రాజకీయ నాయకులు, సిద్ధాంతకర్తలు, సంఘసంస్కర్తల విగ్రహాల విధ్వంసం ఈనాటిది కాదు. మతపరమైన విగ్రహాలు, పూజా స్థలాలను ధ్వంసం చేయడం వేల ఏళ్ల క్రితమే క్రితమే జరిగిందని చరిత్ర చెబుతోంది. కొత్త పాలకులు అధికారంలోకి వచ్చినప్పుడు ఓడిపోయిన నేతల చిత్రాలు, విగ్రహాలు, వారి అధికారం, సిద్ధాంతాల చిహ్నాలను పగలగొట్టడం ఫ్రెంచి విప్లవంలో విస్తృతంగా జరిగింది. 1960వ దశకం చివర్లో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమకాలంలో పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యంగా కోల్‌కతాలో రాజారామ్మోహన్‌రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటి సంఘసంస్కర్తలు, గాంధీ, నెహ్రూ, బోస్ వంటి స్వాతంత్య్రసమరయోధుల విగ్రహాలను ధ్వంసం చేయడం సంచలనం సృష్టించింది. గాంధీ, అంబేడ్కర్, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలపై దాడుల వార్తలు అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం.
కూలిన లెనిన్, స్టాలిన్ విగ్రహాలు
1991 జూన్–డిసెంబర్ మధ్య జరిగిన పరిణామాలతో సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమై కమ్యూనిస్ట్ పాలన ముగిసినప్పుడు రాజధాని మాస్కో, పోలండ్, బల్గేరియా వంటి తూర్పు ఐరోపా దేశాల్లోనూ లెనిన్, స్టాలిన్‌ల భారీ విగ్రహాలను కూల్చివేశారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో గాంధీ విగ్రహాన్ని 2015 ఏప్రిల్ 12న కొందరు దుండగులు ధ్వంసం చేశారు.
కాలవలోకి నీలం విగ్రహం!
1960ల చివర్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలంటూ సాగిన ఆందోళన సందర్భంగా విజయవాడలోని అప్పటి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ఉద్యమకారులు తొలగించి ఎదురుగా ఉన్న ఏలూరు కాలవలో వేశారు. 2011లో ప్రత్యేక తెలంగాణ కోసం ట్యాంక్‌బండ్‌పై సాగిన మిలియన్ మార్చ్ సందర్భంగా కొందరు అక్కడి కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంలోనే సిద్దిపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని పగలగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment