వాషింగ్టన్: అమెరికాలోని అలబామా రాష్ట్రం గర్భస్రావాన్ని(అబార్షన్) నిషేధించడంపై దేశ వ్యాప్తంగా మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలబామాతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు కూడా అబార్షన్‌ను నిషేదిస్తూ.. ప్రతిపాదించిన బిల్లు వివాదాస్పదంగా మారింది. 1973లో రూపొందించిన అబార్షన్ చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళల హక్కులను కాలరాసే విధంగా చట్టాన్ని రూపొందించారని, వాటిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ మంగళవారం పలు రాష్ట్రాల్లో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మొదట అలాబామా ప్రతినిధులు దీనికి సంబంధించి బిల్లును పాస్ చేసిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. దీనిపై తుది తీర్పు వెలువరించాల్సింఉంది.
అమెరికాలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా గర్భస్రావంపై అదనంగా కొన్ని నిబంధనలు జోడించాలని భావిస్తున్నాయి. దీనిపై దేశ వ్యాప్తంగా మహిళలను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గర్భం ధరించిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఏ దశలోనైనా అబార్షన్ (పిండాన్ని తొలగించడం) చేసుకోకూడదన్న నిబంధనతో కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నారు. చట్టం ప్రకారం అబార్షన్ చేసే డాక్టర్లను నేరస్తులుగా కూడా పరిగణించనున్నారు. వారికి 99 ఏళ్ల వరకు శిక్షను విధించాలని నిర్ణయించారు. కేవలం తల్లికి ప్రమాదం ఉందన్న కేసుల్లో మాత్రమే అబార్షన్ వీలుంటుందన్నారు.
రేప్ బాధితులు కూడా గర్భాన్ని తొలగించరాదన్న మరో నిబంధనను కూడా చేర్చారు. అబార్షన్ చట్టాన్ని ఎత్తివేస్తామని ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే ఈ చట్టాన్ని రద్దు చేయాలంటే ట్రంప్ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు అలబామాతో పాటు మరికొన్ని రాష్ట్రాలు చట్టాన్ని రూపొందించడం ఓ సంచలనంగా మారింది. మసాచుసెట్స్ సెనెటర్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎలిజబెత్ వారెన్.. అలబామా అబార్షన్ నిషేధం మీద స్పందిస్తూ.. ''ఈ నిషేధం ప్రమాదకరం. అత్యంత క్రూరమైనది. 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిప్పికొట్టటం ఈ బిల్లు రచయితల కోరిక'' అని ఘాలుగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment