శిక్ష పడితే వెంటనే వివరాలు ఇవ్వండి
సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో సీఎస్ ఉత్తర్వులు జారీ
ప్రజాప్రతినిధులకు ఏ కోర్టు శిక్ష విధించినా 24 గంటల్లో రిపోర్టు
ఆ వివరాలను డీజీపీ రాష్ట్ర సీఈవోకు పంపాలి
పార్లమెంట్, అసెంబ్లీ స్పీకర్లకు తెలియజేయాలి
ప్రతి నెల 15న కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర సీఈవో నివేదిక
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఎవరికైనా న్యాయస్థానాలు శిక్షలు విధిస్తే ఆ వివరాలను వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏ సభ్యుడికైనా శిక్ష పడితే వెంటనే ఆ సభ్యుడిపై అనర్హత వేటు వేయడానికి అనుగుణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలోని ఏ న్యాయస్థానాలైనా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై క్రిమినల్ కేసుల్లో గానీ, ఇతర కేసుల్లో గానీ శిక్షలు విధిస్తే ఆ వివరాలను వెంటనే నోడల్ అధికారి అయిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో)కి తెలియజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి నమూనా పత్రాన్ని కూడా ఈ ఉత్తర్వులకు జత చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పేరు.. ఏ న్యాయస్థానం శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఏ చట్టం కింద ఏ సెక్షన్ కింద శిక్ష విధించారు.. శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు తేదీ.. శిక్ష వివరాలను వెల్లడించాలని నమూనా పత్రంలో పేర్కొన్నారు. న్యాయస్థానాలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఎవరికైనా శిక్ష విధిస్తే ఆ వివరాలను డీజీపీ 24 గంటల్లోగా ఎస్‌పీలు, పోలీస్ కమిషనర్ల నుంచి తెప్పించుకుని సీఈవోకు తెలియజేయాలని స్పష్టం చేశారు.
కొన్ని కోర్టుల్లో సభ్యులకు శిక్ష పడినా పరిశీలనకు రావడం లేదని, ఈ నేపథ్యంలో తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. నేరపూరిత కేసుల్లో సభ్యులు అరెస్ట్ అయితే ఆ వివరాలను వెంటనే పార్లమెంట్, అసెంబ్లీ స్పీకర్లకు, రాజ్యసభ, శాసనమండలి చైర్మన్లకు తెలియజేయాలని.. ఒకవేళ బెయిల్‌పై విడుదలైతే ఆ వివరాలను కూడా తెలియజేయాలని చెప్పారు. ఏదైనా కేసుల్లో సభ్యులకు శిక్ష పడితే ఆ వివరాలను న్యాయస్థానాల్లోని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 24 గంటల్లోగా నోడల్ అధికారైన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెలియజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నోడల్ అధికారైన సీఈవో కేసుల వివరాలను ప్రతి నెల 15న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలనకు తీసుకెళ్లి, ఆయన ఆమోదం తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపాలని చెప్పారు.