
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక సమరం వేళ ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన ‘సీ విజిల్’ యాప్‌ను ప్రజలు సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి శుక్రవారం ఉదయం వరకు ప్రజల నుంచి 79,000కు పైగా ఫిర్యాదులు అందాయి.
ఇందులో 99 శాతానికిపైగా ఫిర్యాదులు పరిష్కరించామని కేంద్ర ఎన్నికల తెలిపింది. వీటిలో 89 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించినట్లు ఈసీ పేర్కొంది. 58,500 కంటే ఎక్కువ ఫిర్యాదులు (73శాతం) అక్రమ హోర్డింగ్‌లు, బ్యానర్‌లకు సంబంధించినవి కాగా.. 1400కు పైగా ఫిర్యాదులు నగదు, బహుమతులు, మద్యం పంపిణీకి సంబంధించినవి ఉన్నాయి.