హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఆపేశక్తి ఎవరికీ లేదని టీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు మండిపడ్డారు. సీమాంధ్రులు రెచ్చగొట్టినా..తెలంగాణ వాదులు శాంతియుతంగానే నిరసన తెలపాలన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రతరమైన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖరారైందని, ఇక ప్రత్యేక రాష్ట్రాన్ని ఆపేశక్తి ఎవరికీ లేదని ఆయన తెలిపారు.
కాగా, సీమాంధ్రలో పరిస్థితులు అంతకంతకూ చేయి దాట పోతుండటంతో యూపీఏ సర్కారు గందరగోళ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న పక్షంలో సీమాంధ్రలో ఉద్యమం కాంగ్రెస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఏపీ ఎన్జీవోలు, ఓయూ జేఏసీ నేతలు పోటాపోటీ నిరసనలకు సిద్ధమవుతువుతుండటంతో కాంగ్రెస్ పెద్దలు అయోమయ స్థితిలో ఉన్నారు. సెప్టెంబర్ ఏడో తేదీన ఎల్బీ స్టేడియంలో భారీగా సమైక్యాంధ్ర సభ నిర్వహించాలని ఏపీ ఎన్జీవోల సంఘం నాయకులు నిర్ణయించారు.
ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. అయితే.. అదే రోజున అదే ఎల్బీ స్టేడియం వేదిగా మరో భారీ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమని పెద్దలు చెబుతున్నా ఉద్యమ సెగ మాత్రం వారికి నిద్ర లేకుండా చేస్తుంది.