సాక్షి, న్యూడిల్లీ : త్రిపురలో రష్యా కమ్యూనిస్టు విప్లవకారుడు వీఐ లెనిన్ విగ్రహాన్ని మంగళవారం సాయంత్రం బుల్డోజర్ పెట్టి కూల్చేసిన బీజేపీ కార్యకర్తలు తమిళనాడులోని పెరియార్ రామస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు బుధవారం ప్రయత్నించడంతో తమిళనాడులో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి పెరియార్ రామస్వామి విగ్రహంపై దాడికి కాషాయ మూకలను ఫేస్‌బుక్ పోస్టింగ్ ద్వారా రెచ్చగొట్టిందే బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్. రాజా.
‘లెనిన్ ఎవరు? ఆయనకు భారత్‌కు సంబంధం ఏమిటీ? కమ్యూనిస్టులకు భారత్‌కు ఉన్న సంబంధం ఏమిటీ? నేడు లెనిన్ విగ్రహం, రేపు తమిళనాడులోని ఈవీ రామస్వామి (పెరియార్) విగ్రహం!’ అంటూ బీజేపీ నాయకుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దానికి స్పందించిన ఇద్దరు బీజేపీ అనుమానిత కార్యకర్తలు తమిళనాడులోని వెల్లూర్‌కు సమీపంలోని తిరుపట్టూర్‌లో ఉన్న పెరియార్ విగ్రహంపై రాళ్లు రువ్వారు. రాజాను గూండా చట్టం కింద అరెస్ట్ చేయాలంటూ డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్, విగ్రహాన్ని ముట్టుకున్న చేతుల్ని నరికేస్తామంటూ ఎండీఎంకే నాయకుడు వైకో హెచ్చరించారు. దీంతో హెచ్. రాజా వెంటనే ఫేస్‌బుక్‌లోని తన పోస్టింగ్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే పెరియర్ రామస్వామి విగ్రహాలను తొలగించాలని బీజేపీ కార్యకర్తలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని బీజేపీ తమిళనాడు ప్రతినిధి నారాయణన్ తిరుపతి చెప్పారు.
బీజేపీకైనా, సంఘ్ పరివార్‌కైనా పెరియార్ రామస్వామి అంటే ఎందుకు కోపం? ఆయన ఎవరు ? ఆయన సిద్దాంతం ఏమిటీ ? తమిళనాడులోని ఈరోడ్‌లో 1879, సెప్టెంబర్‌లో ఈవీ రామస్వామి జన్మించారు. ఆయన అసలు పేరు వెంకట రామస్వామి. ఈరోడ్‌లో పుట్టినందున ఈరోడ్ వెంకట రామస్వామి అయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రజల దష్టిలో పెరియార్ రామస్వామిగా మారారు. ‘పెరియార్’ అంటే తమిళంలో గౌరవనీయులు లేదా పెద్ద అని అర్థం. పొడవాటి గుబురు గడ్డం. ముఖాన గుండ్రటి కళ్లజోడు. ఉదారత్వం ఉట్టిపడే ఆయన నవ్వును చూస్తే ఎవరైనా ఆయన్ని గౌరవనీయులని అనుకుంటారు. ఆయనలో ర్యాడికల్ సిద్దాంతం రగులుకుంటుందని ఎవరూ ఊహించరు.
సమాజంలో ఆయన కుల, మత, వర్గ ఆధిపత్యాలపై తిరుగుబాటు చేశారు. కుల, మత రహిత సమసమాజం కావాలని కాంక్షించారు. మహిళలకూ సమాన హక్కులు కావాలన్నారు. స్వతహాగా సమాజంలో అణచివేతకు గురవుతున్న ‘బలిజ’ కుటుంబానికి చెందిన పెరియార్ సమాజంలో ప్రధానంగా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. దక్షిణ భారతానికి చెందిన ద్రావిడులపై ఉత్తరానికి చెందిన బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ ‘స్వీయాభిమాన ఉద్యమాన్ని’ నిర్మించారు. అగ్రవర్ణాలు ఇతర వర్గాలపై తమ ఆధిపత్యం కొనసాగించడం కోసం, వారిని తిరుగుబాటు చేయకుండా కట్టడి చేయడం కోసం దేవుళ్లను, వారి పేరిట గుళ్లూ గోపురాలను, పనికి మాలిన పురాణాలను సష్టించారంటూ ప్రచారోద్యమాన్ని సాగించడం ద్వారా ఆయన ప్రముఖ హేతువాదిగా ముద్రపడ్డారు.
‘దేర్ ఈజ్ నో గాడ్, దేర్ ఈజ్ నో గాడ్, దేర్ ఈజ్ నో గాడ్ ఎటాల్ (దేవుడు లేడు, దేవుడు లేడూ, అసలు దేవుడే లేడు)’ పెరియార్ ఉద్యమంలో ప్రధాన నినాదం. ‘దేవుడు దుష్టుడు, దేవున్ని పూజించే వారు ఆటవికులు అని కూడా అన్నారు. కుల, మత వ్యత్యాసాలు కలిగిన భారత దేశమే తనకు వద్దని, కుల, మత రహిత దక్షిణ భారతమే తనకు దేశంగా కావాలన్నారు. కుల, మతాలకు విలువనిస్తున్న భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. 1957లో పెరియార్ మూడువేల మంది తన అనుచరులతో కలిసి భారత రాజ్యాంగం ప్రతులను తగులబెట్టి అరెస్టయ్యారు. కుల, మతాలను రాజ్యాంగం నిషేధించినప్పుడే కుల, మత రహిత సమాజం ఏర్పడుతుందని వాదించారు. హిందూత్వ వాదాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఈ కారణంగానే బీజేపీకి ఆయన అంటే పడదు. ఈ కారణంగానే బీజేపీ ద్రావిడ రాష్ట్రాలపై ఇప్పటికీ పట్టు సాధించలేక పోతోంది. దక్షిణాదిలో కూడా పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం సైద్ధాంతిక వాదనలకుగాని, విగ్రహ విధ్వంసానికి గానీ బీజేపీ నేతలు ఇంతకాలం దూరంగా ఉంటూ వచ్చారు.
పెరియార్ తన ఆశయాల లక్ష్య సాధన కోసం 1916లో ఏర్పడిన ‘జస్టిస్ పార్టీ’లో 1939లో చేరారు. 1944లో ఆ పార్టీని ‘ద్రావిడదార్ కళగం’గా మార్చారు. ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాజికోద్యమానికే ప్రాధాన్యతనిచ్చారు. ఎన్నికల రాజకీయాలు కూడా ముఖ్యమేనంటూ అందులో నుంచి 1949లో సీఎన్ అన్నాదురై నాయకత్వాన డీఎంకే పుట్టింది. దాని నుంచి అన్నాడీఎంకే ఆవిర్భవించింది. మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కళగమ్, పెరియార్ ద్రావిడదార్ కళగమ్, థాంతై పెరియార్ ద్రావిడదార్ కళగమ్, ద్రావిడదార్ విద్యుత్తలై కళగమ్ పార్టీలు పుట్టుకొచ్చాయి. పుట్టుకతోనే ధనవంతుడైన పెరియార్ (తండ్రి కన్నడ వ్యాపారి) ఈరోడ్ మున్సిపాలిటీ పరిధిలో పలు పదవులు నిర్వహించారు. ఆ తర్వాత 1919లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1925 వరకు కొనసాగారు. తాను ఆశించిన లక్ష్యాలను సాధించాలంటే సొంతంగా సామాజిక ఉద్యమం చేపట్టడమే మార్గం అనుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment