సీమాంధ్రకు కేకే,తెలంగాణకు కేవీపీ
రాజ్యసభ సభ్యుల లాటరీలో విడ్డూరం
సాక్షి, న్యూఢిల్లీ: లాటరీ ద్వారా రాజ్యసభ సభ్యులను శుక్రవారం ఇరురాష్ట్రాలకు కేటాయించారు. ఇక్కడే విచిత్రం జరిగింది. సీమాంధ్రకు చెందిన సభ్యులు కేవీపీ రామచంద్రరావు, సి.ఎం.రమేశ్‌లు తెలంగాణకు వెళ్లారు. తెలంగాణకు చెందిన కె.కేశవరావు(కేకే), ఎం.ఎ.ఖాన్, దేవేందర్‌గౌడ్, రేణుకాచౌదరి సీమాంధ్ర ఖాతాలోకి వచ్చారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి 18మంది రాజ్యసభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన ప్రకారం ఈ సభ్యులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 7ః11 నిష్పత్తిలో కేటాయించాలి. ఈ చట్టం మొదటి షెడ్యూల్‌లోని 13వ సెక్షన్ ప్రకారం సభ్యుల ను పదవీకాలం ముగిసే సమయం ప్రాతిపదికన మూడుగా విభజించి, ఆయా బృందాల్లోని సభ్యులను ఇరు రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉంది. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం పార్లమెంటులో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సమక్షంలో లాటరీ ద్వారా సభ్యులను కేటాయించారు.
2016లో పదవీవిరమణ పొందే వారిలో..
ముందుగా 2016 జూన్ 21న పదవీ కాలం ముగిసే ఆరుగురు సభ్యుల్లో ఇద్దరిని తెలంగాణకు కేటాయిం చాల్సి ఉంది. డ్రా ద్వారా గుండు సుధారాణి, వి.హనుమంతరావును తెలంగాణకు కేటాయించారు. జేడీ శీలం, జైరాం రమేశ్, వై.ఎస్.చౌదరి ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తారు. వీరితో పాటు ఎన్.జనార్దన్‌రెడ్డి (ఈయన మరణించడంతో ప్రస్తుతం సీటు ఖాళీగా ఉంది) ప్రాతినిథ్యం వహించిన సీటు ఆంధ్రప్రదేశ్‌కే ఉంటుంది. ఈ సీటుకు త్వరలో ఎన్నిక జరగనుంది.
2018లో పదవీ కాలం ముగిసే సభ్యులు..
2018 ఏప్రిల్ 2న పదవీ కాలం ముగిసే సభ్యుల్లో ముగ్గురిని తెలంగాణ కేటాయించాల్సి ఉంది. వీరిలో లాటరీ ద్వారా రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, సి.ఎం. రమేశ్‌లను తెలంగాణకు కేటాయించారు. మిగిలిన వారిలో చిరంజీవి, రేణుకాచౌదరి, దేవేందర్‌గౌడ్‌లను సీమాంధ్రకు కేటాయించినట్టుగా పరిగణించాల్సి ఉంటుంది. అంటే తెలంగాణకు చెందిన దేవేందర్‌గౌడ్, రేణుకాచౌదరి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. సీమాంధ్రకు చెందిన సి.ఎం.రమేశ్ తెలంగాణకు వచ్చారు. ఈ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహించనున్న దేవేందర్‌గౌడ్, రేణుకాచౌదరిల పదవీకాలం ముగిశాక.. వారి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణకు ప్రాతినిథ్యం వహించనున్న సి.ఎం.రమేశ్ పదవీకాలం ముగి శాక తెలంగాణ వారిని సభ్యుడిగా ఎన్నుకొంటారు.
2020లో..:2020 ఏప్రిల్ 2న పదవీకాలం ముగిసే సభ్యుల నుంచి ఇద్దరిని తెలంగాణకు కేటాయించాల్సి ఉంది. ఇందులో లాటరీ ద్వారా కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్‌రావులను తెలంగాణకు కేటాయిం చారు. మిగిలిన సభ్యులైన టి.సుబ్బిరామిరెడ్డి, ఎం.ఎ. ఖాన్, కె.కేశవరావు, తోట సీతారామలక్ష్మిలను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినట్టుగా పరిగణించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేవీపీ తెలంగాణకు రాగా, తెలంగాణకు చెందిన కె.కేశవరావు, ఎం.ఎ.ఖాన్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి వస్తోంది. ఇక్కడ కూడా సభ్యుల పదవీ కాలం ముగిశాక సొంత రాష్ట్రాల నుంచి సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
కేంద్రం పరిష్కారం!
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుల లాటరీ చిక్కులకు పరిష్కారం లభించేలా ఉంది! సభ్యుల పరస్పర అంగీకారంతో ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రానికి సంబంధించిన నిధులను ఖర్చు చేసుకునే వెసులుబాటును కల్పించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దీనికితోడు ఎంపీగా వారికి సంక్రమించే అన్ని అధికారాలు, ప్రోటోకాల్‌ను కూడా సొంత రాష్ట్రానికి వినియోగించుకునే విషయంలో సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్రం త్వరలో ఉత్తర్వులు జారీ చేసేందుకు అంగీకరించింది.
అయితే లాటరీ ద్వారా తెలంగాణకు చెందిన నలుగురు ఎంపీలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించగా, సీమాంధ్రకు చెందిన ఇద్దరు ఎంపీలను మాత్రమే తెలంగాణకు కేటాయించడంతో పరస్పర అంగీకారం ఎలా సాధ్యమనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ నలుగురి మధ్య అంగీకారం కుది రినా మరో ఇద్దరు తెలంగాణ ఎంపీల పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. సాంకేతికంగా పొరుగు రాష్ట్రానికి కేటాయించినప్పటికీ ఎంపీ లాడ్స్ నిధులను తెలంగాణలోనే ఖర్చు చేసుకునేందుకు, ఇతరత్రా అధికారాలను వినియోగించుకునేందుకు అనుమతినిస్తూ కేంద్రం అంగీకరించినట్లు సమాచారం.