విజయనగరం కంటోన్మెంట్: గ్రామీణ ప్రాంతాల్లో వెలుగుల కోసం లోక్ సభ, రాజ్య సభ సభ్యులు తమకు కేటాయించిన నిధుల నుంచి జిల్లాకు కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ బల్బుల ఏర్పాటులో నాసిరకం పరికరాలను వినియోగించడంతో ప్రయోజనం లేకుండా పోయింది. తరుచూ వీధిదీపాలు పాడైపోతున్నాయి. వాటిని మార్చలేక సర్పం చ్‌లు అవస్థలుపడుతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజ్యసభ సభ్యులు జిల్లాకు నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యురాలు రత్నాబాయి కూడా వీధిలైట్ల ఏర్పాటుకు జిల్లాకు రూ.1.25 కోట్లు కేటాయించారు. ఇందులో రామభద్రపురం మండలంలోని 22 గ్రామాలకు రూ.20 లక్షలు, గజపతినగరం, బాడంగి, దత్తిరాజేరు మండలాల్లోని 44 గ్రామాలకు రూ.30 లక్షలు, సాలూరు మండలంలోని 16 గ్రామాలకు రూ.25 లక్షలు కేటాయించారు. జామి, గంట్యాడ, మెంటాడ మండలాల్లోని 32 గ్రామాలకు రూ.50 లక్షలు కేటాయించారు.
ఈ సొమ్ముతో ఆయా మండలాల్లో వీధిదీపాలు ఏర్పాటు చేశారు. ఈ నిధులతో చాలా వరకూ ట్యూబ్ లైట్లను వేయగా, చివర్లో కొన్ని గ్రామాలకు మాత్రం ఇటీవలే ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. అయితే నాసిరకం పరికరాలను వినియోగించడం వల్ల అవి నిత్యం పాడైపోతున్నాయి. ఆయా మండలాల అధికారుల పర్యవేక్షణాలోపం, కాంట్రాక్టర్ల చేతివాటం వల్ల తాము ఇప్పుడు ఇబ్బందులకు గురికావలసి వస్తోందని పలు గ్రామాల సర్పంచ్‌లు వాపోతున్నారు. ఏర్పాటు చేసిన కొత్తలోనే లైట్లు పాడైపోయాయని వారు తెలిపారు. పాడైన పరికరాలకు మరమ్మతులు చేసి మళ్లీ వేస్తున్నా.... అవి ఎక్కువ కాలం పనిచేయడం లేదని, దీంతో గ్రామాల్లో తరచూ అంధకారం అలముకుంటోందని వారు వాపోతున్నారు.
నిధులున్నా ప్రయోజనం శూన్యం: ఎంపీలు వీధిలైట్లకు ఇచ్చే నిధుల్లో ఈ సారి గ్రామ పంచాయతీల నిధులతో లింకు పెట్టారు. అయితే పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా అవి ముందుకురావడం లేదు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు జిల్లాలోని పూసపాటి రేగ,భోగాపురం, చెరకుపల్లి, డెంకాడ, మెరకముడిదాం,దేవుని కణపాక తదితర గ్రామాలకు రూ.37.77లక్షలు కేటాయించారు. వీటితో ఆయా గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఈ నిధులకు గ్రామ పంచాయతీలు 50 శాతం నిధులు జత చేసి ఖర్చు చేయాల్సిందిగా ముందుగానే ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే పంచాయతీలు 50 శాతం నిధులు సమకూర్చలేకపోతున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు కేటాయించిన ఎంపీ నిధులు వినియోగం కావడం లేదు. దీంతో నిధులు మంజూరైనా ప్రయోజనం చేకూరడం లేదు.
వెలుగును మింగేసిన అక్రమాల చీకట్లు!
Published Sun, Jul 12 2015 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM
Advertisement