rajya sabha members
-
వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులకు చంద్రబాబు గాలం
-
రాజ్యసభ ఎంపీగా జైశంకర్ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ సహా తొమ్మిది మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం పార్లమెంట్ హౌజ్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. 2019లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన జైశంకర్ రెండోసారి గుజరాత్ నుంచి ఇటీవల రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు బీజేపీకి చెందిన బాబూభాయ్ జెసంగ్‌భాయ్ దేశాయ్ (గుజరాత్), కేస్రీదేవ్ సింగ్ దిగి్వజయ్‌సింగ్ ఝాలా (గుజరాత్), నాగేంద్ర రాయ్ (పశి్చమ బెంగాల్)లు, ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు డెరెక్ ఒబ్రియాన్, డోలా సేన్, సుఖేందు శేఖర్ రే, ప్రకాష్ చిక్ బరైక్, సమీరుల్ ప్రమాణ స్వీకారం చేశారు. -
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ
న్యూఢిల్లీ: తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. సోమవారం సభ్యులంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని సూచించింది. వాయిదాపడేదాకా సభలోనే ఉండాలని పేర్కొంది. కీలకమైన ఢిల్లీ బిల్లుపై సోమవారం రాజ్యసభలో చర్చ, ఓటింగ్ జరిగే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ తన సభ్యులకు విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. -
రాజ్యసభ సభ్యులుగా 27 మంది ప్రమాణం
న్యూఢిల్లీ: రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన 57 మందిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్ సహా 27 మంది సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు రాజ్యాంగానికి విధేయులుగా ఉంటామంటూ వారితో ప్రమాణం చేయించారు. 10 రాష్ట్రాలకు చెందిన 27 మంది సభ్యులు తెలుగు తదితర 9 భాషల్లో ప్రమాణం చేశారు. కొత్తగా ఎన్నికైన 57 మందిలో నలుగురు ఇప్పటికే ప్రమాణం చేశారు. మిగతా వారు వర్షాకాల సమావేశాల మొదటి రోజు ప్రమాణం చేయనున్నారు. ఇంకా ప్రమాణం చేయని కొత్త సభ్యులు కూడా 18వ తేదీన జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చైర్మన్ వెంకయ్యనాయుడు అనంతరం స్పష్టతనిచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో విజేతల పేర్లను నోటిఫికేషన్లో ప్రకటించిన నాటి నుంచి వారిని సభ్యులుగానే పరిగణిస్తామన్నారు. సభా కార్యక్రమాలు, కమిటీల సమావేశాల్లో పాల్గొనేందుకు మాత్రం ప్రమాణం చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. తాజాగా ప్రమాణం చేసిన వారిలో కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేశ్, వివేక్ కె.తన్ఖా, ముకుల్ వాస్నిక్‌తోపాటు బీజేపీ నుంచి సురేంద్ర సింగ్ నాగర్, కె.లక్ష్మణ్, లక్ష్మీకాంత్ వాజ్‌పేయి తదితర 18 మంది ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న గోయల్ -
రాజ్యసభలో వంద దాటిన ఎన్డీయే బలం
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి సహా 9 మంది సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికవడంతో రాజ్యసభలో ఎన్డీయే బలం 100 దాటింది. ప్రధాన విపక్షం కాంగ్రెస్ సభ్యుల సంఖ్య అత్యల్పంగా 38కి పడిపోయింది. తాజా విజయాలతో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 92కి చేరింది. మిత్రపక్షం జేడీయూకి ఎగువ సభలో ఐదుగురు సభ్యులున్నారు. వీరు కాకుండా, మిత్రపక్షాలు ఆర్పీఐ–అఠావలే, అసోం గణపరిషత్, మిజో నేషనల్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, పీఎంకే, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్లకు ఒక్కొక్కరు చొప్పున రాజ్యసభ సభ్యులున్నారు. దీంతో ఎగువ సభలో ఎన్డీయే బలం 104కి చేరింది. ఇవి కాకుండా, నలుగురు నామినేటెడ్ సభ్యుల మద్దతు కూడా ప్రభుత్వానికి లభిస్తుంది. అలాగే, కీలక బిల్లుల ఆమోదానికి, అవసరమైనప్పుడు అంశాలవారీగా ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలు కొన్ని ఉన్నాయి. వాటిలో అన్నాడీఎంకేకు 9 మంది, బీజేడీకి 9 మంది సభ్యులు ఉన్నారు. ఇన్నాళ్లు రాజ్యసభలో కీలక, ప్రతిష్టాత్మక బిల్లుల ఆమోదానికి ఇబ్బంది పడిన ప్రభుత్వానికి తాజా విజయాలతో ఆ సమస్య తొలగనుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 242. యూపీ, ఉత్తరాఖండ్‌ల్లో జరిగిన తాజా ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 3 స్థానాలను, బీఎస్పీ 1 స్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం యూపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో బీజేపీకి చెందిన నీరజ్ శేఖర్, అరుణ్ సింగ్, గీతా షాఖ్య, హరిద్వార్ దూబే, బ్రిజ్‌లాల్, బీఎల్ వర్మ, సీమా ద్వివేదీ ఉన్నారు. ఎస్పీ నుంచి రామ్‌గోపాల్ యాదవ్, బీఎస్పీ నుంచి రామ్‌జీ గౌతమ్ కూడా ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్ నుంచి బీజేపీ తరఫున నరేశ్ బస్వాల్ ఎన్నికయ్యారు. -
రాజ్యసభ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం వాయిదా
న్యూఢిల్లీ: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన 37 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు వెల్లడించారు. రాజ్యసభకు 55 సీట్లు ఖాళీ కాగా 37 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ‘ప్రమాణస్వీకారానికి గాను నూతనంగా ఎన్నికైన సభ్యులను లాక్డౌన్ ఎత్తివేసే వరకు వేచి ఉండాల్సిందిగా కోరుతున్నాం’ అని రాజ్యసభ చైర్మన్ ఒక అడ్వైజరీలో సూచించారు. కొత్తగా ఎన్నికైన వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన జీతభత్యాలన్నీ వారు ఎన్నికైనట్లు ప్రకటించిన నాటి నుంచి వర్తిస్తాయని అధికారులు తెలిపారు. నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేసి సభలో తన స్థానంలో కూర్చోవాలి. అయితే, ఇందుకు కాలపరిమితి అంటూ ఏదీ లేదు. -
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులపై ఉత్కంఠ
-
గుంటూరు జిల్లాకు జాక్‌పాట్
-
బీజేపీలోకి బాబు కోవర్టులు!
సాక్షి, అమరావతి: ఓవైపు ఎన్నికల్లో ఘోర పరాజయం.. మరోవైపు వెంటాడుతున్న కేసుల భయంతో టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సరికొత్త రాజకీయ నాటకానికి తెరతీశారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురిని తన కోవర్టులుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వ్యూహాత్మకంగా పంపించారు. అదీ చంద్రబాబుకు వ్యక్తిగతంగా అత్యంత సన్నిహి తులైన ఎంపీలే బీజేపీలో చేరడం గమనార్హం. కేసుల నుంచి తనను కాపాడేందుకే చంద్రబాబు సొంత మనుషులను పక్కా వ్యూహంతో బీజేపీలోకి పంపారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా సాగించిన తన అవినీతి వ్యవహారాలపై విచారణ జరుగుతుందని ఆయన బెంబేలెత్తుతున్నారు. దీంతో తన మనుషులు బీజేపీలో ఉండటం అవసరమని గ్రహించి పక్కాగా కథ నడిపించారు. అయితే చంద్రబాబు రాజకీయ పన్నాగం బెడిసికొట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించు కుంది. తన స్వార్థం కోసం పార్టీ పుట్టి ముంచా రని టీడీపీ నేతలు, శ్రేణులు ఆయనపై మండిప డుతున్నాయి. గురువారం కాకినాడలో సమావేశమైన కాపు నేతలు తాజా పరిణామాలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మరోసారి సమావేశమై తమ దారి తాము చూసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. నావాళ్లు బీజేపీలో ఉండాలి... అధికారం కోల్పోవడంతో చంద్రబాబుకు కేసుల భయం పట్టుకుంది. అవినీతి వ్యవహారాలు ఆయన్ను వెంటాడుతున్నాయి. ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై నివేదిక తెప్పించుకుంది. తనతోపాటు తన కుమారుడు లోకేశ్‌పై కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయని చంద్రబాబుకు స్పష్టత రావడంతో బెంబేలెత్తారు. చంద్రబాబు అంచ నాలకు మించి రాష్ట్రంలో వైఎస్సార్సీపీ, కేంద్రంలో బీజేపీ ఏకపక్షంగా ఘన విజయం సాధించాయి. దాంతో ఇక బీజేపీ తో సంబంధాల పునరుద్ధరణ సాధ్యం కాదని గుర్తించిన బాబు ప్రత్యామ్నాయ మార్గంగా వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితులను బీజేపీలో చేర్పించాలని నిర్ణయించారు. అందుకే ఆ నలుగురు... యలమంచిలి వెంకట సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్ చంద్రబాబుకు వ్యక్తిగతంగా సన్నిహితులు. బీజేపీలో తన కోవర్టులుగా ఉండేందుకు చంద్రబాబు వారిని పక్కాగా ఎంపిక చేసుకున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల వ్యాపార, ఆర్థిక వ్యవహారాలన్నీ చంద్రబాబుకు బినామీలుగానే చేశారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 2010కు ముందు వారి గురించి రాష్ట్రంలో పెద్దగా తెలీదు. మరోవైపు గరికపాటి మోహన్‌రావు పూర్తిగా చంద్రబాబు తరపున రాజకీయ వ్యవహారాలు నెరుపుతుంటారు. లోకేశ్‌ను ‘తగిన విధంగా’ ప్రసన్నం చేసుకోవడం ద్వారానే టీజీ వెంకటేశ్ రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ నలుగురు వ్యాపారవేత్తలు కావడం, వారికి వ్యాపారాల పరంగా ఇబ్బందులు, ఆర్థిక నేరాల కేసులు ఎదుర్కొంటుండటం గమనార్హం. అందుకే ఆ నలుగురినే చంద్రబాబు ఎంపిక చేసి మరీ బీజేపీలోకి పంపించారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక తన చేతికి మట్టి అంటకుండా అన్నట్టుగా టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరికకు ముహుర్తాన్ని కూడా చంద్రబాబు పక్కాగానే నిర్ణయించారనేది స్పష్టమవుతోంది. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లిన వెంటనే ఆ నలుగురు ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. తనకు అత్యంత సన్నిహితులైన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరే సమయంలో తాను దేశంలో ఉండకూడదని చంద్రబాబు ముందస్తుగానే నిర్ణయించుకున్నారని, ప్రణాళిక ప్రకారమే చేరిక వ్యవహారం కొనసాగిందని టీడీపీ నాయకులు, శ్రేణులు కూడా అభిప్రాయపడుతుండటం గమనార్హం. వచ్చే నెలలో భేటీ అనంతరం కార్యాచరణ... తిరుగులేని ప్రజాదరణ ఉన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూకుడు, పనితీరు చూస్తుంటే మరో 10 – 15 ఏళ్ల వరకు ఆయన అధికారంలో ఉండటం ఖాయమని సమావేశంలో పాల్గొన్న నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీని నమ్ముకుని తాము మునగడం కంటే మరోదారి చూసుకోవాలని తీర్మానించారని తెలిసింది. దీనిపై కార్యకర్తల అభిప్రాయాలు సేకరించాలని అభిప్రాయానికి వచ్చారు. సమావేశానికి హాజరు కాని మరికొందరు నేతలను కూడా పిలిచి వచ్చే నెలలో మరోసారి భేటీ అనంతరం రాజకీయ కార్యాచరణ ప్రకటించాలని టీడీపీ కాపు నేతలు భావిస్తున్నారు. ‘‘బాస్ చెప్పినట్లే చేశాం...’’ చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలసి యూరప్ పర్యటకు బుధవారం అలా వెళ్లారో లేదో... ఇటువైపు టీడీపీ ఎంపీలు నలుగురు బీజేపీలో చేరుతున్నట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. టీడీపీ అనుకూల మీడియాలో కూడా తాము అనుకున్న విధంగా కథనాలు వచ్చేలా జాగ్రత్త పడ్డారు. మరోవైపు పార్లమెంటులో కీలక స్థానంలో ఉన్న ఓ నేతతో దీనిపై ముందస్తుగానే చంద్రబాబు మంతనాలు జరిపారని తెలుస్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తన సన్నిహితుడు ఇందుకు సహకరించారు. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేయకుండా చంద్రబాబు ముందే కట్టడి చేశారు. ఇక బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు తమ సన్నిహితుల వద్ద చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాయలసీమకు చెందిన ఓ నేతను మాజీ మంత్రి ఒకరు సంప్రదించగా ‘బాస్ చెప్పినట్టే చేశాం. అక్కడ ఉన్నా మేం ఇక్కడి మనుషులమే కదా.. అంతా అనుకున్నట్లే జరుగుతోంది’ అని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం. గత కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మరో నేత మాట్లాడుతూ ‘కేసులు బిగుసుకోకుండా చూసుకోవాలి... అందుకే అక్కడికి వెళ్తున్నాం... అన్ని అనుకున్నట్లుగా జరిగితే మళ్లీ నాలుగేళ్లకు వెనక్కి వస్తాం’ అని వ్యాఖ్యానించారని తెలిసింది. కాకినాడలో గురువారం సమావేశమైన టీడీపీ కాపు నేతల సమావేశంలో ఈ అంశంపై వాడీవేడీ చర్చ సాగింది. చంద్రబాబు తీరుపై నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారని సమాచారం. -
టీడీపీని వీడే యోచనలో 5గురు రాజ్యసభ సభ్యులు
-
మంచి అవకాశం కోల్పోయారు!
న్యూఢిల్లీ: నిరసనలు, ఆందోళనల కారణంగా చరిత్రాత్మక అంశాలపై చర్చించే అవకాశాన్ని రాజ్యసభ సభ్యులు కోల్పోయారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ వంటి కీలకాంశాలపై సభలో చర్చ జరగకపోవటం దురదృష్టకరమన్నారు. పదవీకాలం ముగిసిన రాజ్యసభ సభ్యుల వీడ్కోలు చర్చలో ప్రధాని ప్రసంగించారు. 17 రాష్ట్రాలకు చెందిన దాదాపు 60 మంది రాజ్యసభ ఎంపీల (నామినేటెడ్ కలుపుకుని) సభ్యత్వం త్వరలో ముగియనుంది. ఇందులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, ప్రముఖ నటుడు చిరంజీవి, బాలీవుడ్ నటి రేఖ, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మాజీ అటార్నీ జనరల్ కే పరాశరన్, భారత హాకీ మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ.. సహా పలువురు ప్రముఖులున్నాయి. లోక్‌సభ, రాజ్యసభ వేర్వేరు: మోదీ పార్లమెంటులో కొందరు సభ్యుల నిరసనల కారణంగా ప్రజలకు అవసరమైన కీలకాంశాలపై చర్చ జరగటం లేదని మోదీ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ సహా పలు ముఖ్యమైన బిల్లులపై చర్చ జరగలేదని ఆయన గుర్తుచేశారు. సభ సజావుగా జరగటంలో విపక్షంతోపాటు ప్రభుత్వం పాత్ర కూడా కీలకమన్నారు. ‘లోక్‌సభలో ఏం జరుగుతుందో.. అదే రాజ్యసభలో జరగాల్సిన అవసరం లేదు. చరిత్రాత్మక చట్టాలపై జరిగిన చర్చలో భాగస్వాములు కాలేకపోయామని 10–20 ఏళ్ల తర్వాత మనకు అర్థమవుతుంది’ అని మోదీ తెలిపారు. కీలకమైన, క్లిష్టమైన సమయాల్లో.. సభను సజావుగా నడిపించటంలో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ చేసిన కృషిని సభ ఎన్నటికీ మరిచిపోదని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. రేణుకపై వెంకయ్య ఛలోక్తి సభ్యుల రిటైర్మెంట్, సభలో ప్రవర్తనపై ఉద్వేగంగా సాగిన రాజ్యసభలో రేణుక చౌదరి ప్రసంగం తర్వాత నవ్వులు విరిశాయి. ‘వెంకయ్య నాయుడుకు నేను చాలా కిలోలుగా (బరువు) తెలుసు. చాలామంది నా బరువు గురించి బాధపడతారు. ఈ ఉద్యోగంలో మనం కాస్త బరువువుంటేనే నడుస్తుంది కదా!’ అని తన వీడ్కోలు ప్రసంగంలో రేణుక అన్నారు. వెంటనే జోక్యం చేసుకున్న వెంకయ్య ‘నాదో చిన్న సలహా. ముందు మీ బరువు కాస్త తగ్గించుకుని.. పార్టీ బరువును పెంచే ప్రయత్నం చేయండి’ అని సరదాగా అన్నారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి. నిబంధనలు సమీక్షిస్తాం సభలో మితిమీరిన నిరసనలు, ఆందోళనలకు అడ్డుకట్ట వేసేందుకు సభా నిబంధనలను సమీక్షించాలని నిర్ణయించినట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య తెలిపారు. బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో సభాకార్యక్రమాలు ఒక్కరోజు కూడా జరగకపోవటంతో వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ‘రాజ్యసభ నిబంధనలను సమీక్షించాలని నిర్ణయించాను. ముసాయిదా సిద్ధమయ్యాక రూల్స్ కమిటీతో చర్చిస్తాం. అనంతరం సాధారణ చర్చకు అనుమతిస్తాం. ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని వెంకయ్య తెలిపారు. అంతకుముందు, కాంగ్రెస్ సీనియర్ రాజ్యసభ సభ్యుడు రెహమాన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘రాజ్యసభ నియమ, నిబంధనలపై దృష్టిసారించండి. ఈ నిరసనలు ఎందుకు? చర్చనుంచి విపక్షాలు, ప్రభుత్వం ఎందుకు పారిపోతున్నాయి. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని విపక్షం భావిస్తోంది. అందుకే విపక్ష ఎంపీలు నిరసనలు తెలుపుతున్నారు’ అని పేర్కొన్నారు. -
‘రాజకీయ నాయకులు రిటైర్మెంట్ కోరుకోరు’
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు రిటైర్మెంట్ కోరుకోరని కాంగ్రెస్ సీనియర్ నేత గులాబ్ నబి ఆజాద్ అన్నారు. ఆయన బుధవారం సభలో మాట్లాడుతూ.. రాజ్యసభ కాల పరిమితి ముగిసిన ఎంపీలను గురించి పై విధంగా వ్యాఖ్యానించారు. పదవీ కాలం ముగిసిన రాజ్యసభ సభ్యులను పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కలుస్తూనే ఉంటామని తెలిపారు. రిటైర్ అవుతున్న సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, కే.పరసరన్, దిలీప్ కుమార్ టిర్కీ, సచిన్ టెండూల్కర్, కురియన్ల పదవీ కాలం నేటితో ముగియనున్నది. -
కేంద్ర సహకారం లేదు: డీఎస్
రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంత్‌రావు సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నా కేంద్రం నుంచి ఆశించిన సహకారం లభించడం లేదని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ చైర్మన్ హమీద్ అన్సారీ సమక్షంలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశాను. మేమందరం ఒక పట్టుదలతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వెయ్యి రూపాయల పెన్షన్, సన్న బియ్యం.. ఇంకా ఎన్నెన్నో పథకాలు అమలవుతున్నాయి. లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఒక కాలవ్యవధి పెట్టుకుని ముందుకు సాగుతున్నాం. అయితే కేంద్రం నుంచి ఆశించిన సహకారం రావడంలేదు. కేంద్ర ప్రోత్సాహాన్ని సంపాదించేందుకు నావంతు కృషి చేస్తా’ అని పేర్కొన్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా ‘కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అనేది పార్టీ నిర్ణయించే అంశం. ప్రజోపయోగ కార్యక్రమాల్లో మా మద్దతు తప్పకుండా ఉంటుంది..’ అని అన్నారు. డీఎస్‌తో పాటు వొడితెల లక్ష్మీకాంతరావు కూడా మంగళవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణకు తన వంతు కృషిచేస్తానని పేర్కొన్నారు. -
వెలుగును మింగేసిన అక్రమాల చీకట్లు!
విజయనగరం కంటోన్మెంట్: గ్రామీణ ప్రాంతాల్లో వెలుగుల కోసం లోక్ సభ, రాజ్య సభ సభ్యులు తమకు కేటాయించిన నిధుల నుంచి జిల్లాకు కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ బల్బుల ఏర్పాటులో నాసిరకం పరికరాలను వినియోగించడంతో ప్రయోజనం లేకుండా పోయింది. తరుచూ వీధిదీపాలు పాడైపోతున్నాయి. వాటిని మార్చలేక సర్పం చ్‌లు అవస్థలుపడుతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజ్యసభ సభ్యులు జిల్లాకు నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యురాలు రత్నాబాయి కూడా వీధిలైట్ల ఏర్పాటుకు జిల్లాకు రూ.1.25 కోట్లు కేటాయించారు. ఇందులో రామభద్రపురం మండలంలోని 22 గ్రామాలకు రూ.20 లక్షలు, గజపతినగరం, బాడంగి, దత్తిరాజేరు మండలాల్లోని 44 గ్రామాలకు రూ.30 లక్షలు, సాలూరు మండలంలోని 16 గ్రామాలకు రూ.25 లక్షలు కేటాయించారు. జామి, గంట్యాడ, మెంటాడ మండలాల్లోని 32 గ్రామాలకు రూ.50 లక్షలు కేటాయించారు. ఈ సొమ్ముతో ఆయా మండలాల్లో వీధిదీపాలు ఏర్పాటు చేశారు. ఈ నిధులతో చాలా వరకూ ట్యూబ్ లైట్లను వేయగా, చివర్లో కొన్ని గ్రామాలకు మాత్రం ఇటీవలే ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. అయితే నాసిరకం పరికరాలను వినియోగించడం వల్ల అవి నిత్యం పాడైపోతున్నాయి. ఆయా మండలాల అధికారుల పర్యవేక్షణాలోపం, కాంట్రాక్టర్ల చేతివాటం వల్ల తాము ఇప్పుడు ఇబ్బందులకు గురికావలసి వస్తోందని పలు గ్రామాల సర్పంచ్‌లు వాపోతున్నారు. ఏర్పాటు చేసిన కొత్తలోనే లైట్లు పాడైపోయాయని వారు తెలిపారు. పాడైన పరికరాలకు మరమ్మతులు చేసి మళ్లీ వేస్తున్నా.... అవి ఎక్కువ కాలం పనిచేయడం లేదని, దీంతో గ్రామాల్లో తరచూ అంధకారం అలముకుంటోందని వారు వాపోతున్నారు. నిధులున్నా ప్రయోజనం శూన్యం: ఎంపీలు వీధిలైట్లకు ఇచ్చే నిధుల్లో ఈ సారి గ్రామ పంచాయతీల నిధులతో లింకు పెట్టారు. అయితే పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా అవి ముందుకురావడం లేదు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు జిల్లాలోని పూసపాటి రేగ,భోగాపురం, చెరకుపల్లి, డెంకాడ, మెరకముడిదాం,దేవుని కణపాక తదితర గ్రామాలకు రూ.37.77లక్షలు కేటాయించారు. వీటితో ఆయా గ్రామాల్లో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఈ నిధులకు గ్రామ పంచాయతీలు 50 శాతం నిధులు జత చేసి ఖర్చు చేయాల్సిందిగా ముందుగానే ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే పంచాయతీలు 50 శాతం నిధులు సమకూర్చలేకపోతున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు కేటాయించిన ఎంపీ నిధులు వినియోగం కావడం లేదు. దీంతో నిధులు మంజూరైనా ప్రయోజనం చేకూరడం లేదు. -
10 మంది రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ
న్యూఢిల్లీ: పదిమంది రాజ్యసభ సభ్యులు తమ ఆరేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకుని మంగళవారం పదవీ విరమణ చేశారు. వీరిలో బ్రజేశ్ పాథక్ (బీఎస్పీ), అమర్ సింగ్ (స్వతంత్ర), అవ్తార్ సింగ్ కరీమ్పురి (బీఎస్పీ), మొహమ్మద్ అదీబ్ (స్వతంత్ర), రామ్ గోపాల్ యాదవ్ (ఎస్పీ), వీర్ సింగ్ (బీఎస్పీ), అఖిలేశ్ దాస్ గుప్తా, బ్రిజ్‌లాల్ ఖబ్రి, కుసుమ్ రాయ్, రాజారామ్ ఉన్నారు. రిటైరైన వారిలో ముగ్గురు తిరిగి సభ్యులుగా ఎన్నికయ్యారు. -
సీమాంధ్రకు కేకే,తెలంగాణకు కేవీపీ
రాజ్యసభ సభ్యుల లాటరీలో విడ్డూరం సాక్షి, న్యూఢిల్లీ: లాటరీ ద్వారా రాజ్యసభ సభ్యులను శుక్రవారం ఇరురాష్ట్రాలకు కేటాయించారు. ఇక్కడే విచిత్రం జరిగింది. సీమాంధ్రకు చెందిన సభ్యులు కేవీపీ రామచంద్రరావు, సి.ఎం.రమేశ్‌లు తెలంగాణకు వెళ్లారు. తెలంగాణకు చెందిన కె.కేశవరావు(కేకే), ఎం.ఎ.ఖాన్, దేవేందర్‌గౌడ్, రేణుకాచౌదరి సీమాంధ్ర ఖాతాలోకి వచ్చారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి 18మంది రాజ్యసభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన ప్రకారం ఈ సభ్యులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 7ః11 నిష్పత్తిలో కేటాయించాలి. ఈ చట్టం మొదటి షెడ్యూల్లోని 13వ సెక్షన్ ప్రకారం సభ్యుల ను పదవీకాలం ముగిసే సమయం ప్రాతిపదికన మూడుగా విభజించి, ఆయా బృందాల్లోని సభ్యులను ఇరు రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉంది. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం పార్లమెంటులో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సమక్షంలో లాటరీ ద్వారా సభ్యులను కేటాయించారు. 2016లో పదవీవిరమణ పొందే వారిలో.. ముందుగా 2016 జూన్ 21న పదవీ కాలం ముగిసే ఆరుగురు సభ్యుల్లో ఇద్దరిని తెలంగాణకు కేటాయిం చాల్సి ఉంది. డ్రా ద్వారా గుండు సుధారాణి, వి.హనుమంతరావును తెలంగాణకు కేటాయించారు. జేడీ శీలం, జైరాం రమేశ్, వై.ఎస్.చౌదరి ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తారు. వీరితో పాటు ఎన్.జనార్దన్‌రెడ్డి (ఈయన మరణించడంతో ప్రస్తుతం సీటు ఖాళీగా ఉంది) ప్రాతినిథ్యం వహించిన సీటు ఆంధ్రప్రదేశ్‌కే ఉంటుంది. ఈ సీటుకు త్వరలో ఎన్నిక జరగనుంది. 2018లో పదవీ కాలం ముగిసే సభ్యులు.. 2018 ఏప్రిల్ 2న పదవీ కాలం ముగిసే సభ్యుల్లో ముగ్గురిని తెలంగాణ కేటాయించాల్సి ఉంది. వీరిలో లాటరీ ద్వారా రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, సి.ఎం. రమేశ్‌లను తెలంగాణకు కేటాయించారు. మిగిలిన వారిలో చిరంజీవి, రేణుకాచౌదరి, దేవేందర్‌గౌడ్‌లను సీమాంధ్రకు కేటాయించినట్టుగా పరిగణించాల్సి ఉంటుంది. అంటే తెలంగాణకు చెందిన దేవేందర్‌గౌడ్, రేణుకాచౌదరి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. సీమాంధ్రకు చెందిన సి.ఎం.రమేశ్ తెలంగాణకు వచ్చారు. ఈ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహించనున్న దేవేందర్‌గౌడ్, రేణుకాచౌదరిల పదవీకాలం ముగిశాక.. వారి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణకు ప్రాతినిథ్యం వహించనున్న సి.ఎం.రమేశ్ పదవీకాలం ముగి శాక తెలంగాణ వారిని సభ్యుడిగా ఎన్నుకొంటారు. 2020లో..:2020 ఏప్రిల్ 2న పదవీకాలం ముగిసే సభ్యుల నుంచి ఇద్దరిని తెలంగాణకు కేటాయించాల్సి ఉంది. ఇందులో లాటరీ ద్వారా కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్‌రావులను తెలంగాణకు కేటాయిం చారు. మిగిలిన సభ్యులైన టి.సుబ్బిరామిరెడ్డి, ఎం.ఎ. ఖాన్, కె.కేశవరావు, తోట సీతారామలక్ష్మిలను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినట్టుగా పరిగణించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేవీపీ తెలంగాణకు రాగా, తెలంగాణకు చెందిన కె.కేశవరావు, ఎం.ఎ.ఖాన్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి వస్తోంది. ఇక్కడ కూడా సభ్యుల పదవీ కాలం ముగిశాక సొంత రాష్ట్రాల నుంచి సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కేంద్రం పరిష్కారం! సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుల లాటరీ చిక్కులకు పరిష్కారం లభించేలా ఉంది! సభ్యుల పరస్పర అంగీకారంతో ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రానికి సంబంధించిన నిధులను ఖర్చు చేసుకునే వెసులుబాటును కల్పించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దీనికితోడు ఎంపీగా వారికి సంక్రమించే అన్ని అధికారాలు, ప్రోటోకాల్‌ను కూడా సొంత రాష్ట్రానికి వినియోగించుకునే విషయంలో సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్రం త్వరలో ఉత్తర్వులు జారీ చేసేందుకు అంగీకరించింది. అయితే లాటరీ ద్వారా తెలంగాణకు చెందిన నలుగురు ఎంపీలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించగా, సీమాంధ్రకు చెందిన ఇద్దరు ఎంపీలను మాత్రమే తెలంగాణకు కేటాయించడంతో పరస్పర అంగీకారం ఎలా సాధ్యమనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ నలుగురి మధ్య అంగీకారం కుది రినా మరో ఇద్దరు తెలంగాణ ఎంపీల పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. సాంకేతికంగా పొరుగు రాష్ట్రానికి కేటాయించినప్పటికీ ఎంపీ లాడ్స్ నిధులను తెలంగాణలోనే ఖర్చు చేసుకునేందుకు, ఇతరత్రా అధికారాలను వినియోగించుకునేందుకు అనుమతినిస్తూ కేంద్రం అంగీకరించినట్లు సమాచారం. -
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు
-
రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు రాజ్యసభ స్థానాలతోపాటు దేశవ్యాప్తంగా మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్ కమిషన్ మంగళవారం ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ మంగళవారమే ప్రారంభం కాగా.. తొలిరోజు రాష్ట్రం నుంచి ఒక్కటి కూడా దాఖలు కాలేదు. ఈ నెల 28 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. 29న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 31 వరకు గడువు ఉంది. ఏకగ్రీవం లేని స్థానాలకు పోలింగ్ ఫిబ్రవరి 7న జరుగుతుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో ఆరు స్థానాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, ఏడో అభ్యర్థి రంగంలో నిలిస్తే పోలింగ్ నిర్వహించాల్సి వస్తుంది. -
శిక్ష పడితే వెంటనే వివరాలు ఇవ్వండి
సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో సీఎస్ ఉత్తర్వులు జారీ ప్రజాప్రతినిధులకు ఏ కోర్టు శిక్ష విధించినా 24 గంటల్లో రిపోర్టు ఆ వివరాలను డీజీపీ రాష్ట్ర సీఈవోకు పంపాలి పార్లమెంట్, అసెంబ్లీ స్పీకర్లకు తెలియజేయాలి ప్రతి నెల 15న కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర సీఈవో నివేదిక సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఎవరికైనా న్యాయస్థానాలు శిక్షలు విధిస్తే ఆ వివరాలను వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏ సభ్యుడికైనా శిక్ష పడితే వెంటనే ఆ సభ్యుడిపై అనర్హత వేటు వేయడానికి అనుగుణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఏ న్యాయస్థానాలైనా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై క్రిమినల్ కేసుల్లో గానీ, ఇతర కేసుల్లో గానీ శిక్షలు విధిస్తే ఆ వివరాలను వెంటనే నోడల్ అధికారి అయిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో)కి తెలియజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి నమూనా పత్రాన్ని కూడా ఈ ఉత్తర్వులకు జత చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పేరు.. ఏ న్యాయస్థానం శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఏ చట్టం కింద ఏ సెక్షన్ కింద శిక్ష విధించారు.. శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు తేదీ.. శిక్ష వివరాలను వెల్లడించాలని నమూనా పత్రంలో పేర్కొన్నారు. న్యాయస్థానాలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఎవరికైనా శిక్ష విధిస్తే ఆ వివరాలను డీజీపీ 24 గంటల్లోగా ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల నుంచి తెప్పించుకుని సీఈవోకు తెలియజేయాలని స్పష్టం చేశారు. కొన్ని కోర్టుల్లో సభ్యులకు శిక్ష పడినా పరిశీలనకు రావడం లేదని, ఈ నేపథ్యంలో తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. నేరపూరిత కేసుల్లో సభ్యులు అరెస్ట్ అయితే ఆ వివరాలను వెంటనే పార్లమెంట్, అసెంబ్లీ స్పీకర్లకు, రాజ్యసభ, శాసనమండలి చైర్మన్లకు తెలియజేయాలని.. ఒకవేళ బెయిల్‌పై విడుదలైతే ఆ వివరాలను కూడా తెలియజేయాలని చెప్పారు. ఏదైనా కేసుల్లో సభ్యులకు శిక్ష పడితే ఆ వివరాలను న్యాయస్థానాల్లోని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 24 గంటల్లోగా నోడల్ అధికారైన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెలియజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నోడల్ అధికారైన సీఈవో కేసుల వివరాలను ప్రతి నెల 15న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలనకు తీసుకెళ్లి, ఆయన ఆమోదం తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపాలని చెప్పారు.