మినియాపొలిస్ సిటీలో సంస్మరణ కార్యక్రమం తర్వాత ఫ్లాయిడ్ పార్థివదేహాన్ని తరలిస్తున్న దృశ్యం
వాషింగ్టన్: అమెరికా రాజధానిలోని భారతీయ దౌత్యకార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహాన్ని ఆగంతకులు ధ్వంసం చేయడాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు ప్రజలను ఏకం చేయవని వారు స్పష్టం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమైందని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్‌లోని భారత దౌత్యకార్యాలయం సమీపంలో ఉన్న ఈ విగ్రహాన్ని కొందరు దుండగులు బుధవారం ధ్వంసం చేసి, రంగులు పూసిన విషయం తెలిసిందే.
ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణం నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే, ఈ ఘటనకు ఆందోళనలతో సంబంధం లేదని మార్కో రూబియో అనే సెనెటర్ గురువారం తెలిపారు. నార్త్ కరొలినా సెనేటర్ టామ్ టిల్లిస్ కూడా ఇది అమర్యాదకరమైందని అభివర్ణించారు. శాంతికి మారుపేరుగా చెప్పుకునే గాంధీ ప్రతిరూపాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్రంప్ సలహాదారు కింబర్లీ గుయిఫోలే చెప్పారు.
మా గొంతులపై మీ మోకాళ్లు తీయండి..
‘‘మా గొంతులపై మీ మోకాళ్లు తొలగించం డి’’అన్న నినాదాల మధ్య మినియాపోలిస్‌లో గురువారం జార్జ్ ఫ్లాయిడ్ సంస్మరణ సభలు జరిగాయి. శవపేటిక చుట్టూ గుమికూడిన పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఫ్లాయిడ్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు ఈ సభ జరుగుతూండగా కొంత దూరంలోనే ఉన్న న్యాయస్థానంలో ఫ్లాయిడ్ హత్యకు కారణమైన ముగ్గురు పోలీసు అధికారులకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ.. పూచీకత్తుగా సుమారు రూ.5 కోట్ల చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఫ్లాయిడ్ ఘటనకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ప్యారిస్, లండన్, సిడ్నీ, రియో డిజెనిరోల్లో నిరసనలు జరిగాయి. అదే సమయంలో ఆమెరికాలోని కాలిఫోర్నియాలో ఇప్పటివరకూ ఉన్న కర్ఫ్యూను సడలించారు. కొన్ని చెదురుమ దురు సంఘటనలు మినహా అమెరికా నగరాల్లో ప్రశాంతత నెలకొంది. కొన్నిచోట్ల శాంతియుత ప్రదర్శనలు జరిగాయి.
ట్రంప్ ట్వీట్‌కు కత్తెర...
సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మధ్య జరుగుత్ను పరోక్ష యుద్ధంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఫ్లాయిడ్‌కు నివాళులర్పిస్తూ ట్రంప్ విడుదల చేసిన ఓ ప్రచార వీడియోను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఈ వీడియోపై ట్విట్టర్ ఒక లేబుల్‌ను పెడుతూ వీడియో తమదని ఇతరులు ఫిర్యాదు చేసిన కారణంగా దాన్ని బ్లాక్ చేస్తున్నట్లు పేర్కొంది.
జోధ్‌పూర్‌లో ‘ఫ్లాయిడ్’ ఘటన!
జో«ద్‌పూర్: జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటనే భారత్‌లోనూ చోటు చేసుకుంది. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో ఓ పోలీస్ అధికారి ఒక వ్యక్తిని కిందకు పడదోసి మోకాళ్లతో అదిమి పట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మాస్కు లేకుండా బయట తిరుగుతున్న ముఖేష్ ప్రజాపతి అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నించగా అతడు తీవ్రంగా ప్రతిఘటించాడు. ఈ మేరకు ప్రతాప్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment