
కర్నూలు జిల్లా కృష్ణగిరిలో వైఎస్సార్ విగ్రహం తల, చెయ్యి తొలగింపు
తిరుపతి జిల్లా గోవర్ధనగిరిలో సచివాలయం, ఆర్బీకే, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద శిలాఫలకాల ధ్వంసం
తూర్పు గోదావరి జిల్లా తెలికిచెర్లలో సచివాలయం, ఆర్బీకే, నవరత్న పథకాల శిలాఫలకాల తొలగింపు
నెల్లూరు జిల్లా కొత్తపాళెంలో శిలాఫలకాల్లో వైఎస్సార్‌సీపీ నేతల పేర్లపై పచ్చ రంగు
కృష్ణగిరి/నాగలాపురం/నల్లజర్ల/జలదంకి: టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆగడాలు మితిమీరిపోయాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. వైఎస్సార్ విగ్రహాలను, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన శిలాఫలకాలను పనిగట్టుకుని పగులగొడుతున్నారు. శనివారం రాత్రి కర్నూలు జిల్లా కృష్ణగిరిలోని బస్టాండ్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహంతోపాటు రైతు భరోసా కేంద్రం శిలాఫలకాన్ని కొందరు దుండగలు ధ్వంసం చేశారు. విగ్రహం తల, చెయ్యి తొలగించారు. ఆదివారం ఉదయం దీన్ని చూసిన స్థానికులు నాయకులకు సమాచారం ఇచ్చారు.
ఈ విధ్వంసానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాయకులు కటారుకొండ మాధవరావు, శివ, వెంకటేశ్వర్లు, ఎరుకలచెర్వు ప్రహ్లాద, వెంకటరాముడు, అమకతాడు బాలు, మాధవస్వామి, కృష్ణగిరి జయరామిరెడ్డి, హుసేన్‌సాహెబ్, బాలమద్ది తదితరులు ఈ చర్యను ఖండించారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలోని గోవర్ధనగిరి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉన్న వైఎస్సార్‌సీపీ శిలాఫలకాన్ని శనివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వీటి ప్రారంభోత్సవ సమయంలో ఈ శిలాఫలకాలను ఏర్పాటు చేశారు.
ఈ ఘటనతో గ్రామంలో అలజడి రేగింది. టీడీపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారంటూ స్థానికులు ధ్వజమెత్తారు. దీనిపై గోవర్థనగిరి వైఎస్సార్‌సీపీ సచివాలయ కన్వీనర్ మునిశేఖర్ పిచ్చాటూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచెర్ల సచివాలయం–1 పరిధిలోని సచివాలయం, రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి నవరత్న పథకాలు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోతో ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు. 26 రోజులుగా సాగుతున్న దాడులు, దాష్టీకాలు చూస్తూంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక ఆటవిక పాలనలో ఉన్నామా అని సందేహం కలుగుతోందని గ్రామ సర్పంచ్ బండి చిట్టి, ఉప సర్పంచ్ నక్కా పండు ధ్వజమెత్తారు. ఈ ఘటనలపై మానవ హక్కుల కమిషన్ తక్షణమే స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శిలాఫలకంపై పేర్లు తొలగింపు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం కొత్తపాళెంలో 2023లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు, పంచాయతీ భవనం రీ మోడలింగ్ తదితర పనులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దాదాపు రూ.20 లక్షలతో చేపట్టింది. ఇందుకు సంబంధించిన శిలాఫలకంలో స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లను ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారు.
ఆదివారం గ్రామంలోని టీడీపీ నాయకులు ఈ శిలాఫలకంలో అప్పటి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు వారికి నచ్చని పేర్లను పచ్చ పెయింట్‌తో తుడి చేశారు. శిలాఫలకం దిమ్మెలకు కూడా పచ్చ పెయింటింగ్ వేశారు. పంచాయతీ భవనం గోడపై సీబీఎన్ అని రాశారు. గతంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేరు మాత్రం తొలగించలేదు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ నేతలు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment