
కూల్చే ప్రయత్నంలో ఒరిగిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం
చిత్తూరు, బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలం బీరంగి పంచాయతీ శంకరాపురంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూల్చేందుకు గుర్తు తెలియని వ్యక్తులు విఫలయత్నం చేశారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన గ్రామంలో కలకలం రేపింది. విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి గడ్డపారలతో ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఇనుపకమ్మీలతో బలంగా ప్రతిష్టించడంతో ఒక్కవైపు ఒరిగిపోయింది.
సోమవారం ఉదయం విగ్రహాన్ని గమనించిన వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ మండల కన్వీనర్ ఎన్.ప్రదీప్‌రెడ్డి, ఎంపీపీ పాగొండ ఖలీల్, పార్టీ నాయకులు ఎస్.రవికుమార్, కే.శివకుమార్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దుండగులు వైఎస్సార్ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి కారణాలు తెలియనప్పటికీ ప్రశాంతంగా ఉన్న గ్రామంలో అశాంతి సృష్టించి రాజకీయంగా ఉద్రిక్తతలను సృష్టించా లన్న ప్రయత్నంగా అనుమానిస్తున్నారు. బీరంగి గ్రామంలో ఈ విషయం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment