International Organization for Migration
-
పపువా న్యూ గినియా విషాదం.. మరణాలు 670కి పైనే..
మెల్బోర్న్: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియాలో శుక్రవారం కొండచరియలు విరిగిపడి గ్రామాన్ని నేలమట్టం చేయడం తెల్సిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 670కిపైనే అని ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్(ఐవోఎం) ఆదివారం తెలిపింది. ఎంగా ప్రావిన్స్ అధికారులు, బాధిత యంబలి గ్రామస్తులు అందించిన సమాచారాన్ని బట్టి 150కిపైగా ఇళ్లు భూస్థాపితం కాగా వాటిలోని 670 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ఐవోఎం అంచనా వేసింది. క్షతగాత్రులు, గల్లంతైన వారి సంఖ్యలో స్పష్టత రాలేదని పేర్కొంది. ఆదివారం ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు స్థానిక అధికారులు చెప్పారు. మట్టి, బండరాళ్లు, చెట్లు మూడు నుంచి నాలుగు ఫుట్‌బాల్ మైదానాలంత విస్తీర్ణంలో 6 నుంచి 8 మీటర్ల లోతున గ్రామాన్ని భూస్థాపితం చేశాయని, లోపల చిక్కుకున్న వారు బతికి బట్టకట్టేందుకు అవకాశాలు తక్కువని ఐవోఎం అంటోంది. మరోవైపు స్థానిక గిరిజన తెగల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. దాంతో సహాయక సిబ్బంది, అత్యవసరాలను చేరవేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. -
World Migration Report 2024: భారత్‌కు మనవాళ్ల డబ్బేడబ్బు
ఐక్యరాజ్యసమితి: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి తమ సంపాదనను పంపడంలో (రెమిటెన్స్) రికార్డు సృష్టించారు. భారత్‌కు ఈ తరహా నిధులు 2022లో 111.22 బిలియన్ డాలర్లు వచ్చాయి. దీనితో ఇంత భారీ స్థాయిని అందుకున్న తొలి దేశంగా భారత్ రికార్డులకు ఎక్కింది. నిజానికి రెమిటెన్సులు 100 బిలియన్ డాలర్లు దాటిన తొలి దేశంగా కూడా భారత్ నిలిచింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) ఈ మేరకు విడుదల చేసిన వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... » రెమిటెన్సులకు సంబంధించి భారత్ తరువాతి నాలుగు స్థానాల్లో మెక్సికో(61 బిలియన్ డాలర్లు), చైనా (51 బిలియన్ డాలర్లు), ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్ నిలిచాయి. 2021లో చైనా స్థానాన్ని 2022లో మెక్సికో అధిగమించింది. » దక్షిణాసియా నుంచి చాలా పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఉన్నందున ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్స్‌కు సంబంధించి అతిపెద్ద మొత్తాలను పొందుతోంది. దక్షిణాసియాలో భారత్‌తోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు రెమిటెన్సులకు సంబంధించి టాప్–10 దేశాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా పాకిస్తాన్ 30 బిలియన్ డాలర్లతో ఆరవ స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ 21.5 బిలియన్ డాలర్లతో ఎనిమిదవ స్థానంలో నిలుస్తోంది. » 44.8 లక్షల మంది వలసదారుల గమ్యస్థాన దేశంగా భారతదేశం 13వ స్థానంలో నిలిచింది. » విద్యార్థులను ఆకర్షించడంలో తొలి దేశంగా అమెరికా (8,33,000) ఉంది. తరువాతి స్థానాల్లో బ్రిటన్ (దాదాపు 6,01,000), ఆస్ట్రేలియా (దాదాపు 3,78,000), జర్మనీ (3,76,000 పైగా), కెనడా (దాదాపు 3,18,000) ఉన్నాయి.భారత్ పయనమిలా... (అంకెలు బిలియన్ డాలర్లలో) 2010 53.48 2015 68.91 2020 83.15 2022 111.22 -
మద్యధరా సముద్రంలో 130 మంది మృతి!
కైరో: 130 మందితో గురువారం యూరోప్‌కు బయలుదేరిన ఓ రబ్బర్ పడవను అధికారులు లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో గుర్తించారు. అయితే దగ్గరు వెళ్లి చూడగా అందులో ప్రజలెవరూ లేరు. దానికి తోడు చుట్టూ పదికి పైగా శవాలు నీటిలో కనిపించాయి. దీంతో వారంతా మరణించారని భావించారు. అయితే ట్రిపోలికి తూర్పున ఓ రెండు రబ్బర్‌పడవలను గుర్తించినట్లు లిబియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. దీంతో ప్రత్యేక పడవలను అక్కడికి పంపి వాటిలోని 106 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఓ మహిళ, కొందరు పిల్లలు ఉన్నారు. -
బోటు మునక : 64 మంది మృతి
రోమ్ (ఇటలీ) : అక్రమంగా యూరప్‌లోకి ప్రవేశించాలకున్న ఓ బోటు ప్రమాదవశాత్తు మధ్యదరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టులు వస్తున్నాయి. మృతులు అందరూ ఆఫ్రికా ఖండానికి చెందిన లిబియా దేశం నుంచి యూరప్‌లోకి ప్రవేశించేందుకు మధ్యదరా సముద్రంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. మునిగిపోతున్న పడవను గమనించిన ఇటలీ కోస్ట్ గార్డు 86 మందిని రక్షించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. చిన్న బోటులో 150 మందికి పైగా ప్రయాణించడంతోనే ప్రమాదం జరిగిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది. మధ్యదరా సంద్రంలోకి ప్రవేశించిన ఎనిమిది గంటల తర్వాత బోటుకు చిల్లుపడినట్లు వెల్లడించింది. పడవలోని వారందరూ ఓ వైపునకు వెళ్లారని చెప్పింది. దీంతో బ్యాలెన్స్ కోల్పోయిన బోటు తిరబడిందని పేర్కొంది.