
చెన్నై/కన్నూర్/లక్నో: దేశవ్యాప్తంగా విగ్రహాల ధ్వంసకాండ కొనసాగుతోంది. లెనిన్, పెరియార్, శ్యామాప్రసాద్ ముఖర్జీ, అంబేడ్కర్ విగ్రహాలపై వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఘటనలపై ఆగ్రహం వ్యక్తమవుతుండగానే కేరళలోని కన్నూర్‌లో గాంధీ విగ్రహానికి నల్లరంగు పూశారు. ఈ ఘటనలో గాంధీ కళ్లద్దాలు పగిలిపోయాయి. చెన్నైలోని తిరువోత్తియూర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నల్లరంగు పూశారు.
ఈ ఘటనను తమిళనాడు సీఎం పళనిస్వామి ఖండించారు.నిందితులను పట్టుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసింది. అటు, యూపీలోని బలియా జిల్లాలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయటం ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతూ.. సమాజంలో శాంతి సామరస్యాలకు భంగం కలిగిస్తున్న వారిపై దేశద్రోహం కేసులు నమోదుచేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment