నల్లజాతి ప్రతిఘటన | Sakshi Editorial On US George Floyd Protests | Sakshi
Sakshi News home page

నల్లజాతి ప్రతిఘటన

Published Tue, Jun 2 2020 12:42 AM | Last Updated on Tue, Jun 2 2020 12:42 AM

Sakshi Editorial On US George Floyd Protests

వివక్ష, హింస వ్యవస్థీకృతమైన చోట ప్రతిఘటన లావాలా పెల్లుబుకుతుంది. రంగునుబట్టే న్యాయం వుంటుందంటే ప్రతిహింస రాజుకుంటుంది. రెండు దశాబ్దాలకుపైగా కాలం గడిచినా... తరాలు మారినా అమెరికా సమాజం జాత్యహంకార ధోరణుల్ని విడనాడలేదు. నల్లజాతీయులపై దుండ గాన్ని మానుకోలేదు. అందుకే తరచుగా ఆ దేశం నిరసనలను చవిచూడాల్సివస్తోంది. చాలాసార్లు ఆ నిరసనలు హింసాత్మక రూపం తీసుకుంటున్నాయి. గత సోమవారం మినియాపొలిస్‌ నగరంలో 46 ఏళ్ల జార్జి ఫ్లాయిడ్‌ అనే ఒక నల్లజాతీయుణ్ణి పట్టపగలు నడిరోడ్డుపై అత్యంత అమానుషంగా హత మార్చిన తీరు అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. ఫ్లాయిడ్‌ గొంతును ఒక కానిస్టేబుల్‌ కాలితో అదిమి పట్టి, తన బరువంతా మోపడంతో ఊపిరాడక అతను మరణించాడు. ‘ఊపిరి తీసుకోలేకపోతున్నా నని ప్రాధేయపడుతున్నా ఆ కానిస్టేబుల్‌ వినలేదు. అదంతా నిక్షిప్తమైన వీడియో బయటకు రావడం వల్ల వెనువెంటనే నిరసనలు పెల్లుబికి అవి దేశంలోని న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్, షికాగో, డాలస్, మియామి, కాలిఫోర్నియా, అట్లాంటా తదితర 40 నగరాలకు కార్చిచ్చులా వ్యాపిం చాయి.

ఆ నగరాలన్నిటా విధించిన కర్ఫ్యూను ధిక్కరిస్తూ జనం వీధుల్లోకొస్తున్నారు. మొత్తం 21 రాష్ట్రాలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి. కొన్నిచోట్ల దుకాణాలు, కార్యాలయాలు, వాహనాలు తగలబెట్టారు. పోలీసులపై దాడులకు దిగారు. ఈ నిరసనలు చూసి బెంబేలెత్తిన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రాణభయంతో బంకర్‌లో తలదాచుకున్నారని ‘టైమ్స్‌’ కథనం. నాయకత్వ స్థానంలో వున్నం దువల్ల సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు చక్కదిద్దాల్సిన బాధ్యత ట్రంప్‌దే. ఆయన ఆ పని చేయకపోగా, అవి మరింత దిగజారడానికి కారకులయ్యారు. ‘లూటీలు కొనసాగితే కాల్చిచంపడం మొదలవుతుందని, నిరసనకారులంతా దొంగలని ఆయన ట్వీట్లు చేశారు. ఈ విషయంలో దేశానికి నాయకత్వంవహిస్తున్న అధ్యక్షుడికంటే సామాజిక మాధ్యమం ట్విటరే ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించింది. ఆ ట్వీట్‌ హింసను ప్రేరేపించేదిగా వున్నదన్న వ్యాఖ్యానాన్ని జోడించింది. ‘ఈ ట్వీట్‌ మా నిబంధనలకు విరుద్ధమే అయినా  ప్రజాప్రయోజనార్థం దీన్ని అందుబాటులో వుంచుతు న్నామ’ని చెప్పింది. ఇలాంటి వ్యాఖ్యానాలకు సిగ్గుపడతారని, ఇంగిత జ్ఞానాన్ని అలవర్చుకుంటారని గత నాలుగేళ్లుగా ట్రంప్‌ను చూస్తున్నవారెవరూ అనుకోలేదు. ట్రంప్‌తో వివక్ష మొదలుకాలేదు. అమె రికా సమాజంలో మొదటినుంచీ వున్న ఆ ధోరణులను ఆయన మరింత పెంచారు. నల్లజాతీయుల పైనా, మైనారిటీలపైనా విద్వేషం ఏర్పడేలా వ్యాఖ్యానించడం ఆయనకు అలవాటుగా మారింది. ఆయన అందలం ఎక్కడానికి అంతో ఇంతో కారణమైన భారతీయులపైనా చాలా సందర్భాల్లో అనుచితంగా మాట్లాడారు.

జార్జి ఫ్లాయిడ్‌ పేరుమోసిన నేరగాడు కాదు. కరోనా మహమ్మారి విరుచుకుపడేవరకూ అతనూ ఒక చిరుద్యోగి. లాక్‌డౌన్‌ పర్యవసానంగా తాను పనిచేస్తున్న రెస్టరెంట్‌లో ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. 20 డాలర్ల నకిలీ నోటును చలామణి చేశాడన్న ఫిర్యాదు రావడంతో పోలీసులు నిర్బంధించారు. అతను పారిపోవడానికి లేదా మారణాయుధంతో ప్రతి ఘటించడానికి ప్రయత్నించలేదు. అయినా పోలీసులు అతిగా ప్రవర్తించారు. తమ సహచరుడు అమానుషంగా ప్రవర్తిస్తున్నా అక్కడున్న మరో ముగ్గురు అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. దారిన పోతున్నవారు అది సరికాదని చెప్పినా వినిపించుకోలేదు. నిరసనలు చెలరేగాక ఫ్లాయిడ్‌ ఉసురు తీసిన కానిస్టేబుల్‌ను అరెస్టుచేసి, అతగాడి సహచరులను ఉద్యోగాలనుంచి తొలగించారు. కానీ ఇవి కంటితుడుపు చర్యలేనని అమెరికా గత చరిత్ర రుజువు చేసింది. నిరసనలు మిన్నంటినప్పుడు ఏవో చర్యలు తీసుకున్నట్టు కనబడటం అవి చల్లారగానే దోషులకు ఉద్యోగాలివ్వడం మామూలే.

ఆరేళ్ల క్రితం మైకేల్‌ బ్రౌన్‌ అనే నిరాయుధ నల్లజాతి పౌరుణ్ణి నిష్కారణంగా కాల్చిచంపిన కానిస్టేబుల్‌ నిర్దోషి అని సెయింట్‌ లూయీ కౌంటీ కోర్టు తీర్పునిచ్చింది. ఇంచుమించు ఆ సమయంలోనే ఒహా యోలోని క్లీవ్‌లాండ్‌ సిటీలో పన్నెండేళ్ల ఆఫ్రికన్‌ అమెరికన్‌ బాలుడు బొమ్మ తుపాకీతో ఆడుకుం టుంటే అతన్ని పోలీసులు చుట్టుముట్టి కాల్చిచంపారు. లొంగిపొమ్మని కోరినప్పుడు అతను జేబులో వున్న బొమ్మ తుపాకిని వారికి చూపించబోయాడు. ఈలోగా తమను చంపడానికే ఆ తుపాకి తీస్తున్నాడని పోలీసులు భావించారు. నల్లవాళ్లంతా నేరస్తులే కావొచ్చని, చిన్నపాటి అనుమానం వచ్చినా వారిని కాల్చిచంపడానికి వెనకాడకూడదని ఎక్కడా రాసి వుండదు. అది అలిఖిత నియమం. తరతరాలుగా నల్లవాళ్ల విషయంలో అమెరికా పోలీసుల ప్రవర్తన ఆవిధంగానే ఉంటోంది. ఈ జాడ్యం పోలీస్‌ వ్యవస్థనే కాదు... న్యాయవ్యవస్థనూ పీడిస్తోందని అవి ఇచ్చే తీర్పులు తరచు రుజువు చేస్తున్నాయి. 

వైద్యరంగం సైతం జాత్యహంకారంతో రోగగ్రస్తమైందని కరోనా వైరస్‌ విరుచుకుపడ్డాక వెల్ల డైంది. శ్వేతజాతీయులతో పోలిస్తే నల్లజాతీయులు మూడురెట్లు అధికంగా ఈ వైరస్‌ బారినపడి మరణించారు. కాన్సాస్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో తెల్లవాళ్లతో పోలిస్తే నల్లజాతీయులు ఏడు రెట్లు ఎక్కువగా చనిపోయారు. నిరుద్యోగులైనవారి గణాంకాలు చూసినా బాధితుల శాతం నల్లజాతీయుల్లోనే ఎక్కువ. మిచిగాన్‌ రాష్ట్రం ఈ గణాంకాలు చూశాక ఈ విషయంలో ప్రభుత్వపరంగా ఏం చేయాలన్న ఆలోచన మొదలెట్టింది. కానీ ట్రంప్‌కు ఇలాంటివేమీ పట్టలేదు. మనుషుల్ని మనుషులుగా చూడలేక, వారి ప్రవర్తన సరళినిబట్టి వారెలాంటివారో అంచనా వేయక... వారి శరీరం రంగుతో,  కులంతో, మతంతో, జెండర్‌తో బేరీజువేసే దుష్టసంస్కృతి, వివక్ష చూపే దుర్మార్గం అమలయ్యే ఏ సమాజ మైనా అనాగరికమైనదే. రోగిష్టిదే. ఆధిపత్య ధోరణులు ఏ రూపంలోవున్నా, వివక్ష ఏ సాకుతో కొన సాగిస్తున్నా దాన్ని ప్రతిఘటించడమే నిజమైన ప్రజాస్వామిక సంప్రదాయమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement