లెనిన్ విగ్రహాలను కూల్చినవారు, పెరియార్ విగ్రహాన్ని కూడా కూలగొట్టాలని చెప్పినవారు తాము ఆదర్శ పురుషుడిగా చెప్పే రాముణ్ని కానీ, ధర్మరాజును కానీ అనుసరించలేదు. ‘విజయాంతాని వైరాణి’ అనుకోలేదు. అల్పబుద్ధిని చాటుకున్న భీముణ్ని ఒరవడిగా తీసుకున్నారు.
త్రిపురలో లెనిన్ విగ్రహాల కూల్చివేత దృశ్యాలను చూసినప్పుడు ఇద్దరు ఇతిహాస పాత్రలు మనసులో మెదిలారు. ఒకరు రాముడు, ఇంకొకరు ధర్మరాజు. రావణసంహారం జరిగిన తర్వాత, అన్న మరణానికి విభీషణుడు శోకిస్తున్నప్పుడు అతణ్ని ఓదార్చిన రాముడు, మృతుడైన రావణుని పట్ల తన వైఖరిని వివరిస్తూ, ‘‘విభీషణా! వ్యక్తులు జీవించి ఉన్నంతకాలమే వైరాలు ఉండాలి. ఆ తర్వాత వాటిని విడిచిపెట్టాలి. ఇప్పుడు మన కార్యం నెరవేరింది కనుక ఇతనికి అంత్యక్రియలు నిర్వహించు. ఇతడు నీకెంత గౌరవనీయుడో.. ఇప్పుడు నాకూ అంతే గౌరవనీయుడు’’ అంటాడు. ఈ సందర్భంలో రాముడు అన్న ‘‘మరణాంతాని వైరాణి’’ అనే మాట ఒక గొప్ప సూక్తిగా జాతి నాలుకలపై నిలిచిపోయింది.
ధర్మరాజు విషయానికి వస్తే, తన గదాఘాతానికి తొడలు విరిగి దుర్యోధనుడు పడిపోయిన తర్వాత భీముడు అతణ్ని దూషిస్తూ ఎడమ కాలితో అతని శిరస్సును తంతాడు. ఆ చర్యను ధర్మరాజు, అర్జునుడు ఏవగించుకుంటూ మొహం పక్కకు తిప్పుకుంటారు. భీముడు రెండోసారి ఆ పని చేసినప్పుడు ధర్మరాజు ఊరుకోలేకపోతాడు. ‘‘ఎందుకలా తంతున్నావు? ఈ అధర్మం నీకు రోత పుట్టించడం లేదా? ఈ రాజరాజు తమ్ముళ్ళు, బంధువులు మరణించిన తర్వాత కూడా యుద్ధం చేసి పడిపోయిన గౌరవాన్ని పొందుతున్నప్పుడు నువ్వు చేసిన ఈ హీనమైన పనిని జనం మెచ్చుతారా?’’ అని తీవ్రంగా మందలిస్తాడు. విజయం కలిగించిన హర్షావేశాలతో ఉచితానుచితాలు పట్టించుకోని అల్పబుద్ధిగా ఈ ఘట్టంలో కవి భీముణ్ని వర్ణిస్తాడు.
లెనిన్ విగ్రహాలను కూల్చినవారు, పెరియార్ విగ్రహాన్ని కూడా కూలగొట్టాలని చెప్పినవారు తాము ఆదర్శ పురుషుడిగా చెప్పే రాముణ్ని కానీ, ధర్మరాజును కానీ అనుసరించలేదు. ‘విజయాంతాని వైరాణి’ అనుకోలేదు. అల్పబుద్ధిని చాటుకున్న భీముణ్ని ఒరవడిగా తీసుకున్నారు. అఫ్ఘానిస్తాన్‌లోని బామియాన్‌లో బుద్ధ విగ్రహాలను నేలమట్టం చేసిన తాలిబన్లను ఆదర్శం చేసుకున్నారు. ఈ విగ్రహవిధ్వంసం ఇంతటితో ఆగదనీ, అది తమ నేతలకు కూడా వ్యాపిస్తుందనే స్పృహ లోపించింది కనుక దీని వెనుక అల్పబుద్ధే కాక మందబుద్ధి కూడా ఉంది. పశ్చిమ బెంగాల్‌లో శ్యామాప్రసాద్ ముఖర్జీ విగ్రహంపట్ల అపచారం జరిగింది. పెరియార్, అంబేడ్కర్, మహాత్మా గాంధీల విగ్రహాలకు మసిపూశారు. ఇది ఇటీవలి కాలంలో ఎరగని ధోరణి. మూడు దశాబ్దాలకు పైగా వామపక్షాలకు త్రిపురను మించి పెద్ద కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్‌ను చేజిక్కించున్న తర్వాత కూడా మమతాబెనర్జీ ఇలాంటి దురాగతానికి పాల్పడలేదు. అయినాసరే త్రిపురలో తమది గొప్ప భావజాల విజయంగా మోదీ చెప్పుకోవడం ఒక విడ్డూరమైతే, భిన్న భావజాలప్రతీకైన లెనిన్ విగ్రహాన్ని అనుయాయులు భౌతికంగా కూల్చివేయడం ఇంకొక వైపరీత్యం.
లెనిన్ విదేశీయుడు కనుక అతని విగ్రహాన్ని కూల్చినా తప్పులేదని సమర్థించుకున్నారు కానీ, వాస్తవానికి తాము గురిపెడుతున్నది లెనిన్ భావజాలాన్ని నమ్మే స్వదేశీయులపైనేనన్న సంగతిని గమనించుకోలేదు. భావజాలం వ్యక్తుల ఆలోచనల్లో ఉంటుంది తప్ప విగ్రహాలలో ఉండదన్న గ్రహింపు లోపించింది. తన సమకాలీన భారతదేశ పరిణామాలపై లెనిన్ ఎలాంటి సానుకూల వైఖరి తీసుకున్నాడో ఆయనకూ, ఎం. ఎన్. రాయ్‌కి మధ్య జరిగిన చర్చల ద్వారా తెలుస్తుంది. గాంధీ నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటం సాగిస్తున్న జాతీయవాద శక్తులను తిరోగమనవాదులుగా పేర్కొంటూ, వారికి సైతం వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని నిర్మించాలని ఎం. ఎన్. రాయ్ వాదిస్తే,, లెనిన్ దానిని ఖండిస్తూ కమ్యూనిస్టులు గాంధీ సహా జాతీయవాద శక్తులను బలపరచితీరాలని స్పష్టం చేశాడు. విదేశీయుడన్న కారణంతో లెనిన్ విగ్రహాన్ని కుప్పకూల్చడంలోని సంకుచితత్వం, చారిత్రిక అజ్ఞానం మాటలకు అందనిది. లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయడమంటే, భారత్‌తో ముడిపడిన ఆయన తాలూకు చారి త్రిక ఆనవాళ్లను చెరిపివేసి చరిత్రకు ద్రోహం చేయబోవడమే.
ద్రవిడ ఉద్యమ నిర్మాత, సంఘసంస్కర్త పెరియార్ రామస్వామి నాయకర్ విగ్రహాన్ని కూడా కూల్చివేయాలని తమిళనాడుకు చెందిన బీజేపీ నేత ఒకరు పిలుపు ఇవ్వడం, విగ్రహానికి మసిపూయడం వెనుక ఉన్నదీ; భిన్న ఆలోచనా పంథాలను తుడిచిపెట్టి, వ్యక్తుల మెదళ్లు వంచి దేశం ఆ చివరి నుంచి ఈ చివరివరకూ ఏకశిలా సదృశమైన భావజాలాన్ని రుద్దే వ్యూహమే. ఈ సందర్భంలో కంచిలోని శంకరాచార్యపీఠాన్ని, చిరకాలం పీఠాధిపత్యం వహించిన పరమాచార్యను గుర్తు చేసుకోవడం అవసరం. కంచి మఠానికి ఎదురుగా గోడలపై పెరియార్ నాస్తికప్రబోధాలు కనిపిస్తాయి. మఠానికి దగ్గరలోనే ఒక మసీదు కూడా ఉంది. శతాబ్దకాలానికి పైనుంచీ ఈ మూడింటి సహజీవనం అక్కడ కొనసాగుతూవచ్చింది. మఠం పక్కనే మసీదు ఉండడం పరమాచార్యకు అభ్యంతరం కాకపోగా, తెల్లవారుజామున అక్కడ జరిగే నమాజుతోనే తను మేలుకునేవాడినని ఆయన చెప్పుకున్నారు. భిన్న విశ్వాసాల శాంతియుత సహజీవనానికి అతి గొప్ప ప్రతీ కలలో ఇదొకటి. ఈ సహజీవన వైవిధ్యాన్ని, చెరిపివేసి ఒకే మూసభావజాలాన్ని, మూర్తులను, చరిత్రలను ఉత్తర, దక్షిణ తేడాలు లేకుండా యావద్భారతవ్యాప్తం చేసే ఎత్తుగడలో భాగంగానే లెనిన్ విగ్రహ ధ్వంసాన్ని, పెరియార్ విగ్రహంపై దాడిని చూడవలసి ఉంటుంది.
ఈ దుశ్చర్యలను సమర్థించుకునే విఫలయత్నంలో బీజేపీ శ్రేణులూ, పరివార్ సంస్థల ప్రతినిధులూ చేసిన వితండవాదాలు, దొర్లించిన వికృత వ్యాఖ్యలు అంతే విస్తుగొలిపాయి. ‘ఒక ప్రభుత్వం చేసిన దానిని ఇంకో ప్రభుత్వం రద్దు చేస్తుం’దని అంటూ త్రిపుర గవర్నర్ బాహాటంగా సమర్థించారు. మనుషులపై దాడి చేసినా, చంపినా హింస అవుతుంది తప్ప విగ్రహాలపై దాడి హింస కాబోదని ఆయన నిర్వచనం. ‘లెనిన్ విగ్రహాలను కూల్చింది రష్యాలో కాదు, త్రిపురలో! మార్పు రావలసిందే’నని మరో నేత వ్యాఖ్య. ఎప్పటిలానే ప్రధాని ఆలస్యంగా గొంతు విప్పి విగ్రహాల కూల్చివేతను ఖండించినా ఈ సమర్థింపు ప్రహసనం సాగుతూనే ఉంది. అధినేత ఖండిస్తారు. అనుయాయులు తాము చేసేది చేస్తూనే ఉంటారు. అంతిమంగా కుప్పకూలుతున్నవి ఏవో విగ్రహాలో మరొకటో కావు... వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేశ సంస్కృతీ, సభ్యతా, సంప్రదాయాలు. మనం ఎంతో అపురూపంగా పెంచి పోషించుకోవలసిన ప్రజాస్వామిక విలువలు.
భాస్కరం కల్లూరి
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్ : kalluribhaskaram9@gmail.com
Comments
Please login to add a commentAdd a comment