సాక్షి, న్యూఢిల్లీ : త్రిపురలోని బెలోనియాలో లెనిన్ విగ్రహాన్ని కూల్చిన ఘటనపై బీజేపీ స్పందించింది. లెనిన్ విగ్రహాన్ని ఎవరూ ధ్వంసం చేయలేదని బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ స్పష్టం చేశారు. ప్రైవేట్ భూమిలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని భూ యజమానులే తొలగించారని దాన్ని ఎవరూ ధ్వంసం చేయలేదని చెప్పారు. త్రిపురలో రెండున్నర దశాబ్ధాల సీపీఎం సర్కార్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన నేపథ్యంలో లెనిన్ విగ్రహం కూల్చివేత కలకలం రేపిన విషయం తెలిసిందే.
‘త్రిపురలో ఏ ఒక్క విగ్రహాన్ని ఎవరూ ధ్వంసం చేయలేదు..ఇది తప్పుడు సమాచారం..కొందరు వ్యక్తులు ప్రైవేట్ భూమిలో విగ్రహాన్ని నెలకొల్పి తర్వాత వారే తొలగించార’ని రాంమాధవ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ నేతలను గౌరవించాలని ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీకి హితవు పలకడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మమత ఇతర రాష్ట్రాలలో జరిగే పరిణామాలపై దృష్టిసారించే ముందు తమ రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment