యువకిశోర్
ఈ బాలుడి పేరు కె.యువకిశోర్.. పుట్టు మూగవాడు. వైఎస్సార్ సీఎంగా ఉండగా రూ.6.50 లక్షల వ్యయంతో ఆరోగ్యశ్రీ పథకం కింద పైసా ఖర్చు లేకుండా కాక్లియర్ ఇప్లాంట్ ఆపరేషన్ ద్వారా ఇతనికి మాట తెప్పించారు. అయితే వినికిడి యంత్రం దెబ్బతినడంతో.. కొత్తదాని కోసం ప్రభుత్వానికి విన్నివించిన అతని తల్లిదండ్రులకు నిరాశే మిగులుతోంది.
చిత్తూరు , కురబలకోట : కురబలకోట మండలంలోని అంగళ్లు గ్రామం ఇందిరాపురానికి చెందిన ఆదిమూర్తి అద్దెగదిలో బార్బర్ షాపు నిర్వహిస్తూ ఇంటికి నెట్టుకొస్తున్నాడు. అతని కుమారుడు యువకిశోర్ పుట్టు మూగవాడు. స్థానికంగా ఉన్న గోల్డెన్‌వ్యాలీ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం కింద కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్‌ను హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చేయించారు. రెండేళ్ల పాటు బిడ్డకోసం తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. ఆడియాలజిస్టు ద్వారా íస్పీచ్‌థెరఫీ ఇప్పించారు. అమ్మా.. నాన్న.. అప్ప.. అన్న.. అక్క.. అనే మాటలు పలకసాగాడు. తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
స్పందించని ప్రభుత్వం..
ఏళ్లు కావడంతో కాలక్రమంలో కాంక్లియర్ ఇంప్లాంటేషన మిషన్(వినికిడి యంత్రం) దెబ్బతింది. కొత్త మిషన్ కోసం అతని తండ్రి కె.ఆదిమూర్తి ఇప్పటి సీఎం చంద్రబాబును కలవడానికి రాజధాని అమరావతికి ఆరు సార్లు తిరిగినా దర్శన భాగ్యం కల్గలేదు. కొత్త మిషన్ రూ.6 లక్షలు అవుతుందని డాక్టర్లు ఎస్టిమేట్ ఇచ్చారు. రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఉన్నపుడు వీరి పరిస్థితిని గుర్తించి ప్రధానమంత్రి నిధుల నుంచి రూ.2.59 లక్షలు మంజూరు చేయించారు. మిగిలిన సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అధికార పార్టీ నాయకులు కేవలం రూ.50 వేలు మాత్రమే ఇప్పించారు. అది ఏమూలకు చాలకపోవడంతో చివరకు ఆ చెక్కు కూడా మురిగిపోయింది. ఒక్కసారి ఇస్తే మళ్లీ ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని రాష్ట్రప్రభుత్వం చేతులు దులుపుకుంది. రూ.6 లక్షలు ఇస్తే తప్ప కొత్త మిషన్ రాదు. దీంతో పాత మిషన్ పనిచేయక ఆరునెలలుగా యువకిశోర్ తిరిగి మూగవాడయ్యాడు.
ఆవేదనలో తల్లిదండ్రులు..
యువకిశోర్ స్కూల్‌కు వెళ్తున్నాడన్న మాటేగాని అక్కడ టీచర్లు చెప్పే పాఠాలు విన్పించవని అతని తల్లిదండ్రుల వేదన అంతా ఇంతా కాదు. ఒక్కడే కొడుకు. ఇన్నాళ్లు మాట్లాడిన కుమారుడు మునుపటి స్థితికి వెళ్లిపోవడంతో మౌనంగానే చెప్పకోలేని బాధను అనుభవిస్తున్నారు. లోలోన కుమిలిపోతున్నారు. మహానుభావుడు వైఎస్సార్ మాట తెప్పిస్తే.. ఇప్పటి సీఎం చంద్రబాబు వల్ల ఉన్న మాటపోయిందని కుటుంబీకులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ఆయన లేని లోటు తెలిసొస్తోంది..
మూగవారు మాట్లాడటం.. చెవుటివారు వినడం అసాధారణం. ఇది దేవుడికే సాధ్యం. ఇలాంటి అసాధ్యాన్ని కూడా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సుసాధ్యం చేసింది. బిడ్డకు మాటలు రావడానికి ఆరోగ్యశ్రీ ద్వారా దేవుడిలా వైఎస్సార్ ఆదుకున్నారు. రూ.6.50 లక్షలతో కాక్లియర్ ఇంప్లాంటేషన్ మిషన్‌తో మాట తెప్పించారు. ఆయన లేని లోటు ఇప్పుడు తెలిసొస్తోంది. కొత్త మిషన్ కోసం విన్నవిస్తే ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.– ఆదిమూర్తి, యువకిశోర్ తండ్రి
Comments
Please login to add a commentAdd a comment