కోల్‌కతాలో దెబ్బతిన్న ముఖర్జీ విగ్రహంపై నల్లరంగును తొలగిస్తున్న దృశ్యం. వెల్లూర్‌లో ధ్వంసమైన పెరియార్ విగ్రహం
కోల్‌కతా/లక్నో/చెన్నై: దేశవ్యాప్తంగా విగ్రహాల ధ్వంసం ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. మంగళవారం త్రిపురలో లెనిన్ విగ్ర హం ధ్వంసం.. తర్వాత తమిళనాడులో పెరియార్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేసిన ఘటనలపై చర్చ జరుగుతుండగానే.. యూపీ లోని మీరట్ జిల్లాలో అంబేడ్కర్, కోల్‌కతాలో శ్యామాప్రసాద్ ముఖర్జీ విగ్రహాలు ధ్వంసమయ్యాయి. దీంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ విగ్రహాల ధ్వంసం ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్రంగా ఖండించారు. బాధ్యులు ఏ పార్టీ వారైనా కఠినంగా వ్యవహరించాలన్నారు.
శ్యామాప్రసాద్.. అంబేడ్కర్
త్రిపురలో లెనిన్ విగ్రహ ధ్వంసానికి ప్రతీకారంగా కోల్‌కతాలో వామపక్ష పార్టీ కార్యకర్తలు కొందరు భారతీయ జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం ఏడుగురు యువకులు విగ్రహానికి నల్లరంగు పులిమారు. అనంతరం విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న స్థానికులు ఈ విషయాన్ని గమనించి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అరెస్టు చేసిన ఏడుగురిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
‘ఈ ఘటనకు పాల్పడిన వారంతా ‘రాడికల్’ పేరుతో పనిచేసే వామపక్ష భావజాల సంస్థకు చెందినవారు. దీన్ని చాలా తీవ్రమైన ఘటనగా పరిగణిస్తున్నాం’ అని కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలపై కోల్‌కతాలో బీజేపీ ఆందోళనలు నిర్వహించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా ఖుర్ద్ గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు భారత రత్న అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
ఏ పార్టీవారైనా శిక్షించండి: మోదీ
దేశవ్యాప్తంగా జరుగుతున్న విగ్రహధ్వంసం ఘటనలపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడిన మోదీ.. విధ్వంసానికి పాల్పడినవారు ఏ పార్టీవారైనా కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. అటు, విగ్రహ ధ్వంసాన్ని సీరియస్‌గా తీసుకోవాలని.. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది.
బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా లెనిన్, పెరియార్ విగ్రహాల ధ్వంసాన్ని దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు. ‘విగ్రహాలను పడగొట్టడం దురదృష్టకరం. మా పార్టీ వీటికి ఎప్పుడూ మద్దతు పలకదు. తమిళనాడు, త్రిపురల్లో పార్టీ నేతలతో మాట్లాడాను. ఈ విగ్రహాల ధ్వంసంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నట్లు తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాను’ అని షా స్పష్టం చేశారు. పెరియార్ విగ్రహ ధ్వంసాన్ని ప్రేరేపించినట్లుగా భావిస్తున్న తమిళనాడు బీజేపీ నేత, బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ఫేస్‌బుక్ కామెంట్లపై అమిత్ షా స్పందిస్తూ.. ‘రాజాపై ఎలాంటి చర్యలు ఉండవు’ అని వెల్లడించారు. పెరియార్ విగ్రహ ధ్వంసానికి సంబంధించి కార్యకర్త ముత్తురామన్‌ను పార్టీనుంచి బీజేపీ తొలగించింది.
తమిళనాట నిరసనలు
రాజా క్షమాపణలు చెప్పినా తమిళనాడు రాజకీయ పార్టీలు, పెరియార్ అభిమాన సంఘా లు బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాయి. ప్రతిపక్ష డీఎంకే, పలు తమిళ సంఘాలు ఈ ఆందోళనల్లో పాల్గొన్నాయి. చెన్నై, కడలూర్, సేలం తదితర ప్రాంతాల్లో రాజా విగ్రహాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అటు కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయంపై బుధవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. కావేరీ వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే విగ్రహ రాజకీయాలను తెరపైకి తెచ్చి ఉంటారని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.
జంధ్యాలు తెంచేశారు
చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న 8 మందిని డీవీకే (ద్రవిడార్ విదుత్తలై కళగం) కార్యకర్తలు అటకాయించారు. వీరిని బెదిరించి.. మెడలో వేసుకున జంధ్యాలను బలవంతంగా తెంచేశారు. అనంతరం పెరియార్ అనుకూల నినాదాలు చేస్తూ ద్విచక్రవాహనాలపై వెళ్లిపోయారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయనప్పటికీ.. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు డీవీకే కార్యకర్తలు రాయపేట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment