జైపూర్: బాలీవుడ్ చిత్రం పద్మావతిపై నిరసనలు రాజస్తాన్‌లో ఇతర ప్రాంతాలకూ వ్యాపించాయి. రాజ్‌సమంద్ జిల్లాలో రాజ్‌పుత్ వర్గీయులు ఆందోళనలు తీవ్రతరం చేస్తూ శనివారం చారిత్రక కుంభల్‌గఢ్ కోటలోకి ప్రవేశాన్ని అడ్డగించారు. కోటలో జరిగిన ప్రదర్శన కార్యక్రమాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దిష్టి బొమ్మను ఉరితీశారు. సెన్సార్ సర్టిఫికేట్ పొందకుండానే ఈ చిత్రాన్ని కొందరు పాత్రికేయుల ముందు ప్రదర్శించడాన్ని సీబీఎఫ్‌సీ చైర్మన్ ప్రసూన్ జోషి తప్పుపట్టారు. ‘ ఇలాంటి చర్యలు సీబీఎఫ్‌సీ పాత్రను బలహీనపరిచేలా ఉన్నాయి. తమ సౌకర్యం కోసం సర్టిఫికేషన్ ప్రక్రియను ఇలా హ్రస్వ దృష్టితో చూడటం సరికాదు’ అని జోషి వ్యాఖ్యానించారు.
సీబీఎఫ్‌సీ సర్టిఫికేట్ కోసం నిర్మాతలు చేసుకున్న దరఖాస్తు అసంపూర్తిగా ఉన్నందునే దాన్ని వెనక్కి పంపామని వెల్లడించారు. ఈ చిత్రం కల్పితమా లేక చరిత్ర ఆధారితమా అన్న విషయాన్ని డిస్‌క్లేమర్‌లో చెప్పకుండా ఖాళీగా వదిలేశారని తెలిపారు. సర్టిఫికెట్ ఇవ్వకుండానే దరఖాస్తును సీబీఎఫ్‌సీ వెనక్కి పంపడం ఓ రాజకీయ స్టంట్ అని, గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ నాటకం ఆడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. హెచ్చరికలు ఎదుర్కొంటున్న ఈ చిత్రంలోని ప్రధాన పాత్రదారు దీపికా పదుకొనేకు హాలీవుడ్ నటి రూబీ రోజ్ బాసటగా నిలిచారు. తనకు తెలిసిన ధైర్యవంత మహిళల్లో దీపికా ఒకరని ట్వీట్ చేశారు. దీపికకు వచ్చిన బెదిరింపులకు నిరసనగా గోవాలో జరనగనున్న ఇఫ్ఫి వేడుకలను సినీ పరిశ్రమ బహిష్కరించాలని ప్రముఖ నటి షబానా అజ్మీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment