రాజ్యసభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నిరసనలు, ఆందోళనల కారణంగా చరిత్రాత్మక అంశాలపై చర్చించే అవకాశాన్ని రాజ్యసభ సభ్యులు కోల్పోయారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ వంటి కీలకాంశాలపై సభలో చర్చ జరగకపోవటం దురదృష్టకరమన్నారు. పదవీకాలం ముగిసిన రాజ్యసభ సభ్యుల వీడ్కోలు చర్చలో ప్రధాని ప్రసంగించారు. 17 రాష్ట్రాలకు చెందిన దాదాపు 60 మంది రాజ్యసభ ఎంపీల (నామినేటెడ్ కలుపుకుని) సభ్యత్వం త్వరలో ముగియనుంది. ఇందులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, ప్రముఖ నటుడు చిరంజీవి, బాలీవుడ్ నటి రేఖ, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మాజీ అటార్నీ జనరల్ కే పరాశరన్, భారత హాకీ మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ.. సహా పలువురు ప్రముఖులున్నాయి.
లోక్‌సభ, రాజ్యసభ వేర్వేరు: మోదీ
పార్లమెంటులో కొందరు సభ్యుల నిరసనల కారణంగా ప్రజలకు అవసరమైన కీలకాంశాలపై చర్చ జరగటం లేదని మోదీ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ సహా పలు ముఖ్యమైన బిల్లులపై చర్చ జరగలేదని ఆయన గుర్తుచేశారు. సభ సజావుగా జరగటంలో విపక్షంతోపాటు ప్రభుత్వం పాత్ర కూడా కీలకమన్నారు. ‘లోక్‌సభలో ఏం జరుగుతుందో.. అదే రాజ్యసభలో జరగాల్సిన అవసరం లేదు. చరిత్రాత్మక చట్టాలపై జరిగిన చర్చలో భాగస్వాములు కాలేకపోయామని 10–20 ఏళ్ల తర్వాత మనకు అర్థమవుతుంది’ అని మోదీ తెలిపారు. కీలకమైన, క్లిష్టమైన సమయాల్లో.. సభను సజావుగా నడిపించటంలో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ చేసిన కృషిని సభ ఎన్నటికీ మరిచిపోదని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు.
రేణుకపై వెంకయ్య ఛలోక్తి
సభ్యుల రిటైర్మెంట్, సభలో ప్రవర్తనపై ఉద్వేగంగా సాగిన రాజ్యసభలో రేణుక చౌదరి ప్రసంగం తర్వాత నవ్వులు విరిశాయి. ‘వెంకయ్య నాయుడుకు నేను చాలా కిలోలుగా (బరువు) తెలుసు. చాలామంది నా బరువు గురించి బాధపడతారు. ఈ ఉద్యోగంలో మనం కాస్త బరువువుంటేనే నడుస్తుంది కదా!’ అని తన వీడ్కోలు ప్రసంగంలో రేణుక అన్నారు. వెంటనే జోక్యం చేసుకున్న వెంకయ్య ‘నాదో చిన్న సలహా. ముందు మీ బరువు కాస్త తగ్గించుకుని.. పార్టీ బరువును పెంచే ప్రయత్నం చేయండి’ అని సరదాగా అన్నారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.
నిబంధనలు సమీక్షిస్తాం
సభలో మితిమీరిన నిరసనలు, ఆందోళనలకు అడ్డుకట్ట వేసేందుకు సభా నిబంధనలను సమీక్షించాలని నిర్ణయించినట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య తెలిపారు. బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో సభాకార్యక్రమాలు ఒక్కరోజు కూడా జరగకపోవటంతో వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ‘రాజ్యసభ నిబంధనలను సమీక్షించాలని నిర్ణయించాను. ముసాయిదా సిద్ధమయ్యాక రూల్స్ కమిటీతో చర్చిస్తాం. అనంతరం సాధారణ చర్చకు అనుమతిస్తాం.
ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని వెంకయ్య తెలిపారు. అంతకుముందు, కాంగ్రెస్ సీనియర్ రాజ్యసభ సభ్యుడు రెహమాన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘రాజ్యసభ నియమ, నిబంధనలపై దృష్టిసారించండి. ఈ నిరసనలు ఎందుకు? చర్చనుంచి విపక్షాలు, ప్రభుత్వం ఎందుకు పారిపోతున్నాయి. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని విపక్షం భావిస్తోంది. అందుకే విపక్ష ఎంపీలు నిరసనలు తెలుపుతున్నారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment