క్విజ్ మాస్టర్
కథ: ఫ్రెంచ్ విప్లవంతో ప్రపంచాన్ని ఆకర్షించిన నెపోలియన్ పిల్లులకు భయపడే వ్యాధితో బాధపడేవాడని తెలిసి నవ్వుకున్నారు. మనదేశంతో పాటు ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్య్ర సంబరాలు జరుపుకునే మరో దేశం పాకిస్తాన్ అనుకుని, అది కాదు దక్షిణ కొరియా అని తెలిసి నాలిక్కరుచుకున్నారు.
సాయంత్రం ఏడవుతోంది. ఆడిటోరియమ్ కేకలతో హోరెత్తుతోంది. పక్కనే ఆఫీస్ రూమ్ ప్రశాంతంగా ఉంది. ఆడిటోరియమ్‌లో ఆనందంగా చిందులేస్తున్నారు. పక్కనే ఆఫీస్ రూమ్‌లో క్విజ్ మాస్టర్ మూర్తి ఏకాంతంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎంత నియంత్రించుకుందామన్నా ఆ ఆలోచనలు ఒకదానికొకటి పెనవేసుకుంటూ అలా సాగిపోతూనే ఉన్నాయి. అంతవరకూ గంభీరమైన అలల్లా ఉన్న మానసిక స్థితిని, అరగంట క్రితం జరిగిన సంఘటన పోటెత్తిన అలలలా అతలాకుతలం చేసింది.
‘‘జర్ జర్ ర్ ర్ ర్... ర్ ్రర్ ్రర్.్ర..’’ బజర్ తన గుండెల్లో మోగినట్లయి ఉలిక్కిపడ్డాడు మూర్తి. ఇంతకుముందు క్విజ్‌లో జరిగిన బజర్ రౌండ్ ఇంకా తనను వెంటాడుతూనే ఉంది. తనకిక్కడ ఉండాలని లేదు. ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అని చూస్తున్నాడు. తనను ఇక్కడకు ఆహ్వానించిన సైన్స్ టీచర్ కనబడితే చెప్పి వెళదామని ఆగాడు.
‘‘మిత్రులారా! ఇంతకుముందే అత్యంత ఆసక్తికరంగా సాగిన క్విజ్ కార్యక్రమం ముగిసింది కదా, కొద్ది క్షణాల్లో సభా కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఈలోగా మరో డ్యాన్స్ ఐటెమ్‌ను ప్రెజెంట్ చేయడానికి మనముందుకొస్తున్నారు...’’ ఆఫీస్ రూమ్‌ని ఆనుకుని ఉన్న ఆడిటోరియమ్ నుండి ప్రకటన.
‘‘ఆసక్తికరంగా సాగిన క్విజ్ కార్యక్రమం.’’ క్విజ్ మాస్టర్ మూర్తి పెదాలపైన నిరాసక్తమైన నవ్వు. తన కాలేజీ రోజుల్లో కూడా కొన్ని వందల క్విజ్‌లలో పాల్గొన్నాడు. ఏనాడైనా ఇలా జరిగిందా? కొత్త విషయాలు నేర్చుకోవడమనే తహతహ, అవతలవాడి కంటే తనకు ఎక్కువ తెలిసివుండాలనే తాపత్రయం ఉండేవి. పోటీ జరుగుతున్నంతసేపు ప్రత్యర్థుల్లా ఉన్నా, ఒక్కసారి పోటీ అయిపోయాక ఛలోక్తులతో, వ్యంగ్య వ్యాఖ్యలతో చాలా సరదాగా, బాగా ఆత్మీయంగా ఉండేది వాతావరణం. అన్ని సున్నితమైన అనుభవాల మధ్య ఈ సాయంత్రం జరిగిన క్విజ్ పోటీ అతన్ని భయపడేలా చేసింది.
సాయంత్రం నాలుగు గంటలకు క్విజ్ కార్యక్రమం ప్రారంభించే ముందు చివరిసారిగా ప్రశ్నల ఆర్డర్ సరిగా ఉందో లేదో చూసుకుందామని ఫైల్ తెరిచాడు. మొదట ర్యాపిడ్ ఫైర్ రౌండ్. రెండవది జనరల్ రౌండ్. ఆడియో విజువల్ మూడవ రౌండ్. చివరిగా ఐదు ప్రశ్నలతో బజర్ రౌండ్. ఒకవేళ టై అయ్యే సందర్భం వస్తే, దాన్ని ఎదుర్కోవడానికి మరో అయిదు ప్రశ్నలు. ప్రేక్షకుల కోసం మధ్యమధ్యలో కొన్ని ప్రశ్నలు. అన్నీ సక్రమంగానే ఉన్నాయని నిర్ధారించుకుని నిర్వాహకుల పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు మూర్తి.
మరో ఐదు నిమిషాల్లో అందరికీ స్వాగతం పలుకుతూ క్విజ్ నిర్వహించవలసిందిగా మూర్తిని, ఆరు టీమ్‌లను వేదిక మీదకు ఆహ్వానించాడు యాంకర్. మూర్తి అతనికి కృతజ్ఞతలు చెప్పి, ఈ క్విజ్‌లో మొత్తం ఎన్ని రౌండ్స్ ఉంటాయో, ఏ రౌండ్లో ఎన్ని ప్రశ్నలుంటాయో, వాటికి ఏ రౌండ్లో ఎన్ని మార్కులుంటాయో వివరించాడు. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పి, ఆల్ఫబెటికల్ ఆర్డర్లో కూర్చున్న టీముల్లో, మొదటి టీమ్‌కు మొదటి ప్రశ్న అంటూ తన యజ్ఞాన్ని ప్రారంభించాడు.
ప్రశ్నల తయారీకి మూర్తి చాలా కష్టపడతాడు. ఏవో తన స్టాక్‌లో ఉన్న ప్రశ్నలు కొన్ని రాసేస్తే అయిపోదా? అని మిత్రులెవరైనా అంటే నవ్వి వదిలేస్తాడు. తను నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ఎవరి కోసం, వాళ్ల వయస్సు, వాళ్ల నేపథ్యం ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని, వీలైనంత సందర్భోచితమైన, విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రశ్నలనేరుకుంటాడు. అందుకే మూర్వి క్విజ్ మాస్టర్‌గా ఉంటే, ప్రోగ్రామ్ చాలా ఆసక్తికరంగా ఉంటుందనీ, నాలుగు విషయాలు తెలుస్తాయనీ నిర్వాహకుల నమ్మకం.
మొదటి రౌండ్ పూర్తయింది. అందరిలోకి ‘డి’ గ్రూప్ అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పి, ఇరవై ఐదు పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. మూడు టీములు ఇరవై పాయింట్లతో, మిగతా రెండు టీములు పదహైదు పాయింట్లతో ఉన్నాయి.
రెండో రౌండ్ చాలా ఆసక్తిగా సాగుతోంది. ఇందులో ప్రశ్నను పక్క టీమ్‌కు పాస్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరి ప్రశ్నకి వారు సరైన సమాధానం చెబితే పది పాయింట్లు, పాస్‌లో వచ్చిన పక్కవాళ్ల ప్రశ్నను ఆన్సర్ చేస్తే ఐదు పాయింట్లు ఉంటాయి.
మరో గంట గడిచింది.
ఈ రెండు గంటలు అక్కడ ఎన్నో రసవత్తరమైన ఘటనల పరామర్శలు చోటుచేసుకున్నాయి. ఆశ్చర్యమనిపించే సంగతులు, అద్భుతమనిపించే విషయాలు, నమ్మలేని నిజాలు, కష్ట సాధ్యమైన ప్రక్రియల్లో విజేతలై నిలిచినవాళ్ల సాహసాలు అన్నింటినీ పరామర్శించుకున్నారు. ఫ్రెంచ్ విప్లవంతో ప్రపంచాన్ని ఆకర్షించిన నెపోలియన్ పిల్లులకు భయపడే వ్యాధితో బాధపడేవాడని తెలిసి నవ్వుకున్నారు. మనదేశంతో పాటు ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్య్ర సంబరాలు జరుపుకునే మరో దేశం పాకిస్తాన్ అనుకుని, అది కాదు దక్షిణ కొరియా అని తెలిసి నాలిక్కరుచుకున్నారు. జపాన్‌వాళ్లు అరిష్టంగా భావించే 13 సంఖ్యను ఇటలీవాళ్లు అదృష్టంగా భావిస్తారనీ, ఈ భూమ్మీద బుల్ ఫ్రాగ్ అసలు నిద్రపోని జంతువనీ తెలుసుకుని ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. బహ్రైన్ దేశపు జాతీయగీతంలో కేవలం సంగీతమే తప్ప పదాలు లేవనీ, పియానోలో 88 కీస్ ఉంటాయనీ... ఇలా అనేకానేక సంగతులు.
మరో అర్ధగంట గడిచింది. చివరి అంకమైన బజర్ రౌండ్ మాత్రమే మిగిలివుంది. మూర్తి స్కోర్ బోర్డ్ చూశాడు. ఇది విజేతని నిర్ణయించే రౌండ్. ఎ, ఇ జట్లు నలభై మార్కులతో, ఎఫ్ జట్టు నలభై ఐదు మార్కులతో, బి, సి జట్లు అరవై ఐదు మార్కులతో ఉండగా, డి జట్టు అందరికంటే అత్యధికంగా ఎనభై ఐదు మార్కులతో మొదటి స్థానంలో ఉంది.
అందరినీ పరికించి చూస్తూ, ‘‘ఫ్రెండ్స్, ఈ రౌండ్లో కేవలం ఐదు ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానానికి మీకు 10 మార్కులు వస్తాయి. అదే మీ సమాధానం తప్పయితే మీరు 5 మార్కులు కోల్పోతారు. ప్రశ్న పాస్ చేయడం జరగదు. మీ సమాధానం చెప్పడానికి మీకు కేవలం పది సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి మీకు కాన్ఫిడెంట్‌గా, కరెక్టుగా సమాధానం తెలిస్తేనే బజర్ నొక్కండి. లేకపోతే అనవసరంగా మార్కులు పోగొట్టుకుంటారు. ఆల్ ద బెస్ట్’’ అన్నాడు.
మొదటి ప్రశ్న వెలువడిన వెంటనే ఎఫ్ గ్రూప్ బజర్నొక్కి సరైన సమాధానంతో 10 మార్కులు గెలుచుకుంది. రెండవ ప్రశ్నకు బి టీమ్వాళ్లకు 10 మార్కులు వచ్చాయి.
మూడో ప్రశ్నకు ఎవరూ బజర్ నొక్కలేదు. క్విజ్ మాస్టరే దానికి సమాధానం చెప్పవలసి వచ్చింది. అభ్యర్థులలో ఒత్తిడి, ఆందోళన వాళ్ల ముఖాలలో ప్రస్ఫుటమౌతోంది.
మూర్తి అడిగిన నాలుగో ప్రశ్నకి సి టీమ్ బజర్ నొక్కడమూ, 10 మార్కులు వాళ్ల ఖాతాలో వేసుకోవడమూ సెకన్లలో జరిగిపోయింది. ఇప్పుడు స్కోర్ బోర్డ్‌లో డి గ్రూప్ 85 మార్కులతో, బి, సిలు 75 మార్కులతో ఉన్నాయి. ఎఫ్ పది పెంచుకుని యాభై ఐదుకు చేరుకోగా, ఎ, ఇలు 40 మార్కులతో పాత స్కోరునే కొనసాగిస్తున్నాయి.
క్విజ్ పోటీ పరాకాష్టకు చేరుకుంది. చిట్టచివరి ప్రశ్న. ఆడిటోరియమంతా ఉద్విగ్నమయమైపోయింది. అందరూ ఊపిరి పీల్చడం కూడా వాయిదా వేసుకుని, మూర్తి నోటి నుండి బయటకొచ్చే ప్రశ్నకోసం రెప్పలార్పకుండా కాసుక్కూర్చున్నారు. కొందరి చేతులు అప్రయత్నంగానే కుర్చీ హ్యాండిల్స్‌ని బలంగా నొక్కిపెడుతున్నాయి. అభ్యర్థులంతా తమ తమ టీమ్ మెంబర్లతో చిరుసవ్వడితో మాట్లాడుతూ గుసగుసలాడుకుంటున్నారు.
సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న ఆ సమయంలో-మూర్తి, చివరి ప్రశ్న ఉన్న కార్డ్ తీసుకుని కళ్లతో ఒకసారి ప్రశ్నను చూశాడు. అభ్యర్థుల వైపు తిరిగి ప్రశ్న చదవడానికి నోరు తెరచి ‘‘తాము...’’ అని అన్నాడో లేదో - ‘‘జర్ జర్... జర్ ర్ ర్... ర్ ర్ ర్ ర్....’’మని బజర్ సౌండ్ వినిపించింది. మూర్తి చదవడం ఆపాడు. వాళ్ల క్రమశిక్షణా రాహిత్యానికి లిప్తపాటులో వెయ్యి వోల్టుల కోపం వచ్చింది. ఎందుకింత తొందరపడతారు? ఇంకా ప్రశ్న సగమైనా పూర్తికాకముందే పూర్తి ప్రశ్న ఏమై ఉంటుందో ఎలా ఊహిస్తారు? ఏం సమాధానం చెబుతారు? అనవసరంగా మార్కులు పోగొట్టుకోవడం తప్ప - అనుకుంటూ, ఇంతకీ ఎవరు బజర్ నొక్కారో చూశాడు. అది - డి గ్రూప్. ఆశ్చర్యపోయాడు. వేరే ఎవరో అయితే, గెలవాలనే ఒత్తిడిలో నొక్కారనుకోవచ్చు. వీళ్లెందుకు చేశారీ పని?
వాళ్లవైపు చూసేంతలో వెంటనే, అందులో ఒకడు ప్రశ్నకు సమాధానం చెబుతున్నట్టుగా - ‘అమెరికా’ అన్నాడు. అలా అన్నాడో లేదో, రెండోవాడు బొటనవేలు పెకైత్తి చూపుతూ ఒక్క ఊపులో మొదటివాడిని కౌగిలించుకున్నాడు. ఇద్దరూ రెండు చేతులతో కిందకీ పైకీ చప్పట్లు కొట్టుకుంటూ, విజయోత్సాహాన్ని పంచుకుంటున్నారు.
అన్నీ సెకన్లలో జరిగిపోయాయి. జరిగినదేంటో మూర్తికర్థమైంది. జనానికంతా అర్థమయ్యేందుకుగాను స్కోర్ బోర్డ్ మార్చారు - టీమ్ డి, చివరి ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పి, ఐదు మార్కులు కోల్పోయి 80 మార్కులతో తన ఆధిక్యాన్ని నిలుపుకుని విజేతగా నిలిచింది. బి, సి టీములు 75 మార్కులతో రెండవ స్థానంలోనే ఉన్నాయి. ప్రేక్షకులలో ఒక్కసారి కలకలం, వెంటనే డి టీమ్‌ను అభినందిస్తున్నట్లుగా కరతాళధ్వనులు...
మూర్తి దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. బి, సిలలో ఎవరైనా ఎక్కడ కరెక్ట్ సమాధానం చెప్పి తమతో సమానమౌతారో, ఆ తరువాత జరిగే టై బ్రేక్‌లో ఒకవేళ తాము ఓడిపోతామేమోనని, కనీసం ప్రశ్న ఏంటో వినకుండా, సమాధానం ఏమిటో తెలుసుకోకుండా ఎదుటివాళ్లకి కనీసం ప్రశ్న వినే అవకాశం కూడా ఇవ్వకుండా, ఎదుటివాళ్ల విజయావకాశాల మీద దెబ్బకొట్టిన డి టీమ్ మీద చాలా కోపం వచ్చింది. మూర్తి ఏదైనా మాట్లాడదామని నోరు తెరిచేలోపే, యాంకర్ మైకు నిండా గట్టిగా అరుస్తూ - ‘‘సో లేడీస్ అండ్ జెంటిల్మన్, ఈ రోజు విజేతలు - మన డి టీమ్. చివరి నిమిషంలో వాళ్లు ప్రదర్శించిన తెలివితేటలు, సమయస్ఫూర్తి మరువలేనివి. అమోఘం, అద్భుతం’’ అన్నాడు.
ఇంతలో ఎవడో మొబైల్ నుండి టపాకాయల చప్పుడు ప్లే చేయడం మొదలుపెట్టాడు. కింద నుండి డి టీమ్‌వాళ్ల శ్రేయోభిలాషులు బొటనవేలు పెకైత్తి విజయ సంకేతాలను వ్యక్తం చేస్తున్నారు. ఫేస్బుక్లో పెట్టడం కోసం కాబోలు, ఒకడు ఫోన్లోనే స్కోర్ బోర్డును, వాళ్ల మిత్రులను ఫొటో తీస్తున్నాడు. చివరి ప్రశ్న ఏమిటో తెలుసుకుందామన్న ఆసక్తి ఎవరికీ ఉన్నట్టు కనబడటం లేదు. మూర్తి అక్కడ ఉండలేకపోయాడు. మెల్లగా మెట్లు దిగి కిందకొచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
ఇంతలో యాంకర్, ‘‘మిత్రులారా, మీరంతా ఒక ఉద్విగ్నభరితమైన, ఉత్సాహభరితమైన, మరిచిపోలేని అపూర్వమైన మ్యాచ్ చూశారు. ఇక కొన్ని నిమిషాల్లో బహుమతి ప్రదానం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు - ముందుగా...’’
మూర్తికి అక్కడ కూర్చోవాలనిపించలేదు. ఒక్కడే నడుచుకుంటూ ఆడిటోరియమ్ దాటి పక్కనే ఉన్న ఆఫీస్ రూమ్‌కి వచ్చాడు. అప్పటినుండీ సైన్స్ సార్కోసం ఎదురుచూస్తూ, ఆఫీస్ రూమ్‌లో కూర్చుని ఉన్నాడు. అతనింకా బజర్ రౌండ్‌కి సంబంధించిన ఆలోచనలో ఉండగానే, ఆడిటోరియమ్‌లో నుండి యాంకర్ గొంతు వినబడింది.
‘‘ఫ్రెండ్స్, ఇప్పుడు సభ ప్రారంభం కాబోతోంది’’ అంటూ పెద్ద పెద్ద వాళ్లందరినీ విశేషణాలతో సహా పేరు పేరునా, వేదిక మీదకు ఆహ్వానించాడు. ఆఫీస్ రూమ్‌కి ఆడిటోరియమ్లోని మాటలు స్పష్టంగా ప్రవహిస్తున్నాయి. కళాశాల చైర్మన్ మాట్లాడుతూ క్విజ్‌తో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుని, ఈ రోజు జరిగిన పోటీలో డి టీమ్ కనబరిచిన పరిణతి, గెలవాలన్న ఆకాంక్ష, గెలుపు మీద వారికున్న పట్టుదల బహుధా ప్రశంసనీయమని చెప్పాడు.
మూర్తి మనసుని ఈ మాటలు మరింత గాయపరుస్తున్నాయి. ఆ పిల్లలు గెలుపు మీద కోరికతో ఆ పని చేశారా? ఓటమిని తట్టుకోలేని భయంతో చేశారా? అవతలవాడు గెలుస్తాడేమోననే అభద్రత, తమ స్థానాన్ని కోల్పోతామేమో అనే భయంతో ఎదుటివారి విజయావకాశాలని తుంచేయడం ఎంతవరకూ విజ్ఞతో, అలాంటి ఆలోచనలు ఎంత ప్రమాదకరమో చెప్పాల్సింది పోయి, ఆ పిల్లలని వీళ్లు గొప్ప హీరోలని చేసేస్తున్నారు.
వక్త మారాడు. ఎల్సీఎస్ ఎండీ కాబోలు మాట్లాడుతున్నాడు -
‘‘మొత్తం ఎపిసోడ్లో నాకు నచ్చిన అంశం - చివర్లో ఈ పిల్లలు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం. అంత తక్కువ సమయంలో, అన్ని ఒత్తిడుల మధ్య, ఏవో వందల కోట్ల వ్యాపార లావాదేవీలలో మేం అనుసరించే వ్యూహాన్ని వీళ్లు ఇంత తక్కువ వయస్సులో అమలుచేయడం చాలా గొప్ప విషయం. ఈ సంఘటన వీళ్ల భవిష్యత్తు గురించి మంచి ఆశలు కల్పిస్తోంది. మేం వ్యాపారంలో కిల్లింగ్ ఇన్ స్టింక్ట్ అంటుంటాం. అది ఈ చిన్నారుల్లో పుష్కలంగా ఉంది...’’
మూర్తికి చికాకుగా ఉంది. భారంగా ఉంది. తల పగిలిపోయేలా ఉంది. కొంచెంసేపు బయట గాలిలో ఉంటే ఈ బరువు తగ్గుతుందని బయటకు నడిచాడు. ఎల్ సీఎస్ ఎండీ మాట్లాడుతున్న మాటలకు ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. అదేంటి, ఇంతమందిలో ఒక్కరంటే ఒక్కరైనా ఈ పిల్లలు గెలిచిన మాట వాస్తవమే గానీ, గెలిచిన తీరు మాత్రం అభ్యంతరకరం అని చెప్పరేమిటి? పిల్లలు తెలిసో తెలియకో చేశారు. దానిని ఇంతమంది సమర్ధించడం, పెపైచ్చు పొగడటం మూర్తికి బొత్తిగా నచ్చలేదు. విజయం కంటే విలువలు గొప్పవనీ, సాధించిన విషయంతో పాటు సాధన మార్గం కూడా ముఖ్యమైనదనీ ఆ పిల్లవాళ్లకు ఎవరూ చెప్పడంలేదెందుకు? ఉన్నత స్థానానికి ఎగబాకే క్రమంలో ఉదాత్తతని విస్మరించడం తప్పని వాళ్లు ఎప్పుడు తెలుసుకుంటారు?
‘‘ఇప్పుడు ఎమ్మెల్యేగారు విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు. ఆ తరువాత క్విజ్ మాస్టర్ని శాలువాతో సత్కరిస్తారు’’ స్పీకర్లో నుండి యాంకర్ మాటలు.
ఎమ్మెల్యేని తలచుకోగానే అప్రయత్నంగా పిరదౌసిలోని ‘‘నీచే పూజితుండైనచో అల్లాకున్ సుఖమే’’ వాక్యం మనసులో మెదిలింది మూర్తికి. గెలుపు కోసం ఈ పిల్లలు చేసిన పనిని ఈయన పెద్ద మొత్తంలో చేశాడు. అవును, ఇలాంటి వాళ్లకు ఈ రోజు ఆ పిల్లలు చేసింది గొప్ప వ్యూహమనిపిస్తుంది. ఈ రోజు ఆ పిల్లలు క్విజ్‌లో గెలిచి ఉండవచ్చు. కానీ వాళ్ల ప్రవర్తన వల్ల క్విజ్ ఓడిపోయింది. ఈ ఆలోచన రాగానే మూర్తి ఆడిటోరియమ్ దాటి, ఆఫీస్ బిల్డింగ్ దాటి పార్కింగ్ వైపు అడుగులేస్తున్నాడు.
ఇందాకటి నుండి ఒక ప్రశ్న మనసును తొలుస్తోంది. ఇంతకీ డి టీమ్వాళ్లు చేసిన పనికి మూలకారణమేమిటి? విజయం పట్ల మనకున్న విపరీత వ్యామోహమా? విలువల పట్ల మనకున్న సర్దుబాటు ధోరణా? వేగం మీది కోరికతో వాళ్ల వివేకాన్ని హరించిన తన బజర్ రౌండా? ఎదుటివాడు ఏమైనా ఫరవాలేదు, మనం బాగుంటే చాలనే స్వార్థమా? కొన్ని వేల ప్రశ్నలకు అవలీలగా సమాధానాలు చెప్పగలిగిన మూర్తికి, ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.బండి స్టార్ట్ చేయాలని చూస్తుంటే ఇందాకటి నుండి, తన చేతిలో ఉన్న పేపర్ అడ్డొచ్చింది. తిప్పి చూశాడు. అది ఆ క్విజ్‌లో అడగకుండా ఆపివేయబడ్డ చిట్టచివరి ప్రశ్న -‘‘తాము ఓడిపోతామనీ, తద్వారా సెమీస్‌లో అర్హత కోల్పోతామనీ తెలిసినా, క్రీజు బయట నిలబడిన ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయకుండా తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్న వెస్టిండీస్ క్రీడాకారుడెవరు?’’
- .జి.ఉమామహేశ్వర్