న్యూఢిల్లీ: రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన 57 మందిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్ సహా 27 మంది సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు రాజ్యాంగానికి విధేయులుగా ఉంటామంటూ వారితో ప్రమాణం చేయించారు. 10 రాష్ట్రాలకు చెందిన 27 మంది సభ్యులు తెలుగు తదితర 9 భాషల్లో ప్రమాణం చేశారు.
కొత్తగా ఎన్నికైన 57 మందిలో నలుగురు ఇప్పటికే ప్రమాణం చేశారు. మిగతా వారు వర్షాకాల సమావేశాల మొదటి రోజు ప్రమాణం చేయనున్నారు. ఇంకా ప్రమాణం చేయని కొత్త సభ్యులు కూడా 18వ తేదీన జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చైర్మన్ వెంకయ్యనాయుడు అనంతరం స్పష్టతనిచ్చారు.
రాజ్యసభ ఎన్నికల్లో విజేతల పేర్లను నోటిఫికేషన్‌లో ప్రకటించిన నాటి నుంచి వారిని సభ్యులుగానే పరిగణిస్తామన్నారు. సభా కార్యక్రమాలు, కమిటీల సమావేశాల్లో పాల్గొనేందుకు మాత్రం ప్రమాణం చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. తాజాగా ప్రమాణం చేసిన వారిలో కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేశ్, వివేక్ కె.తన్‌ఖా, ముకుల్ వాస్నిక్‌తోపాటు బీజేపీ నుంచి సురేంద్ర సింగ్ నాగర్, కె.లక్ష్మణ్, లక్ష్మీకాంత్ వాజ్‌పేయి తదితర 18 మంది ఉన్నారు.
ప్రమాణ స్వీకారం చేస్తున్న గోయల్
Comments
Please login to add a commentAdd a comment