింగ్టన్‌ శివార్లలో మిలియన్‌ మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ (మాగా) మార్చ్‌ పేరిట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్నారు. అధ్యక్షుడిగా మళ్లీ ట్రంప్‌ గెలిచినట్లు ప్రకటించాలని నినాదాలు చేశారు. మరో నాలుగేళ్లు ట్రంప్, ఎన్నికల దొంగతనం ఆపండి అంటూ నినదించారు.

ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. జో బైడెన్‌ వర్గీయులపై హింసాకాండకు పాల్పడ్డారు. నవంబర్‌ 3న జరిగిన ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తన ఓటమిని ట్రంప్‌ ఇంకా అంగీకరించడం లేదు. శనివారం ట్రంప్‌ మద్దతుదారులు ఫ్రీడం ప్లాజా నుంచి నిరసన ర్యాలీ ప్రారంభించారు. రాత్రి దాకా శాంతియుతంగానే ఉన్నప్పటికీ తర్వాత సహనం కోల్పోయారు. బైడెన్‌ మద్దతుదారులతో ఘర్షణకు దిగారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌కు కొంత దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

ట్రంప్‌ అభిమానుల దాడిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. నల్లజాతి ప్రజల హక్కుల ఉద్యమ కార్యకర్త అయిన అతడిని వెనుకనుంచి కత్తితో పొడిచారు. అధికారులు యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ట్రంప్‌ అభిమానుల దాడిలో మరో ఇద్దరు పోలీసు అధికారులు సైతం గాయపడ్డారు. ట్రంప్, బైడెన్‌ మద్దతుదారులు కొన్ని నిమిషాలపాటు ఒకరినొకరు కొట్టుకున్నారు. ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేశాక పరిస్థితి అదుపులోకి వచ్చింది.

బైడెన్‌ అభిమానులు సైతం ట్రంప్‌ మద్దతుదారులపై కోడిగుడ్లు విసిరినట్లు ఫాక్స్‌ న్యూస్‌ వెల్లడించింది. ట్రంప్‌నకు సంబంధించిన ప్రచార సామగ్రిని వారు దహనం చేసినట్లు తెలిపింది. ట్రంప్, బైడెన్‌ వర్గీయుల ఘర్షణకు సంబంధించి ఇప్పటివరకు 20 మందిని అరెస్టు చేసినట్లు వాషింగ్టన్‌ డీసీ మెట్రోపాలిటన్‌ పోలీసు విభాగం వెల్లడించింది. తనకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలను మీడియా తొక్కిపెడుతోందని, ప్రజలకు వాస్తవాలు తెలియనివ్వడం లేదని డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

ఓటమిని ఒప్పుకున్న ట్రంప్‌
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించకుండా ఇన్నాళ్లూ మొండిగా వ్యవహరించిన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు కాస్త దిగొచ్చారు. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ గెలిచారని చెప్పారు. తద్వారా తొలిసారిగా తన ఓటమిని ఒప్పుకున్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్‌ చేశారు. అయితే, ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరగడం వల్లే బైడెన్‌ విజయం సాధించారని ట్రంప్‌ ఆక్షేపించారు.

ఫేక్‌ న్యూస్‌ మీడియా దృష్టిలో మాత్రమే బైడెన్‌ అధ్యక్షుడిగా నెగ్గాడని ఎద్దేవా చేశారు. చెడ్డ పేరున్న రాడికల్‌ లెఫ్ట్‌ కంపెనీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొందని పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి పరిశీలకులను అనుమతించలేదని తప్పుపట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను డెమొక్రాట్లు చోరీ చేశారని మరోసారి మండిపడ్డారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని, తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌కు అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు.   

బైడెన్‌ 306.. ట్రంప్‌ 232
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జార్జియా, నార్త్‌ కరోలినా రాష్ట్రాల ఫలితాలు కూడా వచ్చాయి. జార్జియాలో డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్, నార్త్‌ కరోలినాలో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించారు. అలస్కాలో విజయంతో ఇప్పటికే ట్రంప్‌ 217 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా నార్త్‌ కరోలినాలో గెలుపుతో తన ఎలక్టోరల్‌ ఓట్ల సంఖ్యను 232కి పెంచుకున్నారు.

ఇప్పటికే మేజిక్‌ మార్క్‌ 270ని సునాయాసంగా దాటేసిన బైడెన్‌.. తాజాగా జార్జియాలో గెలుపుతో 306 ఎలక్టోరల్‌ ఓట్లతో వైట్‌హౌజ్‌లోకి వెళ్లనున్నారు. జార్జియాలో బైడెన్, నార్త్‌ కరోలినాలో ట్రంప్‌ గెలుపొందారని అమెరికాలో ప్రధాన మీడియా సంస్థలు పేర్కొన్నాయి. జార్జియాలో గెలుపుతో బైడెన్‌ మరో రికార్డు సాధించారు. గత 28 ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన జార్జియాను డెమొక్రటిక్‌ పార్టీ ఖాతాలో వేశారు. గత 28 ఏళ్లుగా అక్కడ డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి గెలుపొందలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement