రతన్‌ టాటాకు రాష్ట్రపతి, ప్రధానిలతో పాటు ప్రముఖుల నివాళులు | Ratan Tata Death: PM Modi, Rahul Gandhi, YS Jagan And Other Leaders Expressed Grief, Check Tweets Inside | Sakshi
Sakshi News home page

Ratan Tata Death: రతన్‌ టాటాకు రాష్ట్రపతి, ప్రధానిలతో పాటు ప్రముఖుల నివాళులు

Published Thu, Oct 10 2024 7:00 AM | Last Updated on Thu, Oct 10 2024 12:59 PM

Ratan Tatas Demise PM Modi Expressed Grief

న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు. ఆయనకు 86 ఏళ్లు. ఆయన మృతిపై ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. దేశంలో అతిపెద్ద బిజినెస్ ట్రస్ట్ టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.  దాంతో  రాష్ట్రపతి, ప్రధానిలతో పాటు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు

భారత్‌ పారిశ్రామిక దిగ్గజాన్నికోల్పోయింది: రాష్ట్రపతి
రతన్‌ టాటా మృతిపట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది  ముర్ము ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘రతన్‌ టాటా మృతి నిజంగా బాధాకరం. పారిశ్రామిక దిగ్గజాన్ని భారత్‌ కోల్పోయింది. మంచి విలువులున్న వ్యక్తి రతన్‌ టాటా’ అని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు.

 

రతన్ టాటా దూరదృష్టి గల వ్యాపార దిగ్గజం: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఇలా రాశారు - రతన్ టాటా దూరదృష్టి గల వ్యాపార దిగ్గజం. దయాహృదయం కలిగిన వ్యక్తి. అసాధారణమైన వ్యక్తి. అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. సమాజాన్ని మెరుగుపరచడంలో అతనికున్న అచంచలమైన నిబద్ధత స్ఫూర్తిదాయకమైనవి.
 

 

మంచి స్నేహితుడిని కోల్పోయా: ముఖేష్‌ అంబానీ

రతన్‌ టాటా మృతిపట్ల ముఖేష్‌ అంబానీ సంతాపం వ్యక్తం చేశారు. మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని ముఖేష్‌ అంబానీ పేర్కొన్నారు. 
 

	ఎందరికో స్ఫూర్తిదాత రతన్ టాటా మృతిపట్ల ప్రముఖుల సంతాపం

రతన్‌ టాటా మరణం దేశానికి తీరని లోటు: సుధామూర్తి

రతన్‌ టాటా మరణం దేశానికి తీరని లోటన్నారు రాజ్యసభ ఎంపీ సుధామూర్తి. ఇతరుల పట్ల కరుణ చూపే వ్యక్తి రతన్‌ టాటా అని ఆమె కొనియాడారు.

ఆయనొక వెలకట్టలేని వజ్రం:  ఆర్‌ఎస్‌ఎస్‌
రతన్‌ టాటా మృతిపట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ సంతాపం వ్యక్తం చేసింది. రతన్‌ టాటా మృతి భారతీయులందరికీ బాధాకరమని ఆర్‌ఎస్‌ఎస్‌ తెలిపింది. రతన్‌ టాటా వెలకట్టలేని వజ్రమని కొనియాడింది.

పారిశ్రామిక రంగానికి నిజ‌మైన ఐకాన్: వైఎస్‌ జగన్‌
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ చావల్‌ టాటా మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దేశ పారిశ్రామిక రంగానికి నిజ‌మైన ఐకాన్ ర‌త‌న్ టాటా అని వైఎస్‌ జగన్‌ కొనియాడారు. స‌మాజం కోసం ర‌త‌న్ టాటా ప‌నిచేశారు. దేశ నిర్మాణానికి ర‌త‌న్ టాటా స‌హ‌కారం అందించడంతో పాటు, దేశానికి ర‌త‌న్ టాటా సేవ‌లు స్పూర్తిదాయకమన్నారు వైఎస్‌ జగన్‌.

గొప్ప మానవతావాది: మానవతావాది: వెంకయ్య నాయుడు
రతన్‌టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. గొప్ప మానవతావాది అని  వెంకయ్యనాయుడు కొనియాడారు. రతన్‌ టాటా జీవితం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమన్న వెంకయ్య నాయుడు.. అత్యున్నత వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు.
 

పరోపకారి రతన్ టాటా: కేసీఆర్‌

రతన్ టాటా మృతికి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.  ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా  అని  కేసీఆర్ పేర్కొన్నారు.  దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతికి మానవీయ కోణాన్ని అద్దిన మానవతావాది, దార్శనికుడు, పరోపకారి రతన్ టాటా అని కేసీఆర్ కొనియాడారు.

రతన్‌ టాటా నిజమైన ఆవిష్కర్త: కేటీఆర్‌

రతన్‌ టాటా మృతిపట్ల కేటీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు.రతన్‌ టాటా నిజమైన ఆవిష్కర్త అని కొనియాడారు. రతన్‌ టాటా మరణం వ్యాపార ప్రపంచంలో శూన్యాన్ని మిగిల్చిందన్న కేటీఆర్‌.. ఆయన అందరి హృదయాల్లో ఉంటారన్నారు.

రతన్‌ టాటా మృతిపట్ల జేపీ నడ్డా సంతాపం
రతన్‌ టాటా సేవలు దేశం, ప్రపంచంపై చెరగని ముద్ర వేశాయి

నిజమైన మానవతావాది రతన్‌ టాటా: సీఎం చంద్రబాబు
రతన్‌ టాటా మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. నిజమైన మానవతావాదిని కోల్పోయామన్నారు సీఎం చంద్రబాబు.

రతన్‌ టాటా దాతృత్వానికి ప్రతీక: సీఎం రేవంత్‌రెడ్డి
రతన్‌ టాటా దాతృత్వానికి ప్రతీక అన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ఆయన సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్‌  కొనియాడారు.

టాటా విజన్ కలిగిన వ్యక్తి: రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. రతన్ టాటా విజన్ కలిగిన వ్యక్తి. వ్యాపారం, దాతృత్వం రెండింటిలోనూ చెరగని ముద్ర వేశారు.

ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన రతన్‌ టాటా

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన సంతాప సందేశంలో.. రతన్ టాటా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రసిద్ధి చెందారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని  కోరుకుంటున్నానని రాశారు.

దూరదృష్టి గల వ్యక్తిని భారత్‌ కోల్పోయింది

పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ట్వీట్‌లో.. ఆధునిక భారతదేశ మార్గాన్ని పునర్నిర్వచించిన, దూరదృష్టి గల వ్యక్తిని భారత్‌ కోల్పోయింది. రతన్ టాటా కేవలం వ్యాపార నాయకుడే కాదు.. అతను తిరుగులేని నిబద్ధతతో భారతదేశ స్ఫూర్తిని మూర్తీభవించారు.

టాటా జీ మరణం చాలా బాధాకరం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇలా ట్వీట్ చేశారు.. భారతదేశ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, 'పద్మ విభూషణ్' రతన్ టాటా జీ మరణం చాలా బాధాకరం. అతను భారతీయ పరిశ్రమకు తిరుగులేని దిగ్గజం. ఆయన మృతి తీరని లోటు. అతని జీవితమంతా దేశ పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి అంకితం  అయ్యింది. రతన్‌ టాటా దేశానికి నిజమైన రత్నం.

రతన్ టాటా సహకారం చారిత్రాత్మకం

ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో - దేశ అభివృద్ధికి రతన్ టాటా చేసిన సహకారం చారిత్రాత్మకమైనది. దేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

1991లో టాటా గ్రూప్‌ చైర్మన్‌గా బాధ్యతలు

కాగా, రతన్ టాటా 1991లో టాటా గ్రూప్‌కు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. 2012 వరకు ఈ పదవిలో కొనసాగారు. అతను 1996లో టాటా సర్వీసెస్, 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తదితర కంపెనీలను స్థాపించారు.

నేడు అంత్యక్రియలు
టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) బుధవారం రాత్రి కన్నుమూశారు. కొల్బాలోని నివాసానికి రతన్ టాటా పార్ధివ దేహాన్ని తరలించారు. ఉదయం 10.30 గంటలకు పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ మైదానంలో ఉంచనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం 4గంటల తరువాత అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


ఇది కూడా చదవండి: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా కన్నుమూత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement