statues destroyed
-
విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని పలుచోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు విధ్వంసకాండను కొనసాగిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను, అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం గోపాలపురంలో గురువారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం తలభాగాన్ని ఛిద్రం చేసి విగ్రహాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి స్వామిదాసు ధ్వంసమైన వైఎస్ విగ్రహాన్ని శుక్రవారం పరిశీలించారు. అనంతరం స్వామిదాసు విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ క్యాడర్‌ను భయభ్రాంతులకు గురిచేయడానికి దుండగులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలీసులు, అధికారులు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. » తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారని చెప్పారు. ఏకొండూరు మండలం రేపూడిలో టీడీపీ కార్యకర్తలు ఎంపీటీసీ సభ్యురాలి పొలం ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసి తోటలోని మొక్కలను పాడుచేశారని చెప్పారు. వెంకట్ తండాలో భూక్యా వెంకట్ పొలంలో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ధ్వంసం చేసి రూ.లక్షకు పైగా నష్టం కలిగించారని తెలిపారు. తునికిపాడులో గంపలగూడెం మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడిని గ్రామ బహిష్కరణ చేస్తున్నట్లు టీడీపీ నాయకులు ప్రకటించడం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని పేర్కొన్నారు. పోలీసులు ఇటువంటి సంఘటనలపై సత్వరం చర్యలు తీసుకుని నిందితులను శిక్షించకపోతే తాము ఉపేక్షించబోమని హెచ్చరించారు. గ్రామ సచివాలయాలపై శిలాఫలకాలను ధ్వంసం చేయడం కూడా ఉన్మాదచర్యగా ఆయన అభివర్ణించారు. తిరువూరు, ఏకొండూరు, విస్సన్నపేట జెడ్పీటీసీ సభ్యులు యరమల రామచంద్రారెడ్డి, భూక్యా గన్యా, లోకేశ్వరరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు ఈ ఘటనలను ఖండించారు. » గుంటూరు జిల్లా తెనాలి 14వ వార్డులోని శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థానం వద్ద అప్పటి మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు తన సొంత నిధులు రూ.లక్షతో దేవస్థాన ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు. అనంతరం అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తో శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేశారు. శిలాఫలకంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే, వైస్ చైర్మన్ ఫొటోలు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి కొందరు టీడీపీ నాయకులు శిలాఫలకంపై ఉన్న మూడు ఫొటోలను ధ్వంసం చేశారు. » తెనాలి 15వ వార్డు చినరావూరు పార్కు వద్ద వైఎస్సార్సీపీ జెండా దిమ్మెను ఏర్పాటు చేసి అక్కడ శిలాఫలకాన్ని అప్పటి ఎమ్మెల్యే శివకుమార్ ఆవిష్కరించారు. అక్కడ కూడా సీఎం జగన్, ఎమ్మెల్యే శివకుమార్, వైస్ చైర్మన్ కోటేశ్వరరావు ఫొటోలు ఏర్పాటు చేశారు. వాటిని కొందరు టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. » నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రూరల్ మండలం అహోబిలంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ శివారు నుంచి దేవాలయం వరకు సీసీ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డును ప్రారంభించిన అప్పటి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలే ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే అహోబిలం గ్రామ శివారులోని దొరకొట్టాల వద్ద ఓ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. » ఏలూరు జిల్లాలోని మండల కేంద్రమైన ద్వారకాతిరుమలలో శుక్రవారం కొందరు వ్యక్తులు ఒక శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. స్థానిక శివాలయానికి వెళ్లే ఘాట్ రోడ్డులో మండల పరిషత్ నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన మంచినీటి బోరు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని పగులగొట్టారు. టీడీపీ వర్గీయులు రెచ్చిపోయి దౌర్జన్యాలు, దాడులకు దిగడం, ప్రభుత్వ ఆస్తులు, శిలాఫలకాలను ధ్వంసం చేయడం సరికాదంటూ గ్రామస్తులు పేర్కొంటున్నారు. » తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పెన్నగడం ఎస్సీ కాలనీలో పదేళ్లుగా ఉన్న వైఎస్సార్సీపీ జెండా దిమ్మెను శుక్రవారం టీడీపీ నాయకులు జేసీబీతో ధ్వంసం చేశారు. టీడీపీ నాయకులు ఇలాంటి అరాచాకాలు చేయడం తగదని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. »పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ మండలం వేల్పూరు గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గురువారం రాత్రి గ్రామానికి చెందిన వంగవోలు విజయ్‌కుమార్ ధ్వంసం చేశాడు. స్థానిక బండా పట్టాభి రైస్‌మిల్లు వీధిలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాల వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా గురువారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. ఈ సమయంలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం అక్కడ పరిశీలించారు. తణుకు రూరల్ సీఐ జి.వి.వి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ కె.చంద్రశేఖర్, ఇతర పోలీసు సిబ్బంది విచారణ చేపట్టారు. గ్రామంలో అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సమీపంలో సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు విజయ్‌కుమార్ అంగీకరించాడని సీఐ నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. పగలగొట్టిన విగ్రహం స్థానంలో వైఎస్సార్ కొత్త విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రానికి స్థానిక పోలీసులు ఏర్పాటు చేశారు. స్థానిక నాయకులే దీన్ని ఏర్పాటు చేయించారని తెలుస్తోంది. ఎవరు ఏర్పాటు చేయించారనే విషయాన్ని పోలీసులు చెప్పలేదు. -
రాజకీయం చేయడం తగదు
కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలం గోనుగూరు పంచాయతీలో సుబ్రమణ్యస్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం ఘటన సున్నితమైందని, దీన్ని రాజకీయ పారీ్టలు లబి్ధకోసం వాడుకోవడం తగదని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ పేర్కొన్నారు. కుప్పంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఘటనపై మంగళవారం దేవస్థాన కమిటీ, పూజారులు ఫిర్యాదు చేయడంతో 24 గంటల్లోనే పోలీసుశాఖ ఛేదించిందని చెప్పారు. ఇది ఎలా జరిగింది, కారకులెవరు.. అనే సమాచారం తెలుసుకోకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనల్ని రాజకీయ పారీ్టలు మానుకోవాలని సూచించారు. గోనుగూరు గ్రామంలో నాలుగేళ్లుగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న జ్యోతి అనే మహిళ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను ధ్వంసం చేసి కొండ పక్కనున్న గుట్టలో పడేసిందని చెప్పారు. గ్రామంలోని ఓ టీ దుకాణం వద్ద చేతికి గాయాలెందుకయ్యాయని కొందరు జ్యోతిని ప్రశ్నించగా.. మురుగన్‌ను చంపేశానని చెప్పినట్లు తెలిపారు. వారానికి ఒకసారి ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లే పూజారులు మూల విగ్రహాలు కనబడకపోవడంతో ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై అదనపు ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేశామని, ఆలయ కమిటీ, గ్రామస్తుల సహకారంతో 24 గంటల్లో ఛేదించామని చెప్పారు. జిల్లాలో 3,700 ఆలయాల్లో జియో ట్యాగింగ్ చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, నిఘా పెంచామని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసుశాఖ స్పందించి నిగ్గు తేల్చిందని, అసలు విషయం తెలుసుకోకుండా చంద్రబాబు సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో డీఎస్పీ గంగయ్య, సీఐలు శ్రీధర్, యతీంద్ర, నాలుగు మండలాల ఎస్ఐలు పాల్గొన్నారు. -
గాంధీజీ విగ్రహాన్నీ వదల్లేదు
వాషింగ్టన్: నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానంతరం హింసాకాండకు పాల్పడిన నిరసనకారులను ‘బందిపోటు ముఠా’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. చివరకు వారు, వాషింగ్టన్ డీసీలోని మహాత్మాగాంధీ విగ్రహాన్నీ విడిచిపెట్టలేదన్నారు. శ్వేతజాతి పోలీసు అధికారి డెరెక్ చౌవిన్ మే 25న జార్జ్ ఫ్లాయిడ్ మెడపైన మోకాలితో తొక్కిపట్టగా, ఊపిరాడక ఫ్లాయిడ్ మరణించారు. ఈ విషయం వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై అమెరికాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. కొందరు ఆందోళనకారులు దేశవ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడ్డారు. దీనిపై, అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మిన్నెసోటాలో ట్రంప్ మాట్లాడారు. ఆందోళనకారులను ఉద్దేశించి ‘వారు అబ్రహం లింకన్ విగ్రహాన్ని కూల్చివేశారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియలేదు. మన గత చరిత్రని వారు ధ్వంసం చేస్తున్నారు. నేను అధికారంలో ఉన్నంత కాలం అమెరికా చరిత్రను వారేమీ చేయలేరు’ అని వ్యాఖ్యానించారు. అందుకే విగ్రహాల విధ్వంసానికి పాల్పడే వారికి పదేళ్ళు జైలు శిక్ష విధించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. దీంతో విగ్రహాల విధ్వంసం ఆగిపోయిందని ట్రంప్ అన్నారు. కూల్చి వేసిన గాంధీ విగ్రహాన్ని భారత ఎంబసీ సాయంతో పునర్నిర్మించినట్టు తెలిపారు. -
అర్ధరాత్రివేళ వైఎస్సార్, విగ్రహాల తొలగింపు
పిడుగురాళ్లటౌన్(గురజాల): పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహాలను శనివారం అర్ధరాత్రి అధి కారులు దగ్గరుండి తొలగించారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్నాయని విగ్రహాలను తొలగించారు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నాయకులతో విగ్రహాల తొలగింపుపై అధికారులు సమావేశమయ్యారు. అన్ని రకాల అనుమతులు తీసుకుని ప్రతిష్టించిన వైఎస్సార్ విగ్రహం తొలగింపునకు నాయకులు అంగీకరించలేదు. ఎన్టీఆర్ విగ్రహ దాత టీడీపీలో లేకపోవడంతో ఆ గ్రహాన్ని తొలగించేందుకు ఆ పార్టీ నాయకులు అంగీకరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించడానికి అంగీకారం లేకపోవడంతో అధికారులు శనివారం అర్ధరాత్రి వేళ విగ్రహాల తొలగిపునకు పూనుకున్నారు. తహసీల్దార్ రవి బాబు, మున్సిపల్ కమిషనర్ కాసు శివరామిరెడ్డి, పట్టణ సీఐ ఎం హనుమంతరావు దగ్గరుండి విగ్రహాలను తొలగింపును పర్యవేక్షించారు. తొలగించిన విగ్రహాలను ఆర్అండ్బీ బంగ్లా ప్రాంగణంలోకి తరలించారు. విగ్రహాల దిమ్మెలు పటిష్టంగా ఉండంతో వాటిని తొలగించలేదు. వైఎస్ విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్టిస్తాం : కాసు అర్ధరాత్రివేళ ఎవరూలేకుండా దొంగతనంగా విగ్రహాల తొలగించడం ఏమిటని వైఎస్సార్ సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. విగ్రహాలు తొలగించిన ప్రదేశాన్ని ఆయన ఆదివారం పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. అన్ని అనుమతులు తీసుకున్న తరువాత ట్రాఫిక్‌కు ఇబ్బందిగా లేదని నిర్ధారించాక, కలెక్టర్ ఆదేశాలతో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించారని గుర్తుచేశారు. ఇక్కడ ఫౌంటెన్ పెడతామంటున్నారని, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్సార్, ఎన్టీఆర్ కంటే ఫౌంటన్ ఎక్కువా అని ప్రశ్నించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందని చెబితే గురజాల మాదిరిగానే ఇక్కడా విగ్రహం తొలగింపునకు సహకరించేవారిమని అన్నారు. కలెక్టర్ ఉత్తర్వులను ఉల్లంఘించిన మునిసిపల్ కమిషనర్, ఆర్డీఓపై కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదుచేసి, వారిని సస్పెండ్ చేసేవరకు పోరాడతామని స్పష్టంచేశారు. మరో ఆరు నెలల్లో ఇక్కడే వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రజాప్రతినిధులు శాశ్వతం కాదన్న విషయాన్ని అధికారులు గుర్తించుకోవాలని హితవుపలికారు. వైఎస్సార్ సీపీ నాయకుడు ఎనుముల మురళీధరరెడ్డి, పట్టణ, మండల అధ్యక్షులు చింతా వెంకటరామారావు, చల్లా పిచ్చిరెడ్డి, నియోజకవర్గ యువజన నాయకుడు జంగా వెంకటకోటయ్య, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ చింతా సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ గండికోట కోటేశ్వరరావు సయ్యద్ జబీర్, పెద అగ్రహారం సొసైటీ అధ్యక్షుడు జంగిటి వెంకటకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
విగ్రహాలకు భద్రత కట్టుదిట్టం
సాక్షి, లక్నో : దేశవ్యాప్తంగా విగ్రహాల ధ్వంసం ఘటనలు పెరుగుతుండటంతో యూపీ ప్రభుత్వం ప్రముఖుల విగ్రహాలకు భద్రత కల్పించడంపై దృష్టి సారించింది. ప్రముఖుల విగ్రహాల భద్రతను రాష్ట్ర పోలీసులు పర్యవేక్షిస్తారని హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అరవింద్ కుమార్ చెప్పారు. విగ్రహాల కూల్చివేతపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖలు ఆదేశాలు జారీ చేసినా ప్రముఖ నేతలు, సిద్ధాంతకర్తల విగ్రహాలపై దాడులు కొనసాగుతున్నాయి. గత కొద్ది నెలలుగా పలు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల నేపథ్యంలో విగ్రహాల భద్రతపై నిరంతరం పర్యవేక్షించాలని యూపీ డీజీపీ ఓం ప్రకాష్ సింగ్ అన్ని జిల్లాల ఎస్పీలకు లేఖలు రాశారు. మహాత్మా గాంధీ, బీఆర్, అంబేడ్కర్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పెరియార్, లెనిన్ సహా పలువురి ప్రముఖుల విగ్రహాల కూల్చివేతల నేఫథ్యంలో యూపీ సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది. -
కవి విగ్రహానికి అవమానం...
సాక్షి, కోల్కత్తా : లెనిన్ విగ్రహం కూల్చివేతతో మొదలైన ధ్వంసకాండ ఇప్పట్లో ఆగేలా లేదు. పెరియార్, శ్యామాప్రసాద్ ముఖర్జీ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలపై జరిగిన వివిధ ఘటనలపై ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. 19 శతాబ్దానికి చెందిన ప్రముఖ బెంగాలీ కవి మైఖేల్ మధుసూదన్ దత్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు ఎర్ర రంగు పూశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. అప్రమత్తమైన మున్సిపాలిటీ శాఖ విగ్రహాన్ని శుభ్రం చేయించింది. ఎవరీ.. మైఖేల్ మధుసుదన్ దత్ ఆంగ్ల భాషలో పద్యాలు రచించిన మొదటి భారతీయ కవిగా ప్రసిద్ధి చెందారు. చిన్నతనంలోనే క్రైస్తవ మతం స్వీకరించి పేరు మార్చుకున్నారు. బెంగాలీతో పాటు సంస్కృతం, తమిళ్, తెలుగు, హిబ్రూ, లాటిన్, గ్రీకు తదితర భాషల్లో ప్రావీణ్యం కలవారు. -
కొనసాగుతున్న ‘విగ్రహ’ కాండ
చెన్నై/కన్నూర్/లక్నో: దేశవ్యాప్తంగా విగ్రహాల ధ్వంసకాండ కొనసాగుతోంది. లెనిన్, పెరియార్, శ్యామాప్రసాద్ ముఖర్జీ, అంబేడ్కర్ విగ్రహాలపై వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఘటనలపై ఆగ్రహం వ్యక్తమవుతుండగానే కేరళలోని కన్నూర్‌లో గాంధీ విగ్రహానికి నల్లరంగు పూశారు. ఈ ఘటనలో గాంధీ కళ్లద్దాలు పగిలిపోయాయి. చెన్నైలోని తిరువోత్తియూర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నల్లరంగు పూశారు. ఈ ఘటనను తమిళనాడు సీఎం పళనిస్వామి ఖండించారు.నిందితులను పట్టుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసింది. అటు, యూపీలోని బలియా జిల్లాలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయటం ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతూ.. సమాజంలో శాంతి సామరస్యాలకు భంగం కలిగిస్తున్న వారిపై దేశద్రోహం కేసులు నమోదుచేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. -
విగ్రహాల ధ్వంసం.. మోదీ స్ట్రాంగ్ మెసేజ్!
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న విగ్రహాల ధ్వంసం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా స్పందించారు. విగ్రహాల ధ్వంసాన్ని తాను ఎంతమాత్రం ఆమోదించబోనని ఆయన తేల్చిచెప్పారు. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖను ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ అడ్వయిజరీ జారీచేసింది. విగ్రహాల ధ్వంసానికి దిగే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. త్రిపురలో ధ్వంసమైన లెనిన్ విగ్రహం త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొందరు దుండగులు లెనిన్ విగ్రహాలను కూల్చివేయడంతో తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనసంఘ్ స్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మరోవైపు తమిళనాడుకూ ఈ సెగ తగిలింది. త్రిపురలో లెనిన్ విగ్రహాలకు పట్టిన గతే తమిళనాడులో పెరియార్ విగ్రహాలకు పడుతుందని బీజేపీ సీనియర్ నేత హెచ్ రాజా ఫేస్బుక్లో పోస్టు చేయడం, వెంటనే వెల్లూరులో పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనికి నిరసనగా కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై పెట్రో బాంబు దాడి జరిగింది. బెంగాల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహంపై నల్లరంగు పోసిన దృశ్యం ఈ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించగా.. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా తీవ్రంగా స్పందించారు. కొన్ని రాష్ట్రాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం తీవ్ర దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీగా బీజేపీ ఎవరి విగ్రహాల ధ్వంసానికి మద్దతునివ్వబోదని ఆయన ట్వీట్ చేశారు. తమిళనాడు, త్రిపురలోని పార్టీ యూనిట్లతో మాట్లాడానని, విగ్రహాల ధ్వంసంతో ఎవరికైనా సంబంధం ఉంటే వారిపై తీవ్ర చర్యలు తప్పవని షా హెచ్చరించారు.