దిగ్విజయ్ వ్యాఖ్యలు అనైతికం
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు
సత్తెనపల్లి: కాపులను బీసీల్లో చేర్చే అoశంపై చంద్రబాబును తాము బలపరుస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ చెప్పడం రాజకీయ స్వప్రయోజనాల కోసమేనని, అలాంటి వ్యాఖ్యలు అనైతికమని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు మండిపడ్డారు. శనివారం పట్టణంలోని నాగన్నకుంటలో నియోజకవర్గ అధ్యక్షుడు ఆలా అనంతరామయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. శంకరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కాపుల ఆధ్వర్యంలో బయటపడాలని చూస్తే భంగపడుతుందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ తీసుకునే బీసీ వ్యతిరేఖ వైఖరి తమ పార్టీని తామే శాశ్వత సమాధి చేసుకునేలా ఉందని హెచ్చరించారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ రాయలసీమలో ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించిన తీరు బీసీలకు నష్టం కలిగించేలా ఉందని పేర్కొన్నారు. అనంతరం శంకరరావును సంఘ నాయకులు సత్కరించారు.