statue damaged
-
విగ్రహం ధ్వంసం కేసు: ముగ్గురు అరెస్ట్
సాక్షి, అవనిగడ్డ (కృష్ణా జిల్లా): దివంగత నేత మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు విగ్రహం ధ్వంసం కేసులో ముగ్గురు నిందితులను అవనిగడ్డ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవనిగడ్డకు చెందిన భూపతి అన్వేష్, భూపతి రేణుకయ్య, భూపతి అజయ్‌లు ఈ చర్యకు పాల్పడినట్లు డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. నిందితులు మోదుమూడి బస్‌షెల్టర్ వద్ద ఉన్నారన్న పక్కా సమాచారంతో అక్కడకు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకొని విచారించామని ఆయన తెలిపారు. (చదవండి: రాత్రి చితక్కొట్టి: పొద్దున అల్లుడ్ని చేసుకున్నారు) ఈ నెల 14న మద్యం మత్తులో విగ్రహం ధ్వంసం చేసి కాల్వలో పడి వేసినట్లు విచారణలో తేలిందని చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా అవనిగడ్డ మహబూబ్ బాషా ఆదేశాల మేరకు.. అవనిగడ్డ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి నిందితులను అవనిగడ్డ ఎస్ఐ సందీప్, నాగాయలంక ఎస్ఐ శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఎవరైనా దేవాలయాలు, రాజకీయ నాయకుల విగ్రహాలపై అసంఘటిత చర్యలకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. (చదవండి: భార్య నగ్న వీడియోల కేసులో మరో ట్విస్ట్) -
ఈ ఘటన దురదృష్టకరం
వాషింగ్టన్: అమెరికా రాజధానిలోని భారతీయ దౌత్యకార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహాన్ని ఆగంతకులు ధ్వంసం చేయడాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు ప్రజలను ఏకం చేయవని వారు స్పష్టం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమైందని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్‌లోని భారత దౌత్యకార్యాలయం సమీపంలో ఉన్న ఈ విగ్రహాన్ని కొందరు దుండగులు బుధవారం ధ్వంసం చేసి, రంగులు పూసిన విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణం నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే, ఈ ఘటనకు ఆందోళనలతో సంబంధం లేదని మార్కో రూబియో అనే సెనెటర్ గురువారం తెలిపారు. నార్త్ కరొలినా సెనేటర్ టామ్ టిల్లిస్ కూడా ఇది అమర్యాదకరమైందని అభివర్ణించారు. శాంతికి మారుపేరుగా చెప్పుకునే గాంధీ ప్రతిరూపాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్రంప్ సలహాదారు కింబర్లీ గుయిఫోలే చెప్పారు. మా గొంతులపై మీ మోకాళ్లు తీయండి.. ‘‘మా గొంతులపై మీ మోకాళ్లు తొలగించం డి’’అన్న నినాదాల మధ్య మినియాపోలిస్‌లో గురువారం జార్జ్ ఫ్లాయిడ్ సంస్మరణ సభలు జరిగాయి. శవపేటిక చుట్టూ గుమికూడిన పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఫ్లాయిడ్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు ఈ సభ జరుగుతూండగా కొంత దూరంలోనే ఉన్న న్యాయస్థానంలో ఫ్లాయిడ్ హత్యకు కారణమైన ముగ్గురు పోలీసు అధికారులకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ.. పూచీకత్తుగా సుమారు రూ.5 కోట్ల చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఫ్లాయిడ్ ఘటనకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ప్యారిస్, లండన్, సిడ్నీ, రియో డిజెనిరోల్లో నిరసనలు జరిగాయి. అదే సమయంలో ఆమెరికాలోని కాలిఫోర్నియాలో ఇప్పటివరకూ ఉన్న కర్ఫ్యూను సడలించారు. కొన్ని చెదురుమ దురు సంఘటనలు మినహా అమెరికా నగరాల్లో ప్రశాంతత నెలకొంది. కొన్నిచోట్ల శాంతియుత ప్రదర్శనలు జరిగాయి. ట్రంప్ ట్వీట్‌కు కత్తెర... సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మధ్య జరుగుత్ను పరోక్ష యుద్ధంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఫ్లాయిడ్‌కు నివాళులర్పిస్తూ ట్రంప్ విడుదల చేసిన ఓ ప్రచార వీడియోను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఈ వీడియోపై ట్విట్టర్ ఒక లేబుల్‌ను పెడుతూ వీడియో తమదని ఇతరులు ఫిర్యాదు చేసిన కారణంగా దాన్ని బ్లాక్ చేస్తున్నట్లు పేర్కొంది. జోధ్‌పూర్‌లో ‘ఫ్లాయిడ్’ ఘటన! జో«ద్‌పూర్: జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటనే భారత్‌లోనూ చోటు చేసుకుంది. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో ఓ పోలీస్ అధికారి ఒక వ్యక్తిని కిందకు పడదోసి మోకాళ్లతో అదిమి పట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మాస్కు లేకుండా బయట తిరుగుతున్న ముఖేష్ ప్రజాపతి అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నించగా అతడు తీవ్రంగా ప్రతిఘటించాడు. ఈ మేరకు ప్రతాప్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
వైఎస్సార్ విగ్రహం ధ్వంసానికి విఫలయత్నం
చిత్తూరు, బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలం బీరంగి పంచాయతీ శంకరాపురంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూల్చేందుకు గుర్తు తెలియని వ్యక్తులు విఫలయత్నం చేశారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన గ్రామంలో కలకలం రేపింది. విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి గడ్డపారలతో ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఇనుపకమ్మీలతో బలంగా ప్రతిష్టించడంతో ఒక్కవైపు ఒరిగిపోయింది. సోమవారం ఉదయం విగ్రహాన్ని గమనించిన వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ మండల కన్వీనర్ ఎన్.ప్రదీప్‌రెడ్డి, ఎంపీపీ పాగొండ ఖలీల్, పార్టీ నాయకులు ఎస్.రవికుమార్, కే.శివకుమార్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దుండగులు వైఎస్సార్ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి కారణాలు తెలియనప్పటికీ ప్రశాంతంగా ఉన్న గ్రామంలో అశాంతి సృష్టించి రాజకీయంగా ఉద్రిక్తతలను సృష్టించా లన్న ప్రయత్నంగా అనుమానిస్తున్నారు. బీరంగి గ్రామంలో ఈ విషయం చర్చనీయాంశమైంది. -
‘విగ్రహాల కూల్చివేత వారి పనే’
సాక్షి, న్యూఢిల్లీ : త్రిపురలో లెనిన్ విగ్రహాల ధ్వంసాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ప్రోత్సహించాయని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. తమ సిద్ధాంతాలతో విభేదించే వారి విగ్రహాలను ధ్వంసం చేయాలని వారు తమ శ్రేణులకు సంకేతాలు పంపారన్నారు. దళితుల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త పెరియార్ విగ్రహాన్నీ ఇవాళ తమిళనాడులో ధ్వంసం చేశారని రాహుల్ ట్వీట్ చేశారు. పెరియార్ విగ్రహం నుంచి తలను కొందరు దుండగులు మంగళవారం వేరుచేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు తిరుపత్తూర్‌లో ఓ బీజేపీ, ఓ సీపీఎం కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు గత వారం అస్సాంలోని కొక్రాజర్లో జన్‌సంఘ్ వ్యవస్ధాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని కొందరు దుండగులు కూల్చివేశారు. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలోనూ మరో ముఖర్జీ విగ్రహాన్ని నేలమట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆ విగ్రహాన్ని వాళ్లే కూల్చారు
సాక్షి, న్యూఢిల్లీ : త్రిపురలోని బెలోనియాలో లెనిన్ విగ్రహాన్ని కూల్చిన ఘటనపై బీజేపీ స్పందించింది. లెనిన్ విగ్రహాన్ని ఎవరూ ధ్వంసం చేయలేదని బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ స్పష్టం చేశారు. ప్రైవేట్ భూమిలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని భూ యజమానులే తొలగించారని దాన్ని ఎవరూ ధ్వంసం చేయలేదని చెప్పారు. త్రిపురలో రెండున్నర దశాబ్ధాల సీపీఎం సర్కార్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన నేపథ్యంలో లెనిన్ విగ్రహం కూల్చివేత కలకలం రేపిన విషయం తెలిసిందే. ‘త్రిపురలో ఏ ఒక్క విగ్రహాన్ని ఎవరూ ధ్వంసం చేయలేదు..ఇది తప్పుడు సమాచారం..కొందరు వ్యక్తులు ప్రైవేట్ భూమిలో విగ్రహాన్ని నెలకొల్పి తర్వాత వారే తొలగించార’ని రాంమాధవ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ నేతలను గౌరవించాలని ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీకి హితవు పలకడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మమత ఇతర రాష్ట్రాలలో జరిగే పరిణామాలపై దృష్టిసారించే ముందు తమ రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దుకోవాలని సూచించారు. -
కేరళలో గాంధీ విగ్రహానికి అవమానం
న్యూఢిల్లీ : విగ్రహాల విధ్వంసం దేశమంతా దావానంలా వ్యాపిస్తోంది. కేరళ, కన్నూర్‌లోని తాళిపరంబ ప్రాంతంలో జాతిపిత మహాత్మా గాంధీ ప్రతిమ అవమానానికి గురైంది. విగ్రహాన్నుంచి కళ్లజోడుని దుండగులు వేరుచేశారు. గాంధీజీ తల నుంచి వేరుపడివున్న కళ్లజోడుని ఈ ఉదయం స్థానికులు గుర్తించారు. తమిళనాడులోని తిరువత్రియూర్ పెరియార్ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి రంగులు పూసి దుండగులు అవమానం చేశారు. త్రిపుర ఎన్నికల్లో విజయానంతరరం చోటుచేసుకున్న పరిణామాల్లో ఆదివారం బీజేపీ కార్యకర్తలు రష్యా విప్లవ నేత లెనిన్ విగ్రహాన్ని కూల్చిన సంగతి.. కోల్‌కతాలో మంగళవారం శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహం కూల్చివేతకు గురైన విషయం విదితమే. -
ఇదీ విగ్రహధ్వంస చరిత్ర!
రాజకీయ నాయకులు, సిద్ధాంతకర్తలు, సంఘసంస్కర్తల విగ్రహాల విధ్వంసం ఈనాటిది కాదు. మతపరమైన విగ్రహాలు, పూజా స్థలాలను ధ్వంసం చేయడం వేల ఏళ్ల క్రితమే క్రితమే జరిగిందని చరిత్ర చెబుతోంది. కొత్త పాలకులు అధికారంలోకి వచ్చినప్పుడు ఓడిపోయిన నేతల చిత్రాలు, విగ్రహాలు, వారి అధికారం, సిద్ధాంతాల చిహ్నాలను పగలగొట్టడం ఫ్రెంచి విప్లవంలో విస్తృతంగా జరిగింది. 1960వ దశకం చివర్లో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమకాలంలో పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా కోల్‌కతాలో రాజారామ్మోహన్రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటి సంఘసంస్కర్తలు, గాంధీ, నెహ్రూ, బోస్ వంటి స్వాతంత్య్రసమరయోధుల విగ్రహాలను ధ్వంసం చేయడం సంచలనం సృష్టించింది. గాంధీ, అంబేడ్కర్, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలపై దాడుల వార్తలు అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. కూలిన లెనిన్, స్టాలిన్ విగ్రహాలు 1991 జూన్–డిసెంబర్ మధ్య జరిగిన పరిణామాలతో సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమై కమ్యూనిస్ట్ పాలన ముగిసినప్పుడు రాజధాని మాస్కో, పోలండ్, బల్గేరియా వంటి తూర్పు ఐరోపా దేశాల్లోనూ లెనిన్, స్టాలిన్ల భారీ విగ్రహాలను కూల్చివేశారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో గాంధీ విగ్రహాన్ని 2015 ఏప్రిల్ 12న కొందరు దుండగులు ధ్వంసం చేశారు. కాలవలోకి నీలం విగ్రహం! 1960ల చివర్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలంటూ సాగిన ఆందోళన సందర్భంగా విజయవాడలోని అప్పటి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ఉద్యమకారులు తొలగించి ఎదురుగా ఉన్న ఏలూరు కాలవలో వేశారు. 2011లో ప్రత్యేక తెలంగాణ కోసం ట్యాంక్‌బండ్‌పై సాగిన మిలియన్ మార్చ్ సందర్భంగా కొందరు అక్కడి కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంలోనే సిద్దిపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని పగలగొట్టారు. -
డెక్కుతున్న ‘విగ్రహ’ రాజకీయం
కోల్‌కతా/లక్నో/చెన్నై: దేశవ్యాప్తంగా విగ్రహాల ధ్వంసం ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. మంగళవారం త్రిపురలో లెనిన్ విగ్ర హం ధ్వంసం.. తర్వాత తమిళనాడులో పెరియార్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేసిన ఘటనలపై చర్చ జరుగుతుండగానే.. యూపీ లోని మీరట్ జిల్లాలో అంబేడ్కర్, కోల్‌కతాలో శ్యామాప్రసాద్ ముఖర్జీ విగ్రహాలు ధ్వంసమయ్యాయి. దీంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ విగ్రహాల ధ్వంసం ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్రంగా ఖండించారు. బాధ్యులు ఏ పార్టీ వారైనా కఠినంగా వ్యవహరించాలన్నారు. శ్యామాప్రసాద్.. అంబేడ్కర్ త్రిపురలో లెనిన్ విగ్రహ ధ్వంసానికి ప్రతీకారంగా కోల్‌కతాలో వామపక్ష పార్టీ కార్యకర్తలు కొందరు భారతీయ జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం ఏడుగురు యువకులు విగ్రహానికి నల్లరంగు పులిమారు. అనంతరం విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న స్థానికులు ఈ విషయాన్ని గమనించి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అరెస్టు చేసిన ఏడుగురిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ‘ఈ ఘటనకు పాల్పడిన వారంతా ‘రాడికల్’ పేరుతో పనిచేసే వామపక్ష భావజాల సంస్థకు చెందినవారు. దీన్ని చాలా తీవ్రమైన ఘటనగా పరిగణిస్తున్నాం’ అని కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలపై కోల్‌కతాలో బీజేపీ ఆందోళనలు నిర్వహించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా ఖుర్ద్ గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు భారత రత్న అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఏ పార్టీవారైనా శిక్షించండి: మోదీ దేశవ్యాప్తంగా జరుగుతున్న విగ్రహధ్వంసం ఘటనలపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడిన మోదీ.. విధ్వంసానికి పాల్పడినవారు ఏ పార్టీవారైనా కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. అటు, విగ్రహ ధ్వంసాన్ని సీరియస్‌గా తీసుకోవాలని.. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా లెనిన్, పెరియార్ విగ్రహాల ధ్వంసాన్ని దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు. ‘విగ్రహాలను పడగొట్టడం దురదృష్టకరం. మా పార్టీ వీటికి ఎప్పుడూ మద్దతు పలకదు. తమిళనాడు, త్రిపురల్లో పార్టీ నేతలతో మాట్లాడాను. ఈ విగ్రహాల ధ్వంసంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నట్లు తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాను’ అని షా స్పష్టం చేశారు. పెరియార్ విగ్రహ ధ్వంసాన్ని ప్రేరేపించినట్లుగా భావిస్తున్న తమిళనాడు బీజేపీ నేత, బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ఫేస్బుక్ కామెంట్లపై అమిత్ షా స్పందిస్తూ.. ‘రాజాపై ఎలాంటి చర్యలు ఉండవు’ అని వెల్లడించారు. పెరియార్ విగ్రహ ధ్వంసానికి సంబంధించి కార్యకర్త ముత్తురామన్‌ను పార్టీనుంచి బీజేపీ తొలగించింది. తమిళనాట నిరసనలు రాజా క్షమాపణలు చెప్పినా తమిళనాడు రాజకీయ పార్టీలు, పెరియార్ అభిమాన సంఘా లు బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాయి. ప్రతిపక్ష డీఎంకే, పలు తమిళ సంఘాలు ఈ ఆందోళనల్లో పాల్గొన్నాయి. చెన్నై, కడలూర్, సేలం తదితర ప్రాంతాల్లో రాజా విగ్రహాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అటు కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయంపై బుధవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. కావేరీ వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే విగ్రహ రాజకీయాలను తెరపైకి తెచ్చి ఉంటారని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. జంధ్యాలు తెంచేశారు చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న 8 మందిని డీవీకే (ద్రవిడార్ విదుత్తలై కళగం) కార్యకర్తలు అటకాయించారు. వీరిని బెదిరించి.. మెడలో వేసుకున జంధ్యాలను బలవంతంగా తెంచేశారు. అనంతరం పెరియార్ అనుకూల నినాదాలు చేస్తూ ద్విచక్రవాహనాలపై వెళ్లిపోయారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయనప్పటికీ.. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు డీవీకే కార్యకర్తలు రాయపేట పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. -
వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం
♦ బందరులోని నిజాంపేటలో గుర్తుతెలియని వ్యక్తుల చర్య ♦ దోషులను శిక్షించాలని కాపు సంఘం నేతల రాస్తారోకో మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని నిజాంపేటలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న కాపు సంఘం నాయకులు దోషులను శిక్షించాలంటూ రేవతి సెంటర్లో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అక్కడే ఉన్న రంగా విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ మచిలీపట్నం వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని, రంగా విగ్రహాన్ని పునఃప్రతిష్టిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త బూరగడ్డ వేదవ్యాస్ ఘటనాస్థలాన్ని పరిశీలించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. పోలీసులు త్వరితగతిన ఈ కేసును పరిష్కరించాలని కోరారు. రంగా విగ్రహం ధ్వంసం సంఘటన ఉద్రిక్తతకు దారితీయటంతో నిజాంపేటలో 144 సెక్షన్ అమలు చేశారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. మచిలీపట్నం ఆర్డీవో పి.సాయిబాబు, తహసీల్దార్ పి.నారదముని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దోషులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పట్టణంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.