Hundreds killed
-
పపువా న్యూ గినియా విషాదం.. మరణాలు 670కి పైనే..
మెల్బోర్న్: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియాలో శుక్రవారం కొండచరియలు విరిగిపడి గ్రామాన్ని నేలమట్టం చేయడం తెల్సిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 670కిపైనే అని ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్(ఐవోఎం) ఆదివారం తెలిపింది. ఎంగా ప్రావిన్స్ అధికారులు, బాధిత యంబలి గ్రామస్తులు అందించిన సమాచారాన్ని బట్టి 150కిపైగా ఇళ్లు భూస్థాపితం కాగా వాటిలోని 670 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ఐవోఎం అంచనా వేసింది. క్షతగాత్రులు, గల్లంతైన వారి సంఖ్యలో స్పష్టత రాలేదని పేర్కొంది. ఆదివారం ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు స్థానిక అధికారులు చెప్పారు. మట్టి, బండరాళ్లు, చెట్లు మూడు నుంచి నాలుగు ఫుట్‌బాల్ మైదానాలంత విస్తీర్ణంలో 6 నుంచి 8 మీటర్ల లోతున గ్రామాన్ని భూస్థాపితం చేశాయని, లోపల చిక్కుకున్న వారు బతికి బట్టకట్టేందుకు అవకాశాలు తక్కువని ఐవోఎం అంటోంది. మరోవైపు స్థానిక గిరిజన తెగల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. దాంతో సహాయక సిబ్బంది, అత్యవసరాలను చేరవేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. -
సౌదీ సైన్యం కాల్పుల్లో వందలాది మంది మృతి !
దుబాయ్: సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించేందుకు యతి్నంచిన ఇథియోపియా వలసదారులపై సౌదీ బలగాలు జరిపిన కాల్పుల్లో వందలాదిమంది మృతి చెందినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ మంగళవారం తెలిపింది. సైన్యం మెషిన్స్ గన్లు, మోర్టార్లతో జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. యెమెన్ వైపు ఉన్న సరిహద్దు నుంచి వస్తున్న వలసదారులపైకి సౌదీ బలగాలు కాల్పులు జరపడంపై ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. హ్యూమన్ రైట్స్ వాచ్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తోందని సౌదీ అధికారి ఒకరు ఖండించారు. సౌదీలో ప్రస్తుతముంటున్న 7.50 లక్షల మంది ఇథియోపియన్ శరణార్థుల్లో 4.50 లక్షల మంది అనధికారికంగా ఉంటున్నవారే. ఇప్పటికే నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్న సౌదీ ప్రభుత్వం వీరిని వెనక్కి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
సూడాన్‌లో 101 మంది మృతి
ఖర్టౌమ్: సూడాన్ రాజధాని ఖర్టౌమ్‌లో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినవారిపై జరిపిన కాల్పుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా గాయాలపాలయ్యారు. గాయపడిన వారికి వైద్యం చేసేందుకు ఖర్టౌమ్లోని ఆసుపత్రుల్లో తగినంత మంది వైద్య సిబ్బందిగానీ, సదుపాయాలు గానీ అందుబాటులో లేవు. సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్–బషీర్ నియంతృత్వ పాలనపై నెలల తరబడి ఆందోళనలు జరుగుతుండగా, ఆ దేశ మిలిటరీ ఈ ఏడాది ఏప్రిల్‌లో బషీర్‌ను పదవి నుంచి దింపేసింది. మరో మూడేళ్లలో పౌర పాలన మళ్లీ మొదలయ్యేలా ఓ ఒప్పందం కుదిరింది. అప్పటివరకు దేశ పాలనకు మిలిటరీ కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ కౌన్సిల్ పాలనను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా అనేక మంది ఆర్మీ ప్రధాన కార్యాలయం బయట నిరసనలు తెలుపుతుండగా, సోమ, మంగళ వారాల్లో ఆ నిరసనకారులను అణచివేసేందుకు ఆర్మీ కాల్పులకు దిగింది. ఆసుపత్రుల్లోనూ వైద్యులు, ఇతర సిబ్బందిపై సూడాన్ భద్రతా దళాలు దాడులు చేస్తున్నాయని వైద్యుల సంఘం ఆరోపించింది. కాల్పుల ఘటనలను ఖండించి, ఆందోళనకారులకు, మిలిటరీకి మధ్య సయోధ్య కుదర్చాలంటూ ఐక్యరాజ్యసమితికి వచ్చిన ఓ తీర్మానాన్ని చైనా, రష్యాలు అడ్డుకున్నాయి. 8 యూరప్ దేశాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేస్తూ కాల్పులను ఖండించాయి. కాల్పుల ఘటనల్లో 101 మంది చనిపోవడంతో మిలిటరీతో చర్చలు జరిపేందుకు నిరసనకారులు నిరాకరించారు. 101లో 40 మంది మృతదేహాలు నైలునదిలో లభించాయి. -
తేరుకోని ఇండోనేసియా
ఇండోనేసియాలో భూకంపం, సునామీ ధాటికి పూర్తిగా ధ్వంసమై మరుభూమిని తలపిస్తున్న పలూ పట్టణం. ఈ ప్రకృతి విలయంలో సజీవసమాధి అయినవారి సంఖ్య తాజాగా 1,200కు చేరిందని అనధికార వార్తలొచ్చాయి. దాదాపు 1,91,000 మంది తక్షణ అవసరం కోసం ఎదురుచూస్తున్నారని సోమవారం ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. సహాయకచర్యలను ముమ్మరంచేశారు. మరోవైపు, అసువులుబాసిన వందలాది మందిని ఒకేచోట ఖననంచేసేందుకు పలూ పట్టణంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సునామీ విలయ విధ్వంసం
పలూ: ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో భూకంపం, సునామీ కారణంగా భారీగా ప్రాణనష్టం సంభవించింది. తొలుత భూకంపంతో భవనాలు నేలకొరగడం, అంతలోనే 6 మీటర్ల ఎత్తులో రాకాసి అలలు విరుచుకుపడటంతో సులవేసి ద్వీపంలో ఆదివారం సాయంత్రం నాటికి 832 మంది చనిపోయారు. ద్వీపంలోని ఇళ్లన్నీ ధ్వంసం కావడంతో ప్రజలు ఆకలి తీర్చుకునేందుకు దుకాణాలతో పాటు తాగునీటి ట్యాంకర్లను సైతం లూటీ చేస్తున్నారు. ప్రజలు భారీగా మృత్యువాత పడిన నేపథ్యంలో అంటువ్యాధులు వ్యాపించకుండా అధికారులు శవాలను సామూహికంగా ఖననం చేస్తున్నారు. ఇండోనేసియా ఉపాధ్యక్షుడు జుసుఫ్ కల్లా మాట్లాడుతూ..భూకంపం సంభవించిన ఉత్తర సులవేసి ప్రాంతంలో మృతుల సంఖ్య వేలలో ఉండొచ్చని తెలిపారు. చాలామంది ప్రజలు ఇంకా శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారని వెల్లడించారు. భూకంపం–సునామీతో తీవ్రంగా దెబ్బతిన్న చాలా ప్రాంతాలకు సహాయక బృందాలు ఇంకా చేరుకోలేదన్నారు. కాగా, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో ఆదివారం సాయంత్రం సులవేసిలోని పలూ పట్టణాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. భూకంపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. భూకంపం–సునామీ నేపథ్యంలో ఇండోనేసియాలో చిక్కుకున్న 71 మంది విదేశీ పర్యాటకులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఫ్రాన్స్‌కు చెందిన ముగ్గురు, దక్షిణ కొరియాకు చెందిన ఓ పర్యాటకుడి జాడ తెలియరాలేదని వెల్లడించారు. వాయుసేనకు చెందిన సీ–130 హెర్క్యులస్ విమానం ద్వారా ఆహార పదార్థాలను చేరవేస్తున్నట్లు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉన్న ఇండోనేసియాలో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఆపద్బాంధవుడిగా ఫేస్బుక్ భూకంపం–సునామీ తాకిడికి అతలాకుతలమైన సులవేసి ద్వీపంలో ప్రజలకు ఫేస్బుక్ సహాయకారిగా మారింది. చాలామంది తప్పిపోయిన తమ కుటుంబ సభ్యుల వివరాలను ఫేస్బుక్లో పంచుకుంటున్నారు. సంబంధిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు. మరికొందరేమో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఫొటోలు తీసి ఫేస్బుక్ గ్రూపుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు శిథిలాల్లో చిక్కుకున్నారనీ, సాయం చేయాలని కోరుతూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరైతే తమ కుటుంబ సభ్యుల మృతదేహాలు దొరికితే సామూహిక ఖననం చేయవద్దనీ, వాటిని తాము తీసుకువెళతామంటున్నారు. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ ఇండోనేసియాలో భూకంపం–సునామీతో 832 మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టకాలంలో మిత్రుడైన ఇండోనేసియాకు తోడుగా ఉంటామని ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఆదివారం ట్వీట్ చేసింది. పని చేయని హెచ్చరిక వ్యవస్థ ప్రభుత్వ, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సులవేసి ద్వీపంలో మృతుల సంఖ్య 832కు చేరుకుందని నిపుణులు ఆరోపిస్తున్నారు. 2004 సునామీ సృష్టించిన భయానక విధ్వంసం తర్వాత పసిఫిక్ ప్రాంతంలో సునామీలను గుర్తించేందుకు సెన్సార్లు, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, బోయెలతో ఓ ప్రోటోటైప్ వ్యవస్థను అమెరికా–జర్మనీ– మలేసియా–ఇండోనేసియా శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఇందుకోసం అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్ రూ.21.75 కోట్లను కేటాయించింది. ఈ హెచ్చరిక వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు కేవలం రూ.50 లక్షలు కావాల్సి ఉండగా, ఆర్థికస్థితి బాగోలేదంటూ ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. సరైన నిర్వహణ లేకపోవడంతో సముద్ర గర్భంలోని ప్రకంపనలను పసిగట్టే చాలా బోయెలు చెడిపోగా, మరికొన్ని చోరీకి గురయ్యాయి. అలాగే సునామీని ముందుగా హెచ్చరించే ‘టైడ్ గేజ్’లు కూడా ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో ఫైబర్ కేబుల్స్ కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఏ విభాగం కూడా ముందుకు రాలేదు. రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపానికి ప్రజలు కకావికలమయ్యారనీ, ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సునామీ హెచ్చరిక సైరన్లను అధికారులు మోగించలేకపోయారని నిపుణులు గుర్తించారు. భూకంపాలు సంభవించినప్పుడు ఎత్తైన కొండ ప్రాంతానికి వెళ్లిపోవాలన్న అవగాహన ప్రజల్లో లేకపోవడంతో సునామీలో చిక్కుకుని చాలా మంది దుర్మరణం చెందారన్నారు. రియల్ హీరో ఏటీసీ ఉద్యోగి భూకంపం సందర్భంగా తన ప్రాణాలను కోల్పోయినా వందలాది మందిని కాపాడిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్(ఏటీసీ) ఆంథోనియస్ గునవన్ అగుంగ్(21)ను స్థానిక మీడియా హీరోగా కీర్తిస్తోంది. పలూలోని మురియారా ఎస్ఐఎస్ అల్ జుఫ్రీ విమానాశ్రయంలో ఆంథోనియస్ శుక్రవారం విధులు నిర్వహిస్తుండగా శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. దీంతో మిగతా ఎయిర్ ట్రాఫిక్ సిబ్బందిని బయటకు పంపిన ఆంథోనియస్ తాను మాత్రం అక్కడే ఉండిపోయాడు. వరుస ప్రకంపనలు భవనాన్ని కుదిపేస్తున్నా అక్కడే ఉండి ఎయిర్‌పోర్టులోని విమానాలకు క్లియరెన్స్ ఇవ్వసాగాడు. ఎయిర్‌పోర్ట్‌లోని చిట్టచివరి విమానం టేకాఫ్ అయిన తర్వాత బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా వీలుకాలేదు. దీంతో నాలుగంతస్తుల భవనం నుంచి ఒక్కసారిగా దూకేశాడు. అంతర్గత రక్తస్రావంతో పాటు కాలు విరిగిన ఆంథోనియస్ను సహోద్యోగులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అయితే ఎయిర్ అంబులెన్స్(హెలికాప్టర్) అక్కడకు చేరుకునేలోపే ఆంథోనియస్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఆంథోనియస్ ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గుర్తుగా ఆయన ర్యాంకును రెండు లెవల్స్‌కు పెంచినట్లు ఎయిర్ నావ్ కంపెనీ తెలిపింది. సునామీలో ధ్వంసమైన దుకాణం నుంచి సరుకులను ఎత్తుకెళ్తు్తన్న స్థానికులు -
భారీ భూకంపం.. 400 మంది మృతి
జకార్తా/పలూ: ఇండోనేసియాపై మరోసారి ప్రకృతి పగబట్టింది. 2004 నాటి సుమత్రా సునామీ దుర్ఘటనను, రెండు నెలల క్రితం నాటి భూకంపాన్ని మరిచిపోకముందే మరోసారి భూకంపం, సునామీ రూపంలో ప్రకృతి కన్నెర్రజేసింది. సులవేసి ద్వీపంలోని పలూ పట్టణంలో దేశ, విదేశీ పర్యాటకులు బీచ్ ఫెస్టివల్‌కు సిద్ధమవుతున్న తరుణంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం, ఆ వెంటనే 4–6 మీటర్ల ఎత్తు రాకాసి అలలతో సునామీ విరుచుకుపడటంతో 400 మంది మృతిచెందారు. వంద మందికిపైగా గల్లంతయ్యారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆసుపత్రులు కూలిపోవడంతో ఆరుబయటే క్షతగాత్రులకు చికిత్సనందిస్తున్నారు. సముద్రతీరంలోని పలూ పట్టణం దాదాపుగా నేలమట్టమైంది. సహాయ కార్యక్రమాలను ప్రారంభించిన సైన్యం, అధికారులకు ఎటు చూసినా శవాల గుట్టలే కనబడుతున్నాయి. బీచ్‌లో ఇసుకలో కూరుకుపోయి సగం బయటకు కనబడుతున్న మృతదేహాలే దర్శనమిస్తున్నాయి. శనివారం రాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం 384 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భూ ఉపరితలానికి పదికిలోమీటర్ల లోతులో శుక్రవారం సాయంత్రం సమయంలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. కాగా, సునామీ బారిన పడిన ఇండోనేసియాను ఆదుకుంటామని ఐక్యరాజ్య సమితి ప్రసంగంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. హృదయ విదారక దృశ్యాలు భూకంపం తీవ్రతకు చాలాచోట్ల ఇళ్లు కూలిపోవడంతో శిథిలాల్లో చిక్కుకుని పలువురు చనిపోగా వేల మంది క్షతగాత్రులయ్యారు. ఆసుపత్రులూ కూలడంతో ఆసుపత్రుల ఆరుబయటే చికిత్సనందిస్తున్నారు. బీచ్‌లో కూరుకుపోయిన వారు కొందరైతే.. అలల ధాటికి కొట్టుకొచ్చి బలమైన గాయాలతో చనిపోయిన వారు మరికొందరు. బురదలో కూరుకుపోయిన ఓ చిన్నారి మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు తీసి బంధువులకు అప్పజెబుతున్న దృశ్యాలు కంటతడిపెట్టించాయి. నిరాశ్రయులు లక్షల్లోనే.. భూకంపం తాకిడికి ఇళ్లన్నీ కూలి వేల మంది నిరాశ్రయులయ్యారు. భూమి కంపిస్తున్న సమయంలో స్థానికులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్లు, రిసార్టులనుంచి బయటకు పరుగులు తీస్తున్న సమయంలోనే సునామీ విరుచుకుపడింది. సముద్ర తీరంలో ఉన్న ఓ మసీదు ఉవ్వెత్తున ఎగిసిపడిన అలల ధాటికి ధ్వంసమవగా.. సమీపంలోని ఇళ్లలోకి కార్లు, ఇతర వాహనాలు చొచ్చుకొచ్చాయి. ఓ ఎత్తైన భవనంపై ఏర్పాటుచేసిన సీసీటీవీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. రోడ్లు, వీధి దీపాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఈ పట్టణమంతా శుక్ర, శనివారాల్లో రాత్రంతా చీకట్లోనే మగ్గింది. ‘అలలు అంతెత్తున ఎగసిపడుతుండటాన్ని చూసి పరిగెత్తాను. అందుకే ప్రాణాలు కాపాడుకోగలిగాను’ అని ఓ స్థానికుడు పేర్కొన్నారు. రంగంలోకి సైన్యం ఈ ఏడాది జూలై, ఆగస్టులో లోంబోక్ ద్వీపంలో వచ్చిన దానికంటే ఈసారి వచ్చిన భూకంప తీవ్రతే ఎక్కువని అధికారులు తెలిపారు. కాగా, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సైన్యాన్ని రంగంలోకి దించారు. విద్యుత్, సమాచార వ్యవస్థతోపాటు మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే పనిలో సైన్యం ఉంది. శనివారం కూడా పలూలో భూమి పలుమార్లు స్వల్ప తీవ్రతతో కంపించింది. కాగా పలూకు సమీపంలోని దొన్గాలా ప్రాంతంపైనా సునామీ విరుచుకుపడినట్లు సమాచారం అందిందని.. అయితే అక్కడి పరిస్థితేంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. ‘భూకంపం, సునామీల బాధితుల్లో చిన్నారులే ఎక్కువగా ఉండటం బాధ కలిగించింది. నీటి తీవ్రతకు కొట్టుకుపోయారని ప్రత్యక్షసాక్షులు, అధికారులు చెబుతున్నారు’ అని సేవ్ ద చిల్డ్రన్ ఎన్జీవో చీఫ్ టామ్ హోవెల్ పేర్కొన్నారు. పలూ పట్టణానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు కూడా వారి ప్రాంతాల్లో ఒకసారి భారీ కుదుపు వచ్చిందని పేర్కొన్నారంటే భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సుమత్రాలో మొదలై.. ప్రపంచంలోని అద్భుతమైన పర్యాటక కేంద్రాల్లో ఒకటైన ఇండోనేసియాపై 2004 నుంచి ప్రకృతి పగబట్టింది. ఆ ఏడాది బాక్సింగ్ డే (డిసెంబర్ 26) సంబరాల్లో పర్యాటకులు ఉన్నపుడు 9.3 తీవ్రతతో వచ్చిన భూకంపం, ఆ తర్వాత 24 మీటర్ల ఎత్తులో వచ్చిన రాకాసి అలలు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఇండోనేసియా వ్యాప్తంగా లక్షా 68వేల మంది చనిపోయారు. నాటి సునామీ భారత్‌సహా పలు దేశాలపై ప్రభావాన్ని చూపింది. 2005 మార్చిలో 8.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 900 మంది చనిపోయారు. 2006 మేలో జావా ద్వీపంలో వచ్చిన భూకంపం 6వేల మందిని బలిగొంది. 2009లో సుమత్రా ప్రధాన ఓడరేవైన పడాంగ్‌లో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం 1,100 మందిని చంపేసింది. ఆ తర్వాత అడపా దడపా వచ్చిన భూకంపం, సునామీలు ఇండోనేసియాపై విరుచుకుపడుతూ వందల సంఖ్యలో ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. రవాణా వ్యవస్థ ధ్వంసం పలూ నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఓ భారీ బ్రిడ్జి ధ్వంసమైంది. ఈ నగరానికి మిగిలిన ప్రపంచంతో అనుసంధానం చేసే రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. కొండచరియలు పడి దార్లు మూసుకుపోయాయి. ప్రార్థనలకోసం తీరంలోని మసీదుకు వచ్చిన వారు మొదట భూమి కంపించగానే పరుగులు తీశారు. అంతలోనే వరుసగా భూమి కంపించడంతో చాలా మంది మసీదు శిథిలాల కింద చిక్కుకుపోయి మరణించినట్లు తెలుస్తోంది. బురదలో కూరుకుపోయిన చిన్నారి మృతదేహాన్ని తరలిస్తున్న సహాయక సిబ్బంది దాదాపు పూర్తిగా నేలమట్టమైన పలూ నగరంలోని ఆస్పత్రి ఆవరణలో చికిత్స పొందుతున్న భూకంప బాధితులు -
బంగూయిలో విధ్వంసకాండ: 300 మంది మృతి
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికన్ రాజధాని బంగూయిలో గత రెండు రోజులుగా చోటు చేసుకున్న విధ్వంసకాండలో దాదాపు 300 మంది మరణించారని రెడ్ క్రాస్ సొసైటీ శనివారం ఇక్కడ వెల్లడించింది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మృతదేహలను ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపింది. శాంతి భద్రతలను పరిరక్షించే క్రమంలో భాగంగా ఇప్పటికే ఫ్రెంచ్ దళాలకు చెందిన వేలాది మంది భద్రత సిబ్బంది ఇప్పటికే బంగూయి చేరుకున్నారని వివరించింది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్న్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ బొజీజ్ను ఇటీవల పదవి నుంచి తొలగించారు. దాంతో ఫ్రాంకోయిస్ అనుకూల వర్గానికి, వ్యతిరేక వర్గానికి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు బీబీసీ శనివారం వెల్లడించింది.