Central elections commission
-
Lok Sabha Election 2024: ఐదో విడతలో 62.2% పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడతలో 62.2 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. అత్యధికంగా పశి్చమబెంగాల్లో 78.48%, అత్యల్పంగా బిహార్‌లో 56.76% పోలింగ్ నమోదైనట్లు తెలిపింది. మే 20న 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజక వర్గాల్లో పోలింగ్ జరగడం తెలిసిందే. అయిదో విడతలో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించింది. మహిళలు 63 శాతం, పురుషులు 61.48 శాతం, థర్డ్ జెండర్ 21.96 శాతం మంది ఓటేశారని ఈసీ పేర్కొంది. -
ఎన్నికల కమిషనా.. ఎన్డీఏ కమిషనా?
సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కోడ్ ఉందన్న కారణంతో ఆపేస్తే ఆ లబ్ధిదారుల పరిస్థితేంటి? కొనసాగుతున్న పథకాలను ఆపాల్సిన పనిలేదని ఎన్నికల నిబంధనల్లో స్పష్టంగా ఉన్నా కూడా... ఎన్నికల కమిషన్ ఎందుకిలా చేస్తోంది? ఎన్డీఏ కూటమితో చంద్రబాబు నాయుడు జతకట్టినంత మాత్రాన ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రాన్ని ‘టార్గెట్’ చేయాల్సిన అవసరం లేదు కదా? ఏ రాష్ట్రానికీ వర్తించని నిబంధన ఇక్కడే ఎందుకట? పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటమనేది వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ క్రమం తప్పకుండా చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎలాంటి ఇబ్బందీ లేదు కూడా. కానీ ఎన్నికల కోడ్ సాకుగా చూపించి ఇపుడు ఏకంగా 6,95,857 మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లకుండా నిలిపేయటం దుర్మార్గం కాదా? పంట వేసుకునే సమయంలో రైతుకు అవసరమనే కదా ప్రభుత్వం రూ.847.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసింది!!. మరి ఆ సబ్సిడీని నిలిపేస్తే రైతులు ఇబ్బందులు పడరా? రైతుల ఇబ్బందులు ఈ ఎన్డీఏ కూటమికి గానీ..ఎన్నికల కమిషన్‌కు గానీ పట్టవా? ఎవరేమైపోయినా మాకు రాజకీయాలే ముఖ్యమనుకుంటే ఎలా చంద్రబాబూ? విత్తన సబ్సిడీ అందకపోతే ఎలా? నిజానికి రబీ కోతలు పూర్తి కావడంతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలు విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి విత్తన సబ్సిడీపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించటం వారికి మింగుడుపడటం లేదు. నిజానికి గతంలో మాదిరే సీజన్‌కు ముందే సబ్సిడీపై పంపిణీ కోసం 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేసి... కోడ్ నేపథ్యంలో పంపిణీకి అనుమతినివ్వాల్సిందిగా ఈసీకి అధికారులు లేఖ రాశారు. ఐదేళ్లుగా ఏ విత్తనాలు ఏయే తేదీల్లో పంపిణీ చేసారో ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏటా కోతలు పూర్తయిన వెంటనే పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామని, అదును దాటి పోయాక పంపిణీ చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని అధికారులు లేఖలో పేర్కొన్నా... ఈసీ తిరస్కరించింది. రబీ కరువు పంట నష్టం అంచనాలకూ బ్రేకు వర్షాభావ పరిస్థితుల కారణంగా రబీ సీజన్లో 84 మండలాలను కరువు మండలాలను ప్రకటిస్తూ మార్చి రెండోవారంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పంట నష్టం అంచనా వేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఈసీకి అధికారులు లేఖ రాశారు. ఇన్నాళ్లూ మిన్నకున్న ఈసీ... నష్టం అంచనాపై ఆంక్షలు విధించింది. అనుమతి ఇవ్వలేమని తేచ్చిచెప్పేసింది. దీంతో రబీ కరువు సాయం అందుతుందో లేదో అనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ‘విద్యా దీవెన’ నిధులపైనా విషమే! పేద విద్యార్ధులకు చెల్లించే ‘విద్యా దీవెన’ నిధులనూ చంద్రబాబు కూటమి నిలుపు చేయించింది. ఈసీకి పదేపదే ఫిర్యాదులు చేయటంతో... ఎన్డీఏ భాగస్వామి కనక బాబుకు అనుకూలంగానే ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిధుల చెల్లింపునూ నిలిపేసింది. నిజానికి విద్యార్థులు ఇప్పుడు కాలేజీలు మారాల్సి ఉంటుంది. విద్యా దీవెన నిధులు చెల్లిస్తే గానీ కాలేజీలు వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేమని చెబుతున్నాయి.ప్రభుత్వం ఇప్పటికే రూ.610.79 కోట్లు విడుదల చేసినా... కూటమి కుట్ర కారణంగా పేద విద్యార్దులు బయట అప్పులు చేసి కాలేజీలకు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఇన్ని దారుణాలు జరుగుతున్నా... చంద్రబాబు, పవన్ కల్యాణ్ నీరో చక్రవర్తుల మాదిరి తమాషా చూస్తున్నారు తప్ప రైతుల గురించి గానీ, విద్యార్థుల గురించి గానీ ఆలోచిస్తే ఒట్టు. ఇప్పుడు రైతులు, విద్యార్థులు అప్పుల పాలైతే నీ కళ్లు చల్లబడతాయా చంద్రబాబూ? ఈసీపై ఒత్తిళ్లు... ఎన్డీఏ భాగస్వామి కనక ఓకే నిజానికి ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన చెల్లింపులు గత ఐదేళ్ల నుంచీ అమలవుతున్నాయి. ఇవేమీ కొత్తవి కావు. లబ్దిదారుల ఎంపిక కూడా ఎప్పుడో చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక చేసిందేమీ లేదు. కొనసాగుతున్న పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదని నియమావళిలో స్పష్టంగా ఉంది. కాబట్టి వీటికి కేంద్ర ఎన్నికల సంఘం సహజంగానే అనుమతివ్వాలి. మరో చిత్రమేంటంటే మిగతా రాష్ట్రాల్లో ఇలా ఏ పథకాన్నీ అడ్డుకోవటం లేదు కూడా. ఉదాహరణకు తెలంగాణలో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు గత నెల 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 4న ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. అంతేకాదు. రైతు బంధు నిధులను విడుదల చేస్తూ సోమవారమే జీవో ఇచ్చింది. మంగళ, బుధ వారాల్లో ఇవి రైతుల ఖాతాల్లోకి పడతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు కూడా. నిజానికి 2019 ఎన్నికల్లో చూసుకున్నా... అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికలకు కేవలం మూడు రోజుల ముందు ‘పసుపు కుంకుమ’ పేరిట మూడో విడత నిధులను మహిళల ఖాతాల్లో వేశారు. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి గానీ, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి గానీ లేని నిబంధన ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే ఎందుకు వర్తింపజేస్తున్నారు? దీన్నిబట్టి చంద్రబాబు తనకు అలవాటైన కుట్రను ఎంత లోతుగా కొనసాగిస్తున్నారో... ఈసీపై తన ‘బీజేపీ మిత్రుల’ ద్వారా ఎంత ఒత్తిడి చేయిస్తున్నారో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. పింఛన్లపైనా ఇలాంటి దారుణాలే... కేంద్ర ఎన్నికల కమిషన్‌పై అటు చంద్రబాబు, బీజేపీలోని ఆయన మిత్రులు, ఎల్లో మీడియా, నిమ్మగడ్డ రమేశ్... ఇలా పచ్చ మంద మొత్తం కలిసి దారుణంగా ఒత్తిడి తెచ్చి సామాజిక పింఛన్లు తీసుకునే అవ్వా తాతలను, దివ్యాంగులను రాచిరంపాన పెట్టారు. వృద్ధులు, వికలాంగులు, వితంతవుల ఇంటికి పింఛను రాకుండా అడ్డుకుని... వాల్లను మండుటెండల్లో సచివాలయాల చుట్టూ, బ్యాంకులు చుట్టూ తిప్పుతూ కొంత మంది వృద్దులు మరణానికి కూడా కారణమయ్యిందీ ముఠా. మొదటి నెల సచివాలయాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేయగా.. ప్రతి ఊరికీ సచివాలయం ఉండటంతో వృద్ధులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ అది కూడా నచ్చని పచ్చ ముఠా... నిధుల్ని నేరుగా వారి ఖాతాల్లో వెయ్యాలని ఈసీపై ఒత్తిడి తెచ్చాయి. ఈసీ అలాగే చేయటంతో... బ్యాంకులకు వెళ్లలేక, ఏటీఎంల వద్ద ఎండల్లో నిల్చోలేక వృద్ధులు నరకయాతన అనుభవించారు. చంద్రబాబును ప్రతి ఒక్కరూ నోరారా తిట్టుకున్నారు. జనం ఆగ్రహం తమ మీదకు మళ్లుతోందని భయపడ్డ బాబు... అదంతా వైఎస్ జగన్ వల్లే అయిందంటూ తన రామోజీరావు చేత దుర్మార్గపు కథనాలు రాయించాడు. ఈ కుట్రలన్నిటికీ ప్రజలే జబాబు చెబుతారు బాబూ!!. -
అనుమానం ఉందని ఎన్నికలపై ఆదేశాలివ్వలేం
న్యూఢిల్లీ: ఈవీఎంల పనితీరుపై అనుమానం ఉందనో, వాటిని నియంత్రణలోకి తీసుకుని ఫలితాలను తలకిందులు చేయొచ్చనే ఆరోపణలతోనో ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈవీఎంలో ‘మార్పులు’ చేసే ఆస్కారం ఉందని, అందుకే బ్యాలెట్ పేపర్ విధానమే ఉత్తమం అని వాదించే వారి ఆలోచనను మార్చలేమని కోర్టు వ్యాఖ్యానించింది.ఈవీఎంలో నమోదయ్యే ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలంటూ దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషన్‌దారులు లేవనెత్తిన ప్రశ్నలపై తమ అనుమానాలను నివృత్తిచేసుకునేందుకు జడ్జీలు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికారి నితేశ్ వ్యాస్‌ను కోర్టుకు రప్పించి ఐదు ప్రశ్నలు సంధించారు. మైక్రోకంట్రోలర్లను ఎక్కడ బిగిస్తారు? వాటి ప్రోగ్రామ్‌ను మళ్లీ మార్చొచ్చా? అంటూ ప్రశ్నలు అడిగారు.బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్లలో మైక్రోకంట్రోలర్లను బిగిస్తామని, వాటి పోగ్రామ్‌ను సరిచేసేందుకు ఎవరైనా ఓపెన్ చేస్తే పనిచేయకుండాపోతాయని వ్యాస్ వివరణఇచ్చారు. ఈ వివరణతో అసిసోయేషన్ ఫర్ డెమొక్రట్రిక్ రిఫారŠమ్స్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విభేదించారు. ఎన్నికల గుర్తులను అప్లోడ్ చేసేటపుడు తప్పుడు ప్రోగామ్‌ను అప్లోడ్ చేసే ఆస్కారముందని వాదించారు. దీనిపై జడ్జీ దత్తా కలి్పంచుకుని.. ‘ మీ ఆలోచనలను మేం మార్చలేం. ఈసీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థను నియంత్రించలేం’’ అని వ్యాఖ్యానించారు. ఈవీఎంల సోర్స్ కోడ్‌ను బహిర్గతంచేయాలని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది సంతోశ్ వాదించగా కుదరదని జడ్జీ తిరస్కరించారు. -
Election Commission of India: ‘విజిల్’ ఊదేస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక సమరం వేళ ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన ‘సీ విజిల్’ యాప్‌ను ప్రజలు సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి శుక్రవారం ఉదయం వరకు ప్రజల నుంచి 79,000కు పైగా ఫిర్యాదులు అందాయి. ఇందులో 99 శాతానికిపైగా ఫిర్యాదులు పరిష్కరించామని కేంద్ర ఎన్నికల తెలిపింది. వీటిలో 89 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించినట్లు ఈసీ పేర్కొంది. 58,500 కంటే ఎక్కువ ఫిర్యాదులు (73శాతం) అక్రమ హోర్డింగ్‌లు, బ్యానర్లకు సంబంధించినవి కాగా.. 1400కు పైగా ఫిర్యాదులు నగదు, బహుమతులు, మద్యం పంపిణీకి సంబంధించినవి ఉన్నాయి. -
అసెంబ్లీ ఎన్నికలు: ఆ రెండు రాష్ట్రాల కౌంటింగ్ తేదీల్లో మార్పు
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం పోలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే తాజాగా.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ తేదీల్లో మార్పులు చేసింది సీఈసీ. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ను సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కంటే రెండు రోజుల ముందే జూన్ 2వ తేదీన చేపట్టనున్న ఈసీ వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ రెండో తేదీన ముగియనున్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక.. ఏప్రిల్ 19న మొదటి విడతలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలో 32 స్థానాలకు పోలింగ్ జరగనుంది. తాజా మార్పు ప్రకారం ఫలితాలు జూన్ రెండున వెల్లడికానున్నాయి. -
నవంబర్ 1 నుంచి ఓటర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: నవంబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం– 2022 షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు, ఆపై వయసు కలిగిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభానికి ముందు ఈ నెల 9 నుంచి అక్టోబర్ 31 వరకు సన్నాహక కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. డూప్లికేట్ ఓటర్లు, పునరావృతమైన ఓట్లు, ఇతర తప్పులను తొలగించడం, బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ల పరిశీలన నిర్వహించడం, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ వంటి కార్యక్రమాలను ఇందులో భాగంగా చేపట్టనున్నారు. అనంతరం నవంబర్ 1 నుంచి కింద పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఇతర మార్పుచేర్పుల కోసం ఠీఠీఠీ.nఠిటp. జీn పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శశాంక్ గోయల్ గురువారం ఓ ప్రకటనలో కోరారు. -
కౌంటింగ్‌పై శిక్షణ.. మూడంచెల భద్రత
సాక్షి, విజయవాడ : ఈవీఎం, వీవీప్యాట్లు, ఓట్ల లెక్కింపుపై అవగాహన కల్పించేందుకు.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోన్న రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు, 13 జిల్లాల కౌంటింగ్ కేంద్రాల పర్యవేక్షకులు హాజరయ్యారు. ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ ఓట్ల లెక్కింపు విధానంపై అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రాలలో టేబుల్స్ ఏర్పాట్లు, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టే వీడియో కవరేజ్ అంశాలపై ఈసీ అధికారులకు స్పష్టమైన సూచనలు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ వెల్లడించారు. అభ్యర్థుల వారిగా వీవీప్యాట్ స్లిప్పులను సాగ్రిగేట్చేసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. అభ్యర్థుల వారిగా 25 వీవీప్యాట్ స్లిప్పులను ఒక బండిల్‌గా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఆర్వోలు పూర్తిగా నిర్థారణ చేసుకున్న తర్వాతే ఎన్నికల ఫలితాలు ప్రకటించాలన్నారు. -
‘సాయుధ’ వ్యాఖ్యలపై చర్యలు: ఈసీ
న్యూఢిల్లీ: రాజకీయ నేతలు తమ ఎన్నికల ప్రచారంలో సాయుధబలగాలను వాడుకోవడంపై కేంద్రం ఎన్నికల సంఘం(ఈసీ) స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేతలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన ఫిర్యాదులపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ఈసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత సైన్యాన్ని ‘మోదీజీ సైన్యం’గా అభివర్ణించిన కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, యూపీ సీఎం యోగిలను భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందిగా హెచ్చరించామని వెల్లడించారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ఇటీవల పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన ‘మోదీజీ వాయుసేన’ వ్యాఖ్యలపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. కొన్ని ఫిర్యాదులపై సత్వరం చర్యలు తీసుకుంటున్న ఈసీ మరికొన్ని విషయాల్లో అలసత్వం వహిస్తోందన్న విమర్శలపై స్పందిస్తూ..‘రాజకీయ నేతల ఒక్కో ప్రసంగం ఒక్కో సందర్భాన్ని ఉద్దేశించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీనర్థం మేం ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని కాదు’ అని అన్నారు. ‘బాలాకోట్ వీరుల’కు ఓటు వేయాలంటూ మొదటిసారి ఓటర్లకు మోదీ పిలుపునిచ్చినట్లు అందిన ఫిర్యాదును పరిష్కరించినట్లు ఈసీ తెలిపింది. -
రేపే లోక్‌సభ ఎన్నికల పోరు
సాక్షి, హైదరాబాద్: తొలి దశ లోక్‌సభ ఎన్నికలు రేపే జరగనున్నాయి. తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలు సహా 20 రాష్ట్రాల పరిధిలోని మొత్తం 91 లోక్‌సభ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత లోక్‌సభ ఎన్నికల ప్రచారఘట్టం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. తెలంగాణలోని 16 స్థానాలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. నిజామాబాద్ నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు పోటీ పడుతుండటంతో, అక్కడ పోలింగ్ ప్రారంభానికి ముందు గంట పాటు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో నిజామాబాద్‌లో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 5 లోక్‌సభ స్థానాల పరిధిలోని 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత అసెంబ్లీ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు రాష్ట్రంలోని 17 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపాయి. ఐదు స్థానాల్లో బీఎస్పీ, చెరో రెండు స్థానాల్లో సీపీఐ, సీపీఎం అభ్యర్థులు పోటీ చేస్తుండగా, ఒక స్థానం (హైదరాబాద్) నుంచి ఎంఐఎం పోటీ చేస్తోంది. 17 స్థానాల నుంచి మొత్తం 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో 25 మంది మహిళా అభ్యర్థులున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో 1,49,19,751 మంది పురుషులు, 1,47,76,024 మంది మహిళలు, 1,504 మంది ఇతరులు కలిపి మొత్తం 2,96,97,279 మంది సాధారణ ఓటర్లు ఉన్నారు. 10975 మంది పురుషులు, 346 మంది మహిళలు కలిపి మొత్తం 11,320 మంది సర్వీసు ఓటర్లు వీరికి అదనం. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఓటేయనున్న వారి సంఖ్య 2,97,08,599కు చేరనుంది. ఓటర్లందరికీ ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం మంగళవారం ప్రకటించింది. 34,604 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 2.5 లక్షల మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. పోలింగ్ సిబ్బంది బుధవారం ఉదయం స్థానిక డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకుని, అక్కడి నుంచి ఈవీఎంలు ఇతర ఎన్నికల సామగ్రిని తీసుకుని అదే రోజు రాత్రి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు. 77,365 బ్యాలెట్ యూనిట్లు, 41,051 కంట్రోల్ యూనిట్లు, 43,894 వీవీప్యాట్లను ఎన్నికల్లో వినియోగించనున్నారు. మే 23న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. పోలింగ్ కేంద్రం తెలుసుకోండిలా.. - 9223166166 నంబర్‌కు ‘TS VOTE VOTERID NO’నమూనాలో ఎస్ఎం ఎస్ పంపితే మొబైల్ ఫోన్‌కు పోలింగ్ కేంద్రం చిరునామా వస్తుంది. (ఉదాహరణకు ‘ TS VOTE AB-C1234567’). - 1950 నంబర్‌కు ‘ ECI VOT-ER-ID N’నమూనాలో ఎస్సెమ్మెస్ పంపి తెలుసుకో వచ్చు. (ECI ABC-1234567). - స్మార్ట్ ఫోన్లో నాఓట్ (Naa Vot-e) యాప్ ను డౌన్లోడ్ చేసి లొకేషన్ చెక్‌చేసుకోవచ్చు. - 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసినా కూడా తెలుసుకోవచ్చు. కట్టలు తెంచుకున్న పంపిణీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీల అభ్యర్థులు సర్వశకులూ ఒడ్డు తున్నారు. పోలింగ్‌కు ఒక్క రోజే మిగిలి ఉండటంతో వ్యూహా లకు పదునుపెట్టారు. బూత్ మేనేజ్మెంట్ ఏర్పాట్లు చూసుకుంటూనే, ఓటర్లను ప్రలోభపరిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెల్లారితే పోలింగ్ కావడంతో పోటాపోటీగా డబ్బులు, మద్యం, కానుకలతో ఓటర్లను ముంచేస్తున్నారు. రూ.54.55 కోట్ల నగదు పట్టుబడగా, రూ.9.37 కోట్లు గత 24 గంటల్లో పట్టుబడింది. పోలింగ్‌కు ముందు రోజు రాత్రి ప్రాంతాల వారీగా ఓటర్లకు భారీ తాయిలాల పంపిణీకి రంగం సిద్ధమైంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్రమైన పోటీ ఉన్న సికింద్రాబాద్, ఖమ్మం, భువనగిరి, నల్లగొండ, మల్కాజ్గిరి స్థానాల్లో ఒక్కో ఓటరుకు రూ.2 వేల వరకు పంచుతున్నట్లు తెలిసింది. పోలింగ్ రోజు కీలకమైన బూత్ మేనేజ్మెంట్లలో లోటుపాట్లకు తావు లేకుండా ప్రధాన రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. బూత్ స్థాయి కమిటీలతో సమావేశమై పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తతతో వ్యవహరించా ల్సిన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేస్తున్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందు, పోలింగ్ జరిగే సమయం, పోలింగ్ ముగిశాక చేయాల్సిన పనులను పోలింగ్ బూత్ ఏజెంట్లకు నూరిపోస్తున్నారు. -
ఓడితే రాజకీయ సన్యాసానికి సిద్ధమే
సాక్షి, హైదరాబాద్: కొడంగల్ నియోజకవర్గం నుంచి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. తాను గెలిస్తే రాజకీయాల నుంచి వైదొలిగే దమ్ము మంత్రి కె.తారకరామారావుకు ఉందా.. అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కేటీ రామారావు కనుక మాట మీద నిలబడకుంటే ఆయనది కల్వకుంట్ల వంశమేకాదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఇక్కడ తన నివాసంలో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొడంగల్ నుంచి తాను గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘నేను ఓడిపోతానని కేటీఆర్ చెప్పారు. నిజంగా ఆయన అన్నట్లు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. మరి నేను గెలిస్తే ఆయన రాజకీయ సన్యాసంతోపాటు ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణకు డిమాండ్ చేస్తారా. గడచిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ వందసీట్లు రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్ సవాల్ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 99 సీట్లు వచ్చాయి. అయినా, కేటీఆర్ మాట మీద నిలబడలేదు. కనీసం ఇప్పుడైనా మాట మీద ఉంటారా?’అని రేవంత్ ప్రశ్నించారు. రెండుచోట్ల ఓటు నమోదుపై చర్య తీసుకోవాలి సీఎం కేసీఆర్ రెండుచోట్ల ఓటు నమోదు చేసుకున్నారని, ఇది చట్టరీత్యా నేరమని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో కేసీఆర్ పేరు ఓటర్ల జాబితాలో ఉంది. అదే పేరును అటు ఇటు మార్చి గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో చంద్రశేఖర్‌రావు కల్వకుంట్ల, తండ్రి రాఘవరావు అని ఓటర్ల జాబితాలో నమోదై ఉంది. ఇలా ఒకే వ్యక్తి రెండుచోట్ల ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడం 1950 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 31 ప్రకారం నేరం. ఒకే వ్యక్తి రెండుచోట్ల ఓటుహక్కు కలిగి ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలి. లేనిపక్షంలో చట్టప్రకారం ఏడాది జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశముంటుంది. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలి. చట్టప్రకారం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ పేరుతో రెండుచోట్ల ఓటర్ల జాబితాలో చోటు కల్పించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా’అని రేవంత్ చెప్పారు. కక్షపూరితంగానే ఓట్ల తొలగింపు ఓటుహక్కు ఇవ్వకపోవడం ద్వారా 20 లక్షల మంది ఓటర్లకు అన్యాయం జరిగిందని రేవంత్ అన్నారు. ఈ విషయంపై క్షమించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ కోరగా, కేటీఆర్ మాత్రం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించారని ఎన్నికల అధికారులకు అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని కోర్టుకు చెప్పిన ఈసీ, ఓటర్లకు మాత్రం ఓటు వేసే అవకాశం కల్పించలేదన్నారు. కక్షపూరిత విధానంతో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓట్లు వేసే వాళ్ల వివరాలను బూత్‌లవారీగా గుర్తించి 50 నుంచి 200 ఓట్లు తొలగించారని రేవంత్ ఆరోపించారు. ఓటు హక్కు కల్పించడంలో విఫలమైన అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. -
ఈసీ పరిశీలనలో జనసేన పార్టీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల అనంతరం గత కొంతకాలంగా రాజకీయమౌనం పాటించిన సినీనటుడు పవన్ కల్యాణ్ ఇక తన రాజకీయ పార్టీని విస్తృతం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన గతంలో ప్రకటించిన జనసేన పార్టీని రాజకీయ పార్టీగా నమోదు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు సమర్పించగా, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల మేరకు దరఖాస్తును పరిశీలించిన ఎన్నికల సంఘం ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తిచేసే పనిలో పడింది. లోక్‌సభ, శాసనసభ సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 11 న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో పవన్ కల్యాణ్ తొలిసారి ‘జనసేన’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆయన జనసేనను రాజకీయ పార్టీగా నమోదు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. అందులో పార్టీ అధ్యక్షుడు, చైర్మన్‌గా కె. పవన్ కల్యాణ్ ఉంటారని పేర్కొన్నారు. పార్టీ జనరల్ సెక్రెటరీగా పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడైన బి.రాజు రవితేజ్, కోశాధికారిగా ఎం. రాఘవయ్య పేర్లతో నమోదు చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీలోని లివింగ్ స్పేసెస్ వ్యాలీ వ్యూ, కండొమోనియం, ప్లాట్ నంబర్ 91, రెండో అంతస్తు పార్టీ కార్యాలయంగా పేర్కొన్నారు. రాజకీయ పార్టీగా నమోదు చేయాలని పవన్ కల్యాణ్ సమర్పించిన దరఖాస్తుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో ఈ నెల 23 లోగా తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటన జారీ చేసింది. -
ఏప్రిల్ 16 నుంచి లోక్‌సభ ఎన్నికలు!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తేదీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు పూర్తయినట్లు తెలిసింది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16న ప్రారంభమయ్యే సార్వత్రిక ఎన్నికలు ఐదు విడతల్లో మే 13తో ముగుస్తాయి. మే 16న ఫలితాలు ప్రకటించాలని సంఘం నిర్ణయించిందని తెలిసింది. షెడ్యూల్‌ను మార్చి మొదటి వారంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం షెడ్యూల్ ఇలా ఉంది: తొలివిడత- ఏప్రిల్ 16 (124 సీట్లు), రెండోవిడత- ఏప్రిల్ 22/23 (141 సీట్లు), మూడోవిడత- ఏప్రిల్ 30 (107 సీట్లు), నాలుగో విడత- మే 7 (85 సీట్లు), - ఐదో విడత, మే 13 (86 సీట్లు). -
శిక్ష పడితే వెంటనే వివరాలు ఇవ్వండి
సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో సీఎస్ ఉత్తర్వులు జారీ ప్రజాప్రతినిధులకు ఏ కోర్టు శిక్ష విధించినా 24 గంటల్లో రిపోర్టు ఆ వివరాలను డీజీపీ రాష్ట్ర సీఈవోకు పంపాలి పార్లమెంట్, అసెంబ్లీ స్పీకర్లకు తెలియజేయాలి ప్రతి నెల 15న కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర సీఈవో నివేదిక సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఎవరికైనా న్యాయస్థానాలు శిక్షలు విధిస్తే ఆ వివరాలను వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏ సభ్యుడికైనా శిక్ష పడితే వెంటనే ఆ సభ్యుడిపై అనర్హత వేటు వేయడానికి అనుగుణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఏ న్యాయస్థానాలైనా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై క్రిమినల్ కేసుల్లో గానీ, ఇతర కేసుల్లో గానీ శిక్షలు విధిస్తే ఆ వివరాలను వెంటనే నోడల్ అధికారి అయిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో)కి తెలియజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి నమూనా పత్రాన్ని కూడా ఈ ఉత్తర్వులకు జత చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పేరు.. ఏ న్యాయస్థానం శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఏ చట్టం కింద ఏ సెక్షన్ కింద శిక్ష విధించారు.. శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు తేదీ.. శిక్ష వివరాలను వెల్లడించాలని నమూనా పత్రంలో పేర్కొన్నారు. న్యాయస్థానాలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఎవరికైనా శిక్ష విధిస్తే ఆ వివరాలను డీజీపీ 24 గంటల్లోగా ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల నుంచి తెప్పించుకుని సీఈవోకు తెలియజేయాలని స్పష్టం చేశారు. కొన్ని కోర్టుల్లో సభ్యులకు శిక్ష పడినా పరిశీలనకు రావడం లేదని, ఈ నేపథ్యంలో తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. నేరపూరిత కేసుల్లో సభ్యులు అరెస్ట్ అయితే ఆ వివరాలను వెంటనే పార్లమెంట్, అసెంబ్లీ స్పీకర్లకు, రాజ్యసభ, శాసనమండలి చైర్మన్లకు తెలియజేయాలని.. ఒకవేళ బెయిల్‌పై విడుదలైతే ఆ వివరాలను కూడా తెలియజేయాలని చెప్పారు. ఏదైనా కేసుల్లో సభ్యులకు శిక్ష పడితే ఆ వివరాలను న్యాయస్థానాల్లోని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 24 గంటల్లోగా నోడల్ అధికారైన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెలియజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నోడల్ అధికారైన సీఈవో కేసుల వివరాలను ప్రతి నెల 15న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలనకు తీసుకెళ్లి, ఆయన ఆమోదం తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపాలని చెప్పారు.