మంతెన, కేశవరం, కేదారిలంకల్లో శిలాఫలకాల ధ్వంసం
లోవపోన్నవోలు సచివాలయ భవనంపై టీడీపీ, జనసేన జెండాలు
కొణిజెర్లలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల విధ్వంసకర చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి, సోమవారం పలు గ్రామాల్లో ప్రగతిపనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయ భవనంపై టీడీపీ, జనసేన జెండాలు ఎగురవేశారు. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
⇒ కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామంలోని ప్రధాన సెంటరు సమీపంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. గతంలో మండలంలోని గొల్లగూడెం పంచాయతీపై యువగళం జెండా ఎగురవేశారు. ఈడుపుగల్లు, కంకిపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఉప్పలూరులో సచివాలయ భవనంపై ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోతో కూడిన బోర్డును పగులగొట్టారు.
⇒ నెల్లూరు జిల్లా జలదంకి మండలం కేశవరంలో నిర్మాణంలోని ప్రభుత్వ భవనాలపై మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రంతో ఉన్న శిలాఫలకాలను పగులగొట్టారు. సచివాలయం, రైతుభరోసా కేంద్రాల్లో గోడలపై ఉన్న నవరత్నాల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. నిర్మాణంలో ఉన్న విలేజ్ హెల్త్‌క్లినిక్ భవనం శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు.
⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదారిలంక పంచాయతీ కార్యాలయంపైన ఉన్న సచివాలయం గోడకు అమర్చిన నవరత్నాల శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన వివరాలు అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోతోసహా ఈ శిలాఫలకంపై ఉన్నాయి. గ్రామ శివారున గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ ఫొటోతో ఉన్న స్వాగత బోర్డులను ఊడబెరికారు.
ఈ ఘటనల్ని సర్పంచ్ వీధి వెంకటరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు యర్రంశెట్టి నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పోలిశెట్టి గణేష్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మద్దింశెట్టి దొరబాబు, నాయకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనాస్థలాన్ని మండపేట రూరల్ సీఐ శ్రీధర్, అంగర ఎస్‌ఐ అందే పరదేశి పరిశీలించి వివరాలు సేకరించారు. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు మాట్లాడుతూ సచివాలయం ప్రభుత్వ ఆస్తి అని, దీన్ని ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని చెప్పారు. ఈ ఘటనలకు పాల్పడినవారిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
⇒ అనకాపల్లి జిల్లా మాడుగుల రూరల్ మండలంలో గిరిజన పంచాయతీ అయిన లోవపోన్నవోలు గ్రామ సచివాలయం భవనం మీద కూటమి నాయకులు తెలుగుదేశం, జనసేన జెండాలు ఎగురవేశారు. ఈ విషయమై ఎంపీడీవో ఆర్.కాళీప్రసాదరావును అడగగా.. ప్రభుత్వ కార్యాలయాల మీద జాతీయజెండా మినహా పార్టీ జెండాలు పెట్టకూడదని చెప్పారు. వీటిని వెంటనే తొలగిస్తామని తెలిపారు.
⇒ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొణిజెర్లలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ ప్రదేశాన్ని సోమవారం తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, వైఎస్సార్‌సీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామిదాసు మాట్లాడుతూ భావితరాలకు ఆదర్శంగా గ్రామాల్లో నెలకొలి్పన నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం అరాచక చర్య అని చెప్పారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాలకు, కులాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేశారని, అలాంటి నాయకుడిని ప్రతి ఒక్కరు గౌరవించాల్సి ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యులు కోట శామ్యూల్, వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లా కరుణాకరరావు, కావూరి వినయ్‌కుమార్, కలకొండ రవికుమార్, ఎంపీటీసీ సభ్యురాలు కటుకూరి రాధమ్మ, సొసైటీ మాజీ అధ్యక్షులు నంబూరి వెంకటకృష్ణారావు, నంబూరి కృష్ణారావు, నాయకులు వెంకటరెడ్డి, బాబూరావు, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
పేదల ఇంటి నిర్మాణాలు ధ్వంసం
చాట్రాయి మండలం పోలవరంలో పేట్రేగిన టీడీపీ నేతలు
చాట్రాయి: ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో టీడీపీ నాయకులు పేట్రేగిపోయారు. గత ప్రభుత్వం పేదలకు ఇచి్చన స్థలాల్లో లబ్ధిదారులు చేపట్టిన ఇంటి నిర్మాణాలను ధ్వంసం చేశారు. ఆదివారం రాత్రి జేసీబీతో రెండు ఇళ్ల పిల్లర్లు, ఫౌండేషన్ నిర్మాణాలను పెకిలించివేశారు. ఈ ఘటన స్థానికంగా ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పోలవరం గ్రామంలోని మంకొల్లు రోడ్డులో నాలుగో లే అవుట్‌లో 28 మంది పేదలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇంటిస్థలాలు మంజూరు చేసింది.
వాటికి రిజి్రస్టేషన్ చేయించి పట్టాలు ఇచ్చింది. గ్రామానికి చెందిన లబ్ధిదారులు దానం బాబూరావు, కొంగర దేవదత్తం తమకు ఇచ్చిన స్థలాల్లో రూ.2 లక్షల వంతున వెచ్చించి ఇంటి నిర్మాణాల కోసం పునాదులు నిర్మించి, పిల్లర్లు వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత టీడీపీ నాయకులు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. ఇటీవల అదే గ్రామంలో జగనన్న లే అవుట్‌లో వేల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రావెల్ రోడ్లను ధ్వంసం చేశారు.
రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి సొంత నియోజకవర్గంలో ఇలాంటి విధ్వంసాలు చేపట్టడం దారుణమని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి పిల్లర్లు, ఫౌండేషన్ నిర్మాణాలను పెకలించి వేయడంపై బాధితులు ఫిర్యాదు చేశారని, విచారించి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తహసీల్దార్ మహ్మద్ మసూద్ అలీ తెలిపారు. ఈ విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లోను ఫిర్యాదు చేసినట్టు లబ్ధిదారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment