మరణాలు 670కి పైనే..
మెల్‌బోర్న్: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియాలో శుక్రవారం కొండచరియలు విరిగిపడి గ్రామాన్ని నేలమట్టం చేయడం తెల్సిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 670కిపైనే అని ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్(ఐవోఎం) ఆదివారం తెలిపింది. ఎంగా ప్రావిన్స్ అధికారులు, బాధిత యంబలి గ్రామస్తులు అందించిన సమాచారాన్ని బట్టి 150కిపైగా ఇళ్లు భూస్థాపితం కాగా వాటిలోని 670 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ఐవోఎం అంచనా వేసింది. క్షతగాత్రులు, గల్లంతైన వారి సంఖ్యలో స్పష్టత రాలేదని పేర్కొంది.
ఆదివారం ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు స్థానిక అధికారులు చెప్పారు. మట్టి, బండరాళ్లు, చెట్లు మూడు నుంచి నాలుగు ఫుట్‌బాల్ మైదానాలంత విస్తీర్ణంలో 6 నుంచి 8 మీటర్ల లోతున గ్రామాన్ని భూస్థాపితం చేశాయని, లోపల చిక్కుకున్న వారు బతికి బట్టకట్టేందుకు అవకాశాలు తక్కువని ఐవోఎం అంటోంది. మరోవైపు స్థానిక గిరిజన తెగల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. దాంతో సహాయక సిబ్బంది, అత్యవసరాలను చేరవేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది.
Comments
Please login to add a commentAdd a comment