పలచబడిన ఫ్రెంచ్ పరిమళం | after French Revolution Napoleon bonaparti love story | Sakshi
Sakshi News home page

పలచబడిన ఫ్రెంచ్ పరిమళం

Published Sat, May 31 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

పలచబడిన ఫ్రెంచ్ పరిమళం

పలచబడిన ఫ్రెంచ్ పరిమళం

ప్రపంచం ఇప్పటికీ మరులుగొనే ఫ్రెంచ్ విప్లవం (1789) తరువాత ఆ దేశం నెపోలియన్ బోనాపార్టి అనే సైనికుడిని పడి పడి ప్రేమించింది. ఆ మహా విప్లవానికి నాయకత్వం వహించిన రాబిస్పియర్ వంటి వారికి ఆ జాతి మరణశిక్ష విధించి, ఆ కుర్ర లెఫ్టినెంట్‌ను చక్రవర్తిగా వరించింది.
 
  ఇదొక చారిత్రక వైచిత్రి అనుకుంటే, నెపోలియన్ ప్రేమ గాథ అంతకు మించిన వైచిత్రి. యూరప్ అంతటా అప్రతిహత విజయాలు సాధించి మహా విజేతగా చరిత్రలో నిలిచిపోయిన నెపోలియన్, ప్రేమగాథ దగ్గర మాత్రం అపజయం పాలయ్యాడనే అనిపిస్తుంది.
 
 విప్లవంతో ఫ్రెంచ్ జాతీయులు గడగడలాడిపోతున్న కాలంలో, దేశం బయట  నెపోలియన్ సాధించిన సైనిక విజయాలు దృష్టి మళ్లించాయి.  విప్లవం తరువాత కలహాలతో కాపురం చేసిన రిపబ్లిక్ ప్రభుత్వాలకు కూడా  ఇరవయ్యారేళ్ల నెపోలియన్  పెద్ద దిక్కులా కనిపించాడు. అందుకే వరస సైనిక విజయాలు సాధించిన నెపోలియన్ గౌరవార్ధం 1796లో ఓ రోజు పెద్ద విందు ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్ చక్రవర్తి పదహారో లూయీ, ఆయన భార్య మేరీ ఆంటోనెట్ నివాసం ఉన్న చరిత్రాత్మక వెర్సెయిల్స్ భవనంలోనే విందుకు వచ్చి కూర్చున్న నెపోలియన్ ఒడిలో తూలి పడిందొక 32 సంవత్సరాల మహిళ.
 
  ఆమె- జోసఫీన్ బ్యూహైర్నెస్. పారిస్ నగరంలోనే అందగత్తెగా ఆమెకు పేరుంది. ఆ సాయంత్రమే ఆమెను ప్రేమిస్తున్నట్టు నెపోలియన్ ప్రకటించాడు. రెండు వారాలకే- అంటే, ఆ సంవత్సరం మార్చి 9న పెళ్లి కూడా జరిగింది. నీలం, వజ్రం పొదిగిన బంగారు ఉంగరాన్ని అప్పుడే నెపోలియన్ ఆమె చేతికి తొడిగాడు(దీనిని ఏడాది క్రితం పారిస్‌లో వేలం వేశారు). చిత్రంగా ఆ రెండు జాతి రాళ్లు కంటి కొన నుంచి రాలుతున్న కన్నీటి చుక్క ఆకృతిలోనే ఉన్నాయి.
 
 పెళ్లి జరిగిన రెండో రోజునే నెపోలియన్ ఇటలీ దండయాత్రకు వెళ్లిపోయాడు.
 యుద్ధరంగం నుంచి భార్యకు కొన్ని నెలల పాటు అనేక ఉత్తరాలు రాశాడు నెపోలియన్. అందులో ఎక్కువ జోసఫీన్‌ను నెపోలియన్ ఎంత గాఢంగా ప్రేమించాడో చెబుతాయి. ఇటలీ తరువాత ఈజిప్ట్ దండయాత్ర జరిగింది. 1799లో సైనిక తిరుగుబాటు చేసి ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నాడు నెపోలియన్. 1802లో చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. మహారాణిగా జోసఫీన్‌ను ప్రకటించాడు.
 
 జోసఫీన్‌కు అప్పటికే ఇద్దరు పిల్లలు. మార్టినిక్యూ అనేచోట పూటతోటలు పెంచే వారి కుటుంబంలో పుట్టిందామె. ఆమె మహా సౌందర్యాన్ని చూసి పదమూడో ఏటనే అలెగ్జాండర్ డి బ్యూహైర్నెస్ అనే రాజసభ ప్రముఖుడు పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత వదిలేశాడు. ఇంతలోనే ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. అలెగ్జాండర్ విప్లవానికి పూర్తి మద్దతునే ఇచ్చాడు. అయినా విప్లవకారులు నమ్మక, అదుపులోకి తీసుకున్నారు. అప్పటికి భర్తకు దూరంగానే ఉన్నా జోసఫీన్‌ను కూడా విప్లవకారులు అరెస్టు చేశారు.
 
 ఇద్దరికీ మరణ దండన విధించారు.  గిలెటెన్ ద్వారా శిక్ష అమలుకు అడ్డు లేకుండా ఆమె కురులను సయితం కత్తిరించి సిద్ధం చేశారు. మొదట అలెగ్జాండర్‌కు మరణ దండన అమలు జరిగిపోయింది. ఇక తన వంతు. అందుకు ఆమె ఎదురు చూస్తుండగా, ప్రభుత్వం కూలిపోయింది. ఆమె శిక్ష నుంచి తప్పించుకుంది. తరువాత ఒక రాజ వంశీకుడు ఆమెను వశం చేసుకున్నాడు. తరువాతే నెపోలియన్‌తో వివాహం.
 
 నెపోలియన్ దండయాత్రకు వెళ్లగానే ఆమె జోసఫీన్ వేరొకరితో సంబంధం పెట్టుకుందని రూఢీ అవడంతో నెపోలియన్ తన సోదరుడితో చెప్పి 1810లో విడాకులు సిద్ధం చేయించాడు. అయితే నెపోలియన్ జోసఫీన్‌ను ఎప్పటికీ మరచిపోలేదు. విడాకులు ఇచ్చినా దూరం చేసుకోలేదు. 1814లో జోసఫీన్ మరణించినపుడు కూడా నెపోలియన్ వెళ్లాడు. ప్రపంచం నలుమూలల నుంచి తెచ్చి జోసఫీన్ పెంచిన గులాబీల తోటలో కొంచెం సేపు గడిపి వచ్చాడు.
 
 ట్రెఫాల్గర్, వాటర్లూ యుద్ధాలలో ఓటమి తరువాత ఇంగ్లండ్ నెపోలియన్‌ను సెయింట్ హెలినా ద్వీపంలో బంధించింది. అక్కడే అతడు చివరి దశలో తరుచు కొన్ని మాటలు అనేవాడట-ఫ్రాన్స్.... సైన్యం.... సైన్యాధిపతి... ఇంకోమాట- జోసఫీన్. అంటే 1821లో అక్కడే చనిపోయే వరకు ఆమెను నెపోలియన్ ప్రేమిస్తూనే ఉన్నాడు. ‘తొలి చూపులో ప్రేమ’ ఎంత నిజమో, ‘ప్రేమ గుడ్డిద’నడం కూడా అంతే నిజమని నెపోలియన్ గాథ చెబుతుంది. ఇదో కన్నీటి కథగానే మిగిలిపోతుందని విధి చెప్పదలిచిందా?  ఏమో! కానీ నెపోలియన్ ఇచ్చిన పెళ్లి ఉంగరంలో రాళ్లు కన్నీటి బిందువులను పోలి ఉండడం నిజం వింతే.
 - డా॥గోపరాజు నారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement