గోపాలపురం, వేల్పూరుల్లో వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం
తెనాలి, ద్వారకాతిరుమల, అహోబిలంలో ముక్కలైన శిలాఫలకాలు
పెన్నగడం ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మె కూల్చివేత
కొనసాగుతున్న టీడీపీ నేతలు, కార్యకర్తల అరాచకం
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలోని పలుచోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు విధ్వంసకాండను కొనసాగిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను, అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం గోపాలపురంలో గురువారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం తలభాగాన్ని ఛిద్రం చేసి విగ్రహాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి స్వామిదాసు ధ్వంసమైన వైఎస్ విగ్రహాన్ని శుక్రవారం పరిశీలించారు.
అనంతరం స్వామిదాసు విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ను భయభ్రాంతులకు గురిచేయడానికి దుండగులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలీసులు, అధికారులు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
» తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారని చెప్పారు. ఏకొండూరు మండలం రేపూడిలో టీడీపీ కార్యకర్తలు ఎంపీటీసీ సభ్యురాలి పొలం ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసి తోటలోని మొక్కలను పాడుచేశారని చెప్పారు. వెంకట్ తండాలో భూక్యా వెంకట్ పొలంలో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ధ్వంసం చేసి రూ.లక్షకు పైగా నష్టం కలిగించారని తెలిపారు. తునికిపాడులో గంపలగూడెం మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిని గ్రామ బహిష్కరణ చేస్తున్నట్లు టీడీపీ నాయకులు ప్రకటించడం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని పేర్కొన్నారు.
పోలీసులు ఇటువంటి సంఘటనలపై సత్వరం చర్యలు తీసుకుని నిందితులను శిక్షించకపోతే తాము ఉపేక్షించబోమని హెచ్చరించారు. గ్రామ సచివాలయాలపై శిలాఫలకాలను ధ్వంసం చేయడం కూడా ఉన్మాదచర్యగా ఆయన అభివర్ణించారు. తిరువూరు, ఏకొండూరు, విస్సన్నపేట జెడ్పీటీసీ సభ్యులు యరమల రామచంద్రారెడ్డి, భూక్యా గన్యా, లోకేశ్వరరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు ఈ ఘటనలను ఖండించారు.
» గుంటూరు జిల్లా తెనాలి 14వ వార్డులోని శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థానం వద్ద అప్పటి మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు తన సొంత నిధులు రూ.లక్షతో దేవస్థాన ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు. అనంతరం అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తో శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేశారు. శిలాఫలకంపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, వైస్ చైర్మన్ ఫొటోలు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి కొందరు టీడీపీ నాయకులు శిలాఫలకంపై ఉన్న మూడు ఫొటోలను ధ్వంసం చేశారు.
» తెనాలి 15వ వార్డు చినరావూరు పార్కు వద్ద వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మెను ఏర్పాటు చేసి అక్కడ శిలాఫలకాన్ని అప్పటి ఎమ్మెల్యే శివకుమార్ ఆవిష్కరించారు. అక్కడ కూడా సీఎం జగన్, ఎమ్మెల్యే శివకుమార్, వైస్ చైర్మన్ కోటేశ్వరరావు ఫొటోలు ఏర్పాటు చేశారు. వాటిని కొందరు టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు.
» నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రూరల్ మండలం అహోబిలంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ శివారు నుంచి దేవాలయం వరకు సీసీ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డును ప్రారంభించిన అప్పటి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలే ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే అహోబిలం గ్రామ శివారులోని దొరకొట్టాల వద్ద ఓ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.
» ఏలూరు జిల్లాలోని మండల కేంద్రమైన ద్వారకాతిరుమలలో శుక్రవారం కొందరు వ్యక్తులు ఒక శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. స్థానిక శివాలయానికి వెళ్లే ఘాట్ రోడ్డులో మండల పరిషత్ నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన మంచినీటి బోరు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని పగులగొట్టారు. టీడీపీ వర్గీయులు రెచ్చిపోయి దౌర్జన్యాలు, దాడులకు దిగడం, ప్రభుత్వ ఆస్తులు, శిలాఫలకాలను ధ్వంసం చేయడం సరికాదంటూ గ్రామస్తులు పేర్కొంటున్నారు.
» తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పెన్నగడం ఎస్సీ కాలనీలో పదేళ్లుగా ఉన్న వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మెను శుక్రవారం టీడీపీ నాయకులు జేసీబీతో ధ్వంసం చేశారు. టీడీపీ నాయకులు ఇలాంటి అరాచాకాలు చేయడం తగదని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.
»పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ మండలం వేల్పూరు గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గురువారం రాత్రి గ్రామానికి చెందిన వంగవోలు విజయ్‌కుమార్ ధ్వంసం చేశాడు. స్థానిక బండా పట్టాభి రైస్‌మిల్లు వీధిలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాల వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా గురువారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు.
ఈ సమయంలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం అక్కడ పరిశీలించారు. తణుకు రూరల్ సీఐ జి.వి.వి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ కె.చంద్రశేఖర్, ఇతర పోలీసు సిబ్బంది విచారణ చేపట్టారు. గ్రామంలో అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సమీపంలో సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు విజయ్‌కుమార్ అంగీకరించాడని సీఐ నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. పగలగొట్టిన విగ్రహం స్థానంలో వైఎస్సార్ కొత్త విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రానికి స్థానిక పోలీసులు ఏర్పాటు చేశారు. స్థానిక నాయకులే దీన్ని ఏర్పాటు చేయించారని తెలుస్తోంది. ఎవరు ఏర్పాటు చేయించారనే విషయాన్ని పోలీసులు చెప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment