ఆగని టీడీపీ అరాచకం | ysr statue destroyed tdp leaders andhra pradesh | Sakshi
Sakshi News home page

ఆగని టీడీపీ అరాచకం

Published Tue, Jun 18 2024 5:14 AM | Last Updated on Tue, Jun 18 2024 5:16 AM

ysr statue destroyed tdp leaders andhra pradesh

పలుచోట్ల వైఎస్సార్‌ విగ్రహాల ధ్వంసం

పాఠశాల ప్రహరీ తొలగింపు 

వైఎస్సార్‌సీపీ కార్యకర్త రేకుల షెడ్, ప్రహరీ ధ్వంసం 

పెద్ద ఎత్తున శిలాఫలకాలు ముక్కలు

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తల అరాచకాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడమేగాక ప్రగతిపనుల శిలాఫలకాలను ముక్కలు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం శివాపురంతండాలో ఆదివారం రాత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన విగ్రహాన్ని మాయం చేశారు. దీన్ని గమనించిన స్థానికులు సోమవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడినవారి ఆచూకీ కోసం వివరాలు సేకరిస్తున్నట్లు నకరికల్లు ఎస్‌ఐ కె.నాగేందర్‌రావు చెప్పారు.

గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటుచేశారు. నాదెండ్ల మండలం సాతులూరులో వడ్డెరపాలెం వెళ్లే మెయిన్‌ సెంటర్‌లోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గ్రామానికి చెందిన ముగ్గురు టీడీపీ కార్యకర్తలు ఆదివారం ధ్వంసం చేశారు. ఇది గమనించిన వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నాడు–నేడు కింద గత ప్రభుత్వంలో నిర్మించిన పాఠశాల ప్రహరీలను ఆదివారం టీడీపీ నాయకులు జేసీబీ యంత్రాలతో కూల్చేశారు. నాడు–నేడు కింద కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానిపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గత ప్రభుత్వం తీర్చిదిద్దింది.

గ్రామ నడిబొడ్డున ఉన్న పాఠశాలకు ప్రత్యేకంగా రూ.20 లక్షలతో ప్రహారీ నిర్మించింది. ఈ గోడను కొందరు టీడీపీ నాయకులు ఇళ్లకు అడ్డంగా నిర్మించారని ఇప్పుడు కూల్చేశారు. టీడీపీ నాయకుల ఇళ్ల ముందు విశాలంగా స్థలం కావాలని రూ.20 లక్షలతో నిర్మించిన ప్రహరీని కూల్చి­వేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పం మండలంలోని మల్లానూరు గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆవిష్కరించిన శిలాఫలకాలను ధ్వంసం చేశారు. గుత్తార్లపల్లి వద్ద నిర్మించిన వన్నెకుల క్షత్రియ భవనం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సైతం కూల్చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లి పంచాయతీ జంగాలపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త పచ్చికాల శీనయ్య రేకుల షెడ్ను, ప్రహరీని స్థానిక టీడీపీ కార్యకర్తలు సోమవారం తెల్లవారుజామున ధ్వంసం చేశారు. శీనయ్య రూ.5 లక్షలతో తన స్థలంలో షెడ్‌ వేసుకుని చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారు. ప్రహరీని, షెడ్‌ను ధ్వంసం చేస్తామని టీడీపీ కార్యకర్తలు బెదిరిస్తుండటంతో శీనయ్య రెండురోజుల కిందట వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు సోమవారం తెల్లవారుజామున జేసీబీతో ప్రహరీని, రేకుల షెడ్‌ను ధ్వంసం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అంకమరావు తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలో నియోజకవర్గ కేంద్రమైన గోపాలపురం నుంచి దొండపూడి గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి మాజీ హోం మంత్రి తానేటి వనిత ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని దుండగులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. దీనిపై సోమవారం ఉదయం ఆ శిలాఫలకం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు, వైఎస్‌ ఆర్మీ సభ్యులు నిరసన తెలిపారు. అనంతరం నాలుగురోడ్ల కూడలి వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు.

తాము గత ఐదేళ్లలో ఎప్పుడూ ఇటువంటి దాడులు, శిలాఫలకాల ధ్వంసాలు చేయలేదని వారు చెప్పారు. టీడీపీ, జనసేన నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారు డిమాండ్‌ చేశారు.

అంగన్‌వాడీ స్థలం కబ్జా
పెద్దపంజాణి (చిత్తూరు జిల్లా): అంగన్‌వాడీ కేంద్రానికి కేటాయించిన స్థలాన్ని  టీడీపీ నాయకులు ఆక్రమించిన ఘటన పెద్దపంజాణి మండలంలోని బెరబల్లిలో  సోమవారం చోటు చేసుకుంది. పెద్దపంజాణి పంచాయతీ బెరబల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అక్రమంగా తమ ఆధీనంలో ఉంచుకున్న సుమారు 10 సెంట్ల ప్రభుత్వ భూమిని దాదాపు రెండేళ్ల క్రితం గ్రామస్తుల వినతి మేరకు రెవెన్యూ అధికా­రులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలాన్ని  అంగన్‌వాడీ కేంద్రానికి కేటాయి­స్తూ ఆక్రమ­ణలకు గురికాకుండా ప్రహరీ ఏర్పాటు చేశా­రు. టీడీపీ నాయకులు తమ ప్రభు­త్వం అధికారంలోకి రావడంతో ఆ భూమి­ని తిరిగి వారి ఆధీనంలోకి తీసుకున్నారు. జేసీబీతో ప్రహరీని తొలగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement