
న్యూఢిల్లీ : ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం, టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్ రతన్ టాటా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్‌పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా గొప్ప విజన్ కలిగిన నాయకులంటూ కొనియాడారు. బుధవారం గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్(ఐఐఎస్) పారిశ్రామికవేత్త రతన్ టాటా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మోదీ, అమిత్ షా దూరదృష్టి గల నాయకులని ప్రశంసించారు. దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లడానికి మోదీ, షా ఎన్నో దూరదృష్టి గల నిర్ణయాలను తీసుకున్నారన్నారు. విజన్ కలిగిన నాయకులకు మద్దతిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మోదీ, షా నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతంగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొనడం విశేషం.
సింగపూర్ ఐటీఈఎస్ నమూనాలో ప్రారంభమయ్యే ఈ సంస్థలు నేషనల్ స్కిల్ డెవలప్మంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీఎస్) నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో పనిచేస్తాయి. గాంధీనగర్‌లో ప్రారంభమయ్యే సంస్థలో రక్షణ, ఏరోస్పేస్, చమురు తదితర అంశాలలో శిక్షణ ఇస్తారు. మానవ వనరులను సమృద్దిగా ఉపయోగించడమే ఈ సంస్థలు లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. టాటా గ్రూప్ ఐఐఎస్‌కు భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు ఐఐఎస్‌ను ప్రారంభించింది. కాన్‌పూర్, మొంబైలలో ఐఐఎస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment