వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం
♦ బందరులోని నిజాంపేటలో గుర్తుతెలియని వ్యక్తుల చర్య
♦ దోషులను శిక్షించాలని కాపు సంఘం నేతల రాస్తారోకో
మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని నిజాంపేటలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న కాపు సంఘం నాయకులు దోషులను శిక్షించాలంటూ రేవతి సెంటర్‌లో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అక్కడే ఉన్న రంగా విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ మచిలీపట్నం వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని, రంగా విగ్రహాన్ని పునఃప్రతిష్టిస్తామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త బూరగడ్డ వేదవ్యాస్ ఘటనాస్థలాన్ని పరిశీలించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. పోలీసులు త్వరితగతిన ఈ కేసును పరిష్కరించాలని కోరారు. రంగా విగ్రహం ధ్వంసం సంఘటన ఉద్రిక్తతకు దారితీయటంతో నిజాంపేటలో 144 సెక్షన్ అమలు చేశారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. మచిలీపట్నం ఆర్డీవో పి.సాయిబాబు, తహసీల్దార్ పి.నారదముని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దోషులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పట్టణంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.