తమిళనాడు వెల్లూరులో ధ్వంసమైన పెరియార్ విగ్రహం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న విగ్రహాల ధ్వంసం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా స్పందించారు. విగ్రహాల ధ్వంసాన్ని తాను ఎంతమాత్రం ఆమోదించబోనని ఆయన తేల్చిచెప్పారు. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖను ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ అడ్వయిజరీ జారీచేసింది. విగ్రహాల ధ్వంసానికి దిగే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
త్రిపురలో ధ్వంసమైన లెనిన్ విగ్రహం
త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొందరు దుండగులు లెనిన్ విగ్రహాలను కూల్చివేయడంతో తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనసంఘ్ స్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మరోవైపు తమిళనాడుకూ ఈ సెగ తగిలింది. త్రిపురలో లెనిన్ విగ్రహాలకు పట్టిన గతే తమిళనాడులో పెరియార్ విగ్రహాలకు పడుతుందని బీజేపీ సీనియర్ నేత హెచ్ రాజా ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం, వెంటనే వెల్లూరులో పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనికి నిరసనగా కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై పెట్రో బాంబు దాడి జరిగింది.
బెంగాల్‌లో శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహంపై నల్లరంగు పోసిన దృశ్యం
ఈ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించగా.. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా తీవ్రంగా స్పందించారు. కొన్ని రాష్ట్రాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం తీవ్ర దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీగా బీజేపీ ఎవరి విగ్రహాల ధ్వంసానికి మద్దతునివ్వబోదని ఆయన ట్వీట్ చేశారు. తమిళనాడు, త్రిపురలోని పార్టీ యూనిట్లతో మాట్లాడానని, విగ్రహాల ధ్వంసంతో ఎవరికైనా సంబంధం ఉంటే వారిపై తీవ్ర చర్యలు తప్పవని షా హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment